బాబు అవినీతిపై కేజ్రీవాల్‌ యుద్ధం చేయాలి

హైదరాబాద్, 28 డిసెంబర్ 2013:

భారత దేశంలోనే అత్యంత ధనవంతుడు, అతి పెద్ద అవినీతిపరుడైన చంద్రబాబు నాయుడిపై అన్నా హజారే, అరవింద్‌ కేజ్రీవాల్‌ యుద్ధం చేయాలని వైయస్ఆర్ కాంగ్రె‌స్ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు అన్నారు. చంద్రబాబు నాయుడు అత్యంత అవినీతిపరుడని 2002లోనే తెహల్కా పత్రిక బహిర్గతం చేసిన వైనాన్ని ఈ సందర్భంగా అంబటి గుర్తుచేశారు. హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన శనివారంనాడు మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో చంద్రబాబును మించిన దోపిడీదారుడు ఇంకొకరెవరూ లేరని ఆయన తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

కాంగ్రెస్‌ పార్టీ అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చేసిన ఆమ్‌ ఆద్మీ పార్టీ ఢిల్లీలో అధికారానికి రావడం మంచి పరిణామం అన్నారు. ఆ పార్టీ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అరవింద్‌ కేజ్రీవాల్‌కు అంబటి శుభాకాంక్షలు తెలిపారు. సామాన్యుడైన కేజ్రీవాల్ ఢిల్లీ సీఎం‌గా ఎదిగి పార్లమెంటరీ ప్రజాస్వామ్యం అంటే ఏమిటో ప్రపంచానికి చాటి చెప్పారన్నారు. దేశ వ్యాప్తంగా అవినీతిపై కేజ్రీవాల్‌ పోరాటం చేయాలని విజ్ఞప్తిచేశారు. దేశవ్యాప్తంగా అనేక కుంభకోణాల్లో ఇరుక్కున్న కాంగ్రెస్‌ పార్టీని ప్రజాశక్తితో మట్టి కరిపించాలన్నారు. మన దేశం నుంచి అవినీతిని తరిమికొట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.

తొమ్మిదేళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు అనేక అవినీతి పనులు చేసి విదేశాల్లోను, బంధువులతోను వ్యాపార లావాదేవీలు పెంచుకుని కోట్లాది రూపాయలు దాచుకున్నారని అంబటి ఆరోపించారు. ఆంధ్రా అన్నా హజారే తానే అన్నట్లుగా, కేజ్రీవాల్‌కు తానే పాఠాలు చెప్పినట్లు పోజులుకొట్టే చంద్రబాబు తొమ్మిదేళ్లు సీఎంగా ఉన్నప్పుడు అవినీతిలో అగ్రగణ్యుడని దుయ్యబట్టారు. అవినీతిపరుల ముఠాలో మొదటివాడైన చంద్రబాబు నాయుడి అవినీతిని ఎండగట్టాల్సిన అవసరం ఉందని తమ పార్టీ భావిస్తోందన్నారు. తన మీదకు ఎలాంటి విచారణలూ రాకుండా వ్యవస్థలను ప్రభావితం చేసి చంద్రబాబు తప్పించుకుంటున్నారని అంబటి ఆరోపించారు.

కొన్ని బలీయమైన కారణాల వల్ల శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి రాజకీయాల్లోకి వచ్చారని అంబటి తెలిపారు. శ్రీ జగన్‌ ఇంతకు ముందెప్పుడూ రాజకీయాల్లో గాని, అధికారంలో గాని లేరన్నారు. కొన్ని స్వార్థపర శక్తులు ఆయనపై  నిరాధారమైన ఆరోపణలతో అబద్ధపు కేసులు పెట్టాయని అన్నారు.

తాజా వీడియోలు

Back to Top