మేడికొండూరు (గుంటూరు జిల్లా): రాష్ట్రంలోని అన్నదాతల సమస్యలు పరిష్కారం కావాలంటే వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాల్సిందేనని పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు అన్నారు. గుంటూరు జిల్లా మేడికొండూరులో శనివారం వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని పార్టీ జిల్లా కన్వీనర్ మర్రి రాజశేఖర్ ప్రారంభించారు. పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవ సభలో అంబటి మాట్లాడారు.<br/>టిడిపి, కాంగ్రెస్ పార్టీలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదని అంబటి వ్యాఖ్యానించారు. ‘ఇందిరాగాంధీ మరణిస్తే ఆమె కుమారుడు రాజీవ్‌కి ప్రధానమంత్రి పదవిని అప్పగించారన్నారు. రాజీవ్‌గాంధీ మరణిస్తే ఆయన భార్య సోనియాకు కాంగ్రెస్ పార్టీ పగ్గాలు అప్పగించిన వైనాన్ని గుర్తుచేశారు. మరి మహానేత వైయస్ మరణిస్తే ఆయన కుమారుడు జగన్మోహన్‌రెడ్డిని ఎందుకు ముఖ్యమంత్రిని చేయలేదని అంబటి నిలదీశారు. అయినప్పటికీ జగన్ సొంతంగా పార్టీ పెట్టుకుని, రాష్ట్ర ప్రజల నుంచి మంచి ఆదరణ పొందుతుంటే ఓర్వలేని కాంగ్రెస్ ప్రభుత్వం ఆయనను జైలుపాలు చేసి బెయిల్ రాకుండా ఇబ్బందులు పెడుతోంద’ని అంబటి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా 2014 ఎన్నికల్లో వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరుగులేని మెజారిటీతో విజయం సాధిస్తుందని ఆయన ధీమా వ్యక్తంచేశారు.<strong><br/></strong><strong>జగన్‌తోనే వైయస్ పథకాల అమలు సాధ్యం: : మర్రి</strong>ఈ సందర్భంగా మర్రి రాజశేఖర్ మాట్లాడుతూ, మహానేత వైయస్ రాష్ర్టంలో ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు అమలు కావాలంటే ఆయన కుమారుడు జగన్మోహన్‌రెడ్డి అధికారంలోకి రావాలని అన్నారు. పార్టీ నాయకుడు రావి వెంకటరమణ మాట్లాడుతూ, తొమ్మిదేళ్ల పాలనలో రైతులకు మేలు చేయలేని టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు మళ్లీ అధికారంలోకి వస్తే రైతుల రుణాలు మాఫీ చేస్తాననడం హాస్యాస్పదం అన్నారు. పార్టీ మండల కన్వీనర్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో గుంటూరు అర్బన్ కన్వీనర్ అప్పిరెడ్డి, పార్టీ నాయకులు షేక్ జిలానీ, చిట్టా విజయభాస్కర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.