'అంగన్‌వాడీ వర్కర్లకు పే స్కేల్ ఇవ్వాలి'

హైదరాబాద్‌, 18 ఫిబ్రవరి 2013: తొమ్మిదవ పే స్కేల్ ప్రకారం అంగ‌న్‌వాడీ వర్కర్లు, ఆయాలకు జీతభత్యాలు అందజేయాలని‌ రాష్ట్ర ప్రభుత్వాన్ని వైయస్‌ఆర్ ట్రే‌డ్ యూనియ‌న్ కాంగ్రె‌స్ డిమాండ్ చేసింది. అంగ‌న్‌వాడీల సమస్యలపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించకపోతే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించింది. యూనియన్ అధ్యక్షుడు బి.జన‌క్‌‌ ప్రసాద్ అధ్యక్షతన ఆదివారం పార్టీ కేంద్ర కార్యాలయంలో అంగన్‌వాడీ వర్కర్ల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో అన్ని జిల్లాల నేతలూ హాజరై సమస్యలపై సుదీర్ఘంగా చర్చించారు. సమావేశం‌లో కొన్ని డిమాండ్లను ప్రవేశపెట్టి యూనియన్ ఏకగ్రీవంగా ఆమోదించింది. అంగన్‌వాడీల డిమాండ్లతో కూడిన లేఖను ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సునీతాలక్ష్మారెడ్డికి పంపించారు.

దివంగత ముఖ్యమంత్రి, మహానేత డాక్టర్ వై‌యస్ రాజశేఖరరెడ్డి మరణం తర్వాత అంగ‌న్‌వాడీ కార్యకర్తలను పట్టించుకునే నాథుడే కరువయ్యారని జనక్‌ప్రసాద్ ఆవేదన వ్యక్తం చేశారు. నాలుగేళ్లుగా జీత‌ భత్యాలు పెంచకపోగా వారిని మరింత అవమానాల పాలు చేస్తున్నారని మండిపడ్డారు. కిరణ్ ప్రభుత్వం ‌టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు తొమ్మిదేళ్ల చీకటి పాలనకు కొనసాగింపుగా ఉన్నట్లుందని ఆయన దుయ్యబట్టారు. గతంలో చంద్రబాబు అంగన్‌వాడీ సమస్యలను పరిష్కరించకపోగా ఉద్యమించిన వారిని గుర్రాలతో తొక్కించారని గుర్తుచేశారు.

వైయస్‌ఆర్‌టియుసి సమావేశం డిమాండ్లు ఇవీ..:
- అంగన్‌వాడీ వర్కర్ల సర్వీసును క్రమబద్దీకరించాలి. పే స్కేల్ ప్రకారం జీతభత్యాలు అందజేయాలి.
- పే స్కే‌ల్ అమలు ఆలస్యం అయితే తక్షణమే వర్కర్లకు రూ.10 వేలు, ఆయాలకు రూ.8 వేలు అందజేయాలి.
- పదోతరగతి విద్యార్హత ఉండి పదేళ్ల సర్వీ‌స్ పూర్తి చేసిన వారికి గ్రే‌డ్-2 అర్హత కల్పించాలి.
‌- రాష్ట్రంలోని అన్ని ఐసీడీఎస్ ప్రాజెక్టులకు అమృతహస్తం అమలు‌ చేయాలి. అదే విధంగా సిద్ధంచేసిన ఆహారం (ఆర్టీఈ ఫుడ్) కాకుండా లోక‌ల్ కాస్టు ఆహారాన్నే అందజేయాలి.
‌- వెలుగు పోషకాహార కేంద్రాలకు కూడా అమృతహస్తం అందజేయాలి.
- 60 ఏళ్ల వయస్సు పైబడిన ఆయాలు, వర్కర్లకు రిటైర్‌మెంట్ కల్పించి, వారికి రూ.రెండు లక్షలు అందజేయడంతో పాటు నెల నెలా పెన్ష‌న్ అందజేయాలి.
‌- వర్కర్లు, ఆయాలు ప్రమాదవశాత్తు మరణిస్తే వారికి ఇచ్చే పరిహారాన్ని రూ.1.50 లక్షలకు పెంచాలి. దహన సంస్కారాల కోసం అదనంగా రూ.10 వేలు అందజేయాలి.
- వంటచెరకు కోసం ప్రభుత్వం అందజేస్తున్న రూ.150ని వెయ్యి రూపాయలకు పెంచాలి.
- అంగన్‌వాడీ సిబ్బందికి వేసవి సెలవులు మంజూరు చేయాలి.
- జీవో నెం 7 ప్రకారం అంగన్‌వాడీలకు నామమాత్రపు ధరకు ఇళ్ల నిర్మించి ఇవ్వాలి.
Back to Top