అన్నదాతలూ అధైర్య పడవద్దు : షర్మిల

గాదెవారిపల్లె (గుంటూరు జిల్లా), 25 ఫిబ్రవరి 2013: అన్నదాతలూ అధైర్య పడవద్దని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి సోదరి శ్రీమతి షర్మిల అభయం ఇచ్చారు. మరో ఆరు నెలలు ఓపిక పడితే జగనన్న ముఖ్యమంత్రి అవుతారని ఆమె ధీమాగా చెప్పారు. రైతన్నలకు మద్దతుగా ధరల స్థిరీకరణ కోసం ప్రత్యేకంగా జగనన్న రూ.3000 కోట్లతో ప్రత్యేకంగా నిధిని ఏర్పాటు చేస్తారని ఆమె పేర్కొన్నారు. జగనన్న సిఎం అయితే మన రాష్ట్రంలో ఏ ఒక్కరూ గుడిసెల్లో ఉండాల్సిన అగత్యం ఉండబోదని భరోసా ఇచ్చారు. మరో ప్రజాప్రస్థానం 74వ రోజు సోమవారం నాడు శ్రీమతి షర్మిల గుంటూరు జిల్లాలోని గాదెవారిపల్లెలో రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ముందుగా శ్రీమతి షర్మిల స్థానికుల నుంచి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వారి సమస్యలను సావధానంగా విన్న అనంతరం ఆమె మాట్లాడారు.

అంతకు ముందు శ్రీమతి షర్మిల పాదయాత్రగా జిల్లాలోని తక్కెళ్ళపాడు చేరుకున్నప్రుడు స్థానికులు, అభిమానులు నీరాజనాలు పట్టారు. తక్కెళ్ళపాడులో ఆమె తన తండ్రి, మహానేత, దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైయస్‌ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. వివిధ పార్టీలకు చెందిన పలువురు నాయకులు వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. అలుపెరుగని శ్రీమతి షర్మిల తన మరో ప్రజాప్రస్థానం పాదయాత్రను తదేక దీక్షతో కొనసాగిస్తున్నారు.
Back to Top