అప్పుల ఊబిలో ఆంధ్రప్రదేశ్

  • లోటు బడ్జెట్‌పై ప్రభుత్వం  కట్టుకథలు
  • పట్టిసీమ ప్రాజెక్ట్‌ అవినీతిమయమని కాగ్‌ తేల్చేసింది
  • విద్యుత్‌ వ్యవస్థలో లోపాలను కూడా కాగ్‌ బయటపెట్టింది
  •  ఏపీలో ఉన్న కన్సల్టెంట్లు..ప్రపంచంలో ఎక్కడైనా ఉన్నారా?
  • అవినీతిలో ఏపీకి నెంబర్‌ వన్‌ స్థానం
  • వాగ్దానాలు నెరవేర్చలేమని ఒప్పుకోండి
  • పీఏసీ చైర్మన్, ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్‌
హైదారాబాద్‌: రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉందని, వృథా ఖర్చులతో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే, పీఏసీ చైర్మన్‌ బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి మండిపడ్డారు. ఎన్నికల సమయంలో చంద్రబాబు చాలా వాగ్ధానాలు ఇచ్చారని, వాటిని నెరవేర్చలేమని చంద్రబాబు ప్రజల ముందు ఒప్పుకోవాలని బుగ్గన సూచించారు. సరైన పరిపాలన అందించడం ద్వారా ప్రజల మనస్సు చూరగొనాలని హితవు పలికారు. ఆర్భాటాలకు పోకుండా సాధారణ పాలన కొనసాగించాలని ఆయన డిమాండ్‌ చేశారు.lఇటీవల కాగ్‌ విడుదల చేసిన నివేదిక వివరాలను వెల్లడిస్తూ..ఈ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను బుగ్గన ఎండగట్టారు. శనివారం హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు..రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం గొప్పలకు పోయి విఫరీతమైన అప్పులు చేస్తోందని అభ్యంతరం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఆస్తులు కనపడటం లేదని, అప్పులు మాత్రమే కనిపిస్తున్నాయని ఎద్దేవా చేశారు. రాష్ట్ర విభజన తరువాత ఆర్థిక పరిస్థితులు సరిగా లేవని ప్రజలను భయాందోళనకు గురి చేస్తూ.. ప్రభుత్వం వద్ద డబ్బులే లేవన్న ప్రచారం చేస్తూ లోటు బడ్జెట్‌ రూ.16 వేల కోట్లు ఉందని టీడీపీ నేతలు కథలు చెబుతున్నారని విమర్శించారు. సంవత్సరం ముందుగానే లోటు బడ్జెట్‌పై కథలు అల్లుతున్నారని మండిపడ్డారు. 2017–2018 సంవత్సరానికి గాను ఏపీ అప్పులు రూ.2.16 లక్షల కోట్లకు పెరిగాయని ఆందోళన వ్యక్తం చేశారు. కాగ్‌ రిపోర్టు చూస్తే ..రాష్ట్ర స్థూల ఆదాయంను బట్టి 3.1 శాతం మాత్రమే అప్పు చేయాల్సి ఉందన్నారు. అయితే ప్రభుత్వం 2014లోనే 6.5 శాతం అప్పు చేసిందని గుర్తు చేశారు. ఏపీ ప్రభుత్వం అప్పుల విషయంలో చట్ట ఉల్లంఘనకు పాల్పడుతుందని ధ్వజమెత్తారు.. వీటికి సంబంధించి ఇంతవరకు ఎలాంటి వివరణ ఇవ్వడం లేదని విమర్శించారు. రాష్ట్ర విభజన తరువాత ఏపీకి. 58 శాతం జనాభా వచ్చిందన్నారు. ఆదాయం కూడా అలాగే విభజన జరగాలని కోరుకుంటారన్నారు. ఈ రోజు హైదరాబాద్‌ మనకు లేదు కాబట్టి లోటు పడుతుందంటున్నారని చెప్పారు. 2014–2015లో  ఏపీకి 56 శాతం ఆదాయం కూడా వచ్చిందని, ఇందులో మనకు రెండు శాతమే ఆదాయం తగ్గిందన్నారు. కేంద్రం లోటు భర్తీ కోసం రూ.2 వేల కోట్లు ఇచ్చిందని తెలిపారు. 14వ ఆర్థిక సంఘం సిపార్సులో దాదాపు ఐదు సంవత్సరాలకు గాను ప్రత్యేక గ్రాంట్‌ ఇస్తున్నారన్నారు. అయితే ఏపీలో డబ్బులు లేవని, అన్యాయం జరిగిపోయిందని విఫరీతంగా అప్పులు చేస్తున్నారని ఆక్షేపించారు. రాష్ట్ర స్థూల ఉత్పత్తిని పెంచి చూపి అప్పులు చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్ర అప్పు 2015–2016 రూ.1.88 లక్షల కోట్లకు పెంచారు. మనకు మాములుగా 24 శాతం ఉండాల్సిన టార్గెట్‌ 31 శాతానికి పెరిగిందన్నారు. మా అంత మేథవులు లేరని టీడీపీ గొప్పలు చెప్పుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ఎన్ని బిరుదులు ఉన్నాయో అన్ని అవార్డులు వాళ్లకు వాళ్లే ఇచ్చుకుంటు పోతున్నారని విమర్శించారు.  

