ప్రతిపక్ష ఎమ్మెల్యేలను బలహీన పరిచే కుట్ర

– కడప ఎమ్మెల్యే ఎస్‌బి అంజద్‌బాషా 
వైయ‌స్ఆర్ జిల్లా:  రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు నియోజకవర్గ అభివృద్ది నిధులు ఇవ్వకుండా వారిని బలహీన పరిచే కుట్ర చేస్తున్నారని కడప శాసనసభ్యులు ఎస్‌బి అంజద్‌బాషా ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. శుక్రవారం స్థానిక 21వ డివిజన్‌లోని స్మిత్‌ రోడ్డులో 14వ ఆర్థిక సంఘం నిధులు రూ.10 లక్షలతో చేపట్టిన సీసీ డ్రైన్‌ పనులకు మేయర్‌ సురేష్‌బాబుతో కలిసి ఆయన భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ మూడున్నర సంవత్సరాల్లో కడప నగరానికి ఒక్క రూపాయి నిధులు కూడా ఇవ్వలేదన్నారు. ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నవారు అందరినీ సమానంగా చూడాలని, అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ది చేయాలన్నారు. కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు అందుకు విరుద్దంగా వ్యవహరిస్తున్నారని మండి పడ్డారు. కేంద్ర ప్రభుత్వ నిధులు, ఎంపీ నిధులు, కార్పొరేషన్‌ జనరల్‌ ఫండ్‌తోనే నగరాభివృద్ది చేస్తున్నామని తెలిపారు. నగరప్రజలు ఈ వాస్తవాలు గుర్తించి తెలుగుదేశం ప్రభుత్వానికి బుద్దిచెప్పాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డీఈఈ శ్రీనివాసులు, ఏఈ దిల్షాద్, 21వ డివిజన్‌ వైఎస్‌ఆర్‌సీపీ ఇన్‌చార్జి రవీంద్రనాథ్‌రెడ్డి(ఐస్‌క్రీం రవి), నాయకులు శివకేశవ, రామలక్ష్మణ్‌రెడ్డి, టీపీ వెంకటసుబ్బమ్మ, షఫీ తదితరులు పాల్గొన్నారు. 
Back to Top