‘అమ్మే’ నా రోల్‌ మోడల్‌

హైదరాబాద్‌: తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత(అమ్మ) తనకు రోల్‌ మోడల్‌ అని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలు, ఎమ్మెల్యే ఆర్కే రోజా పేర్కొన్నారు. జయలలిత మృతి పట్ల దిగ్భాంతికి గురైనట్లు రోజా తెలిపారు. హైదరాబాద్‌లోని లోటస్‌పాండ్‌లో మంగళవారం ఆమె మీడియాతో మాట్లాడారు. అనారోగ్యంతో బాధపడుతున్న జయలలితకు రెండు నెలల నుంచి పెద్ద పెద్ద డాక్టర్లు వచ్చి వైద్యం అందిస్తుంటే ఆమె కోలుకుంటారని తాను, అమ్మను అభిమానించే ప్రతి హృదయం ఆశగా ఎదురుచూసిందని రోజా చెప్పారు. సోమవారం అర్ధరాత్రి వేళ జయలలిత మృతి చెందారని ప్రకటించడంతో ఎవరికి కూడా ఆలోచించే పరిస్థితి కూడా లేదన్నారు. నాకు అమ్మ లేదు. జయలలితే తల్లిలాగా నాకు సినిమా పరిశ్రమలోనూ, రాజకీయాల్లోనూ సపోర్టు  ఇచ్చారని రోజా తెలిపారు. ఆమె ఎప్పుడు గెలవాలని నిత్యం ప్రార్థించానని గుర్తు చేశారు. నా ప్రతి ఇంటర్వ్యూలో కూడా జయలలితే నా రోల్‌ మోడల్‌ అని చెప్పానని గుర్తు చే శారు. 

ఆర్టిస్ట్‌గా, పొలిటీషియన్‌గా ఎదగడానికి ఆమె ఎన్ని కష్టాలు పడ్డారో, ఎంతమంది ఆవిడను ఇబ్బంది పెట్టారో మనమందరం కళ్లారా చూశామన్నారు. వాటన్నింటిని దాటుకొని ధృడమైన మహిళాగా ఎదగడం తోటి మహిళలకు స్ఫూర్తి అన్నారు. మహిళలంటే ఏడ్వడం, వంటింటికి పరిమితం కావడం కాదని, పది మంది పది రకాలుగా అన్నారని పారిపోకూడదని  ఆమె నుంచి నేర్చుకున్నానని రోజా తెలిపారు. మనం అనుకున్నది సాధించడానికి జయలలితను స్ఫూర్తిగా తీసుకున్నట్లు రోజా పేర్కొన్నారు. పాలిటిక్స్‌లో నాపై అసెంబ్లీ లోపల, బయట ఎన్ని కుట్రలు జరిగినా కూడా అవన్నీ కూడా తట్టుకోగలిగానంటే, నాకు కష్టం వచ్చిన ప్రతిసారి ఆమెను తలుచుకోవడమే అన్నారు. అలాంటి రోల్‌మోడల్‌ ఇవాళ లేదంటే నేను చాలా కోల్పోయానని రోజా కంట తడిపెట్టారు. దేశం ఓ ఉక్కు మహిళలను కోల్పోయిందని అభిప్రాయపడ్డారు. జయలలిత ఆత్మకు శాంతి చేకూరాలని రోజా భగవంతుడిని కోరుకున్నారు.
 
Back to Top