కసితో అప్పులు చేస్తున్నారు
చంద్రబాబు పాలనలో ప్రభుత్వం ఒక రకమైన కసితో అప్పులు చేస్తుందని ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి అభివర్ణించారు. అసలు మన రెవెన్యూ లోటు ఉందా అని పరిశీలిస్తే ఎప్పుడు అలాంటి పరిస్థితి లేదన్నారు. చంద్రబాబు సీఎంగా ఉన్న 9 ఏళ్లలో రూ. 21 వేల కోట్లు రెవెన్యూ లోటులోకి తీసుకెళ్లారని, దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో ఈ లోటును భర్తీ చేశారని వివరించారు. గతంలో అప్పుకు ఆస్తికి రేషియో చూస్తే వంద రూపాయల రాష్ట్ర అప్పుకు 46 శాతం ఉండేదన్నారు. చంద్రబాబు పాలనలో వందకు రూ.103 అప్పు ఉందని చెప్పారు. టీడీపీ నేతలు మాత్రం చంద్రబాబు బ్రహ్మాండమైన ఆర్థిక సంస్కరణలు తెచ్చామని గొప్పలు చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.  తలసరి అప్పు పెరుగుతోందని మేం బడ్జెట్‌ ప్రసంగంలో చెప్పామని తెలిపారు. మాకు పక్కాగా ఆస్తి కనిపించడం లేదని చెప్పాం. దీనికి సమాధానం చెప్పడం లేదని బుగ్గన పేర్కొన్నారు. ప్రభుత్వం చేస్తున్న ఖర్చు అంతా వృథానే అని కాగ్‌ వెల్లడించినట్లు వివరించారు.  స్థూల ఉత్పత్తి పెరుగుతోందని అబద్ధాలు చెబుతున్నారు. రూ.2500 కోట్లు పడిపోయింది. స్థూల ఉత్పత్తి పెరిగితే పన్నులు ఎలా పెరుగుతాయని బుగ్గన ప్రశ్నించారు. 

 పట్టిసీమ పేరుతో దోపిడీ
పట్టిసీమ పేరుతో ప్రభుత్వం దోపిడీకి తెర లేపిందని ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి ఆరోపించారు. పట్టిసీమ తాత్కాలిక ప్రాజెక్ట్‌ అని,  దీనికి రూ.1170 కోట్లకు ప్రణాళిక రూపొందిస్తే , రూ.1600 కోట్లకు అంచనా పెంచారని కాగ్‌ నివేదికలో పేర్కొన్నట్లు చెప్పారు. అంటే దాదాపు రూ.400 కోట్లు వృథా చేశారని విమర్శించారు. పోలవరం కుడి కాల్వను పూర్తి చేయకపోగా అనవసరంగా ఖర్చులు చేశారని కాగ్‌ అభ్యంతరం చెప్పిందన్నారు. ప్రభుత్వం సాధారణంగా ఎత్తిపోతల పథకాలకు వాడాల్సిన టెక్నాలజీని మార్చి కొత్తవి వాడారని కాగ్‌ తప్పుపట్టినట్లు చెప్పారు. ఇంచుమించు చింతలపూడి పథకంతో పోల్చితే రూ.21 కోట్లు ఖర్చు చేశారని చెప్పారు. పట్టిసీమ పరికరాలకు సెంట్రల్‌ ఎక్సెంజ్‌ డ్యూటీ మినహాయింపు ఉంటుందని, ప్రభుత్వం కాంట్రాక్టర్‌కు ఎందుకు ఎక్సైంజ్‌ డ్యూటీ చెల్లిందని తప్పుపట్టారు. పట్టిసీమలో డిస్ట్రిబ్యూషన్‌ సిస్టమ్‌ లేదని బుగ్గన తెలిపారు.

అవార్డులు వచ్చాయని గొప్పలు
విద్యుత్‌ వ్యవస్థలోని లోపాలను కాగ్‌ బయటపెట్టినట్లు పీఏసీ చైర్మన్‌ బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి తెలిపారు. 2014–15లో రూ.2400 కోట్లు డిస్కామ్‌లకు నష్టం వచ్చిందని చెప్పారు. అయినా, విద్యుత్‌ రంగంలో అవార్డులు పొందామని ముఖ్యమంత్రి గొప్పలు చెప్పటం హాస్యాస్పదమన్నారు. ఉత్పత్తి రేటు రూ.2.90 నుంచి రూ.4 పెరిగిందని, నాసిరకం బొగ్గు కొనుగోలు చేయడం వల్ల రూ.900 కోట్లు నష్టం వచ్చినట్లు చెప్పారు. నాసిరకం బొగ్గు వాడటం వల్ల రూ.86 కోట్లు అదనంగా ఖర్చు చేయాల్సి వచ్చిందని బుగ్గన తెలిపారు.

