<br/><br/>కర్నూలు: చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తరువాత పొదుపు సంఘాలన్నింటినీ నిర్వీర్యం చేశాడని వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ప్రతిపక్షనేత వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి మండిపడ్డారు. ప్రజాసంకల్పయాత్ర చేస్తున్న వైయస్ జగన్ మోహన్ రెడ్డిని గురువారం వెలుగు యానిమేటర్లు కలిశారు. డ్వాక్రా సంఘాలను టీడీపీ సర్కార్ నిర్వీర్యం చేసిందని, యానిమేటర్లకు కనీస వేతనం కూడా ఇవ్వడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వైయస్ జగన్ మాట్లాడుతూ.. ‘పొదుపు సంఘాలు చంద్రబాబు సర్కార్ హయాంలో నిర్వీర్యం అయ్యాయని ధ్వజమెత్తారు. అలాంటి పొదుపు సంఘాలను నిలబెట్టడానికి విశ్వ ప్రయత్నం చేస్తున్న యానిమేటర్లు... తమ జీతాలు పెంచాలని కోరుతున్నా ఈ ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. పక్కన తెలంగాణలో రూ.5వేలు ఇస్తున్నారని, కనీస పారితోషికం ఇవ్వాలని ప్రభుత్వాన్ని అడిగినా ఫలితం లేదు. వైయస్‌ఆర్ సీపీ అధికారంలోకి వస్తే అయిదు వేలు కాదు... రూ.10వేలు ఇస్తాం.’ అని వైయస్ జగన్ హామీ ఇచ్చారు. దీంతో పొదుపు సంఘాల యానిమేటర్లు హర్షం వ్యక్తం చేశారు.