అందుకే.. 'కరెంటు సత్యాగ్రహం'

హైదరాబాద్, 2 ఏప్రిల్‌ 2013: విద్యుత్‌ రంగం పట్ల కిరణ్‌ కుమార్‌రెడ్డి ప్రభుత్వం ప్రదర్శిస్తున్న నిర్లక్ష్యం వల్లే రాష్ట్రంలో తీవ్ర విద్యుత్‌ సంక్షోభం నెలకొన్నదని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ గౌరవ అధ్యక్షురాలు శ్రీమతి వైయస్‌ విజయమ్మ నిప్పులు చెరిగారు. కరెంటు సరఫరా చేయకపోయినా చార్జీలు విపరీతంగా పెంచేసి, బిల్లులు రెట్లకు రెట్లు వేసి ఈ ప్రభుత్వం వసూలు చేస్తున్నదని ఆమె ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రతి ప్రజా సమస్యపైనా వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి గత మూడేళ్ళుగా స్పందిస్తూనే ఉన్నారని చెప్పారు. విద్యుత్‌ సమస్యలపై వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అసెంబ్లీలో గొంతెత్తి అరిచినా ఈ ప్రభుత్వం చెవికి ఎక్కించుకోలేదని ఆమె దుయ్యబట్టారు. అందుకే 'కరెంటు సత్యాగ్రహం' చేస్తున్నట్లు తెలిపారు. విద్యుత్‌ సంక్షోభంపై ప్రజల్లో చైతన్యం కలిగించాలని తాము ఉద్యమాలు చేస్తున్నామన్నారు. హైదరాబాద్‌ ఆదర్శనగర్‌లోని న్యూ ఎమ్మెల్యే క్వార్టర్ల ప్రాంగణంలో మంగళవారం ఉదయం ఆమరణ దీక్ష ప్రారంభించిన సందర్భంగా శ్రీమతి విజయమ్మ ప్రసంగించారు. ప్రజలే ప్రభుత్వానికి తగిన సమయంలో సరైన బుద్ధి చెబుతారని ఆమె హెచ్చరించారు.

ప్రజా కంటక కాంగ్రెస్‌ ప్రభుత్వంపై తాము పెట్టిన అవిశ్వాస తీర్మానానికి టిడిపి మద్దతు ఇచ్చి ఉంటే ప్రభుత్వం ఉండేదా? ప్రజలకు కరెంటు కష్టాలు వచ్చేవా? అని శ్రీమతి విజయమ్మ ప్రశ్నించారు. కేసులకు చంద్రబాబు భయపడకపోతే ఇప్పుడు ఈ దుర్గతి ఉండేది కాదన్నారు. సరైన ప్రతిపక్షం లేకపోవడం వల్లే రాష్ట్ర ప్రజలకు ఈ దుర్భర పరిస్థితులు వచ్చిపడ్డాయని ఆమె ఆవేదన వ్యక్తంచేశారు. విద్యుత్‌ సమస్యపై టిడిపి డ్రామాలు ఆడుతోందన్నారు. చంద్రబాబు హయాంలో రాష్ట్రంలో 18 నుంచి 20 గంటల విద్యుత్‌ కోత ఉండేదన్నారు. విద్యుత్‌ సమస్య విషయంలో ప్రభుత్వంపై ఒత్తిడి పెరగాలంటే టిడిపి సహకరించాల్సిందే అన్నారు. ఎనిమిదేళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు 8 సార్లు విద్యుత్‌ చార్జీలు పెంచింది చంద్రబాబే అని విమర్శించారు.

వైయస్‌ఆర్ కాంగ్రె‌స్ పార్టీ ప్రజల పక్షాన నిలబడి‌, ప్రజా సమస్యలపై పోరాడుతుందని శ్రీమతి విజయమ్మ తెలిపారు. రాష్ట్ర ప్రజలపై కిరణ్‌ ప్రభుత్వం పెనుభారం మోపిందని ఆమె మండిపడ్డారు. ఈ నాలుగేళ్ళలో కిరణ్‌ ప్రభుత్వం నాలుగుసార్లు విద్యుత్‌ చార్జీలు పెంచిందని ఆరోపించారు. ప్రభుత్వ ఆదాయం భారీగా పెరిగినా విద్యుత్‌ చార్జీలు ఎందుకు పెంచారని ఆమె నిలదీశారు. కరెంట్ ‌చార్జీలు తగ్గించేవరకూ తమ పోరాటం కొనసాగుతుందని శ్రీమతి విజయమ్మ స్పష్టం చేశారు. పెంచిన విద్యుత్‌ చార్జీలను బేషరతుగా ఉపసంహరించాలన్నది తమ డిమాండ్ అన్నారు.

కరెంట్‌ సరఫరా లేక పంటలు ఎండిపోతున్నాయని, ఎండిపోయిన పంటలను చూసి రైతన్నలు ఆవేదనతో ఆత్మహత్యలు చేసుకుంటున్నారని శ్రీమతి విజయమ్మ విచారం వ్యక్తం చేశారు. రైతుల కష్టాలు చూసి చలించిపోయిన మహానేత వైయస్‌ఆర్ అప్పట్లో ఉచిత విద్యు‌త్ ఇచ్చారని విజయమ్మ గుర్తుచేశారు. వై‌యస్‌ఆర్ హయాంలో ఉచిత విద్యు‌త్ ‌సక్రమంగా అమలైందన్నారు. ఆయన ఏనాడూ విద్యుత్‌ చార్జీలు పెంచలేదన్నారు. ఆ మహానేత మరణించిన తరువాత ఉచిత విద్యుత్ పథకానికి కిర‌ణ్ ‌ప్రభుత్వం తూట్లు పొడిచిందని విమర్శించారు. 2014 వరకూ విద్యుత్‌ చార్జీలు పెంచబోమని దివంగత మహానేత డాక్టర్‌ వైయస్‌ఆర్‌ ఆనాడే హామీ ఇచ్చారన్నారు. బొత్స, కిరణ్‌ల వద్ద మేనిఫెస్టో లేకపోతే తాము ఇస్తామన్నారు. ఉచిత విద్యుత్‌ ఇస్తామని కాంగ్రెస్ ఎన్నికల‌ మేనిఫెస్టోలో చెప్పలేదన్న వారిద్దరి మాటలను శ్రీమతి విజయమ్మ తిప్పికొట్టారు.

కరెంట్ బిల్లు‌లు రెట్టింపు పెంచేస్తే సామాన్యులు ఎలా చెల్లించగలరని శ్రీమతి విజయమ్మ సూటిగా ప్రశ్నించారు. ప్రజల ఓట్లతో గెలిచినవారికి ఈ ఆలోచన లేదా అని నిలదీశారు. 200 యూనిట్లు విద్యుతు వాడిన సామాన్యుడిపై రూ. 818 బిల్లు వేస్తే ఏ విధంగా చెల్లించగలడని శ్రీమతి విజయమ్మ ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు. పెంచిన చార్జీలను ప్రభుత్వమే భరించాలని ఆమె డిమాండ్‌ చేశారు. ఇది ఖజానా సమస్యా? లేక నాయకుల ఆలోచనా సమస్యా అని ఎద్దేవా చేశారు. ప్రజల కష్టాలను భరించాల్సింది ప్రభుత్వమే అన్నారు. అన్నదాతల కష్టాలు ఈ ప్రభుత్వం పట్టించుకోవడంలేదని తూర్పారపట్టారు. బషీర్‌బాగ్‌ను చూస్తే చంద్రబాబు అరాచకాలు గుర్తుకు రావడంలేదా? అని శ్రీమతి విజయమ్మ ప్రశ్నించారు.

రాష్ట్రం దెబ్బతింటోందన్న ఉద్దేశంతో వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ తరఫున రెండుసార్లు అవిశ్వాసం కూడా పెట్టామని శ్రీమతి విజయమ్మ తెలిపారు. ప్రజల సమస్యలపై వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ నిరంతరం పోరాటాలు చేస్తుందని ఆమె పేర్కొన్నారు. కరెంట్‌ చార్జీలే కాదు అన్ని ధరలూ పెంచేసిన ఘనత కిరణ్‌ ప్రభుత్వానిదే అని దుమ్మెత్తిపోశారు. కరెంటు చార్జీల పెంపుపై బుధవారం నుంచి ఈ నెల 14 వరకూ తమ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలను నిర్వహిస్తామని ఆమె తెలిపారు.

తాజా ఫోటోలు

Back to Top