వైయస్‌పై అభాండాలు వేయడమే కాంగ్రెస్‌ పని

హైదరాబాద్ :

ప్రతి విషయాన్నీ మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డికి అంటగట్టి నీచాతి నీచమైన రాజకీయాలు చేయడం కాంగ్రెస్‌ నాయకులకు అలవాటుగా మారిపోయిందని వైయస్‌ఆర్ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు నిప్పులు చెరిగారు. భౌతికంగా మన మధ్యన లేని ఆయన స్వయంగా వచ్చి సమాధానం చెప్పుకోలేరని వారు అభాండాలు వేయడానికి తెగిస్తున్నారని అంబటి దుయ్యబట్టారు. ‘చిరంజీవిని పార్టీలోకి చేర్చుకునేటప్పుడు కూడా ఆ నెపాన్ని వైయస్‌ పైనే నెట్టే ప్రయత్నం చేశారు. ఇప్పుడు రాష్ట్ర విభజనను కూడా వైయస్‌కు ముడిపెట్టి ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌రెడ్డి మాట్లాడటం సిగ్గుచేటు' అని రాంబాబు విమర్శించారు.

‌'మహానేత డాక్టర్‌ వైయస్‌ రాజశేఖరరెడ్డి అధికారంతో ఉన్నప్పుడు కాంగ్రెస్ అధిష్టానం విభజన గురించి ఎందుకు ఆలోచించలేదు? వైయస్ మరణించిన తర్వాతనే ఎందుకు నిర్ణయం తీసుకున్నారు? వీటన్నింటికీ సమాధానం చెప్పాలి. ఆనాడు రాజశేఖరరెడ్డి అసెంబ్లీలో చేసిన ప్రకటనను ఒకసారి  కిరణ్‌ కుమార్‌రెడ్డి గుర్తుచేసుకోవాలి. ‌ఇప్పుడు కిరణ్ లేవనెత్తిన అంశాలనే గతంలో రాజశేఖరరెడ్డి సభలో ప్రస్తావించారు. అలాంటిది వైయస్‌పై బురద చల్లడమేంటి? ఈ రోజు దొంగ నాటకాలు ఆడుతున్నారంటూ ఇతర పార్టీలను కిరణ్ విమర్శించడం ఆయన దివాలాకోరుతనాన