వ్యవసాయ రంగం కుదేలు
ఎన్నికల సమయంలో రైతుల రుణాలు భేషరత్తుగా మాఫీ చేస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబు మాట తప్పారని ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి విమర్శించారు. బాబు సీఎం అయ్యే నాటికి రూ.87 వేల కోట్ల రైతు రుణాలు ఉన్నాయని, అయితే  దాన్ని క్రమంగా తగ్గించి రూ.22 వేల కోట్లకు తీసుకొని వచ్చారని వ్యాఖ్యానించారు. ఇప్పటివరకు రూ.7,300 కోట్లు మాత్రమే రుణమాఫీ కింద చెల్లించారని కాగ్‌ నివేదిక స్పష్టం చేసినట్లు గుర్తు చేశారు.  పాత పీడీ అకౌంట్లు క్లోజ్‌ చేయకుండా కొత్త పీడీ అకౌంట్లు ప్రారంభించారని కాగ్‌ ఆక్షేపించిన విషయాన్ని బుగ్గన వెల్లడించారు. గురుకుల పాఠశాలల్లో ఉత్తీర్ణత శాతం తగ్గుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. రెసిడెన్షియల్‌ పాఠశాలల్లో జీపీఏ పడిపోయిందని విమర్శించారు.

హెలికాప్టర్‌ అద్దెలోనూ దుబారా
రాష్ట్ర ప్రభుత్వం హెలికాప్టర్లకు చెల్లించాల్సిన అద్దెలోనూ దుబారా చేసిందని పీఏసీ చైర్మన్‌ బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి మండిపడ్డారు. ఏపీ ఏవియేషన్‌ కార్పొరేషన్‌ రూ.14.37 కోట్లు అదనంగా చెల్లించినట్లు తెలిపారు. హెలికాప్టర్‌ను అద్దెకు తీసుకునేటప్పుడు సరైన ప్రమాణాలు పాటించలేదని కాగ్‌ తప్పులు ఎత్తి చూపిన విషయాలను వివరించారు. పూర్తి సమయం హెలికాప్టర్‌ తిరగకుండా అద్దెలు చెల్లించిన విషయాన్ని కాగ్‌ స్పష్టం చేసిందని బుగ్గన వివరించారు. తాత్కాలిక భవనాల నిర్మాణాలు, విదేశీ యాత్రల పేరుతో విచ్చలవిడిగా ప్రజాసొమ్మును వృథా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

అవినీతిలో ఏపీ నెంబర్‌ వన్‌
దేశంలోనే ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం అవినీతిలో నెంబర్‌ వన్‌ స్థానంలో ఉందని ఎన్‌సీఈఆర్‌ రిపోర్టు స్పష్టం చేసినట్లు వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి తెలిపారు. రాజధాని విషయంలో చంద్రబాబు బృందం ప్రత్యేక విమానాల్లో దేశ, విదేశాలు తిరిగి వచ్చారని, చివరకు సినిమా సెట్టింగ్స్‌ దగ్గర ఆగిపోయిందన్నారు. ఇంతదానికి ప్రత్యేకవిమానాల్లో తిరగాల్సిన అవసరం ఏముందని విమర్శించారు. చంద్రబాబు, మరో ఇద్దరు, ముగ్గురు మంత్రలు మాత్రమే ఎంఏ ఎకనామిక్స్‌ చదవినట్లుగా టీడీపీ నేతలు భ్రమల్లో ఉన్నారని ఎద్దేవా చేశారు. వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యేలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి కూడా చంద్రబాబు చదివిన యూనివర్సిటీలోనే ^è దివారని, వారు కూడా పీహెచ్‌డీ పూర్తి చేసిన విషయాన్ని గుర్తు చేశారు. 

అనర్హత వేటు వేయాలి
పార్టీ మారిన ఎమ్మెల్యేలపై ఎందుకు అనర్హత వేటు వేయడం లేదని వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి ప్రశ్నించారు. నలభై ఏళ్ల రాజకీయ అనుభవం ఉందని చెప్పుకునే నాయకులు అనైతిక చర్యలకు పాల్పడుతున్నారని ఆయన విమర్శించారు. ఒక పార్టీ నుంచి గెలిచిన వారు వేరే పార్టీలో చేరితే వారికి పదవులు కట్టబెట్టడం ప్రజాస్వామ్య దేశంలో మంచి పద్ధతి కాదన్నారు. బాధ్యత గల వ్యక్తులు ఇలాంటి చర్యలకు పాల్పడకూడదన్నారు. మంత్రులుగా ఫిరాయించిన వారిని ఎంపిక చేయడం సరికాదన్నారు. ఈ విషయంపై న్యాయపోరాటం చేస్తామని తెలిపారు. పార్టీ మారడం తప్పు. మా అంత అనుభవం ఎవరికి లేదు అని చెప్పుకునే నాయకులు భవితరాలకు ఆదర్శంగా ఉండాలని బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి హితవు పలికారు.
Back to Top