పెంచిన విద్యుత్ చార్జీల తక్షణమే ఉపసంహరించాలి: వైఎస్సార్ కాంగ్రెస్

హైదరాబాద్: చంద్రబాబు ప్రభుత్వం ప్రజలపై మోపిన విద్యుత్ చార్జీల భారాన్ని తక్షణమే ఉపసంహరించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. ఆ పార్టీ అధికార ప్రతినిధి కొలుసు పార్థసారథి సోమవారం ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ.. విద్యుదుత్పాదన వ్యయంలో ఏ మాత్రం పెరుగుదల లేకపోయినా ఇప్పుడు విద్యుత్ చార్జీలను పెంచడమేంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు అధికారం చేపట్టిన తర్వాత అన్ని చార్జీలూ పెరుగుతున్నాయని విమర్శించారు.

గత 9 ఏళ్ల పాలనలో చంద్రబాబు 6 సార్లు విద్యుత్ చార్జీలను పెంచి ప్రజల నడ్డి విరిచారని, అప్పట్లో ఏడాదిన్నరకు ఒకసారి చొప్పున పెంచితే ఇప్పుడు 8 నెలలకే పెంచారని నిప్పులు చెరిగారు. విద్యుదుత్పాదనకు అవసరమైన బొగ్గు ధరలు టన్నుకు 130 నుంచి 140 డాలర్లు ఉంటే ఇప్పుడు 60 నుంచి 70 డాలర్లకు తగ్గాయని, అదే మాదిరిగా క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్ 110 డాలర్లు ఉంటే అదిప్పుడు 50 డాలర్లకు దిగివచ్చిందని వివరించారు. ఈ సమయంలో విద్యుత్ చార్జీలు పెంచడంలో హేతుబద్ధత ఏమిటని ప్రశ్నిం చారు. కేంద్రం తాజాగా 305 మెగావాట్ల అదనపు విద్యుత్‌ను రాష్ట్రానికి కేటాయించిందని దానివల్ల అధిక ధరలకు ఇతర రాష్ట్రాల నుంచి కొనుగోలు చేసే భారం కూడా తప్పిందని పేర్కొన్నారు. డీజిల్‌పై వ్యాట్‌ను విధించడం చూస్తే చంద్రబాబు త్వరలోనే ఆర్టీసీ చార్జీలను పెంచుతారని అర్థమవుతోందన్నారు.
Back to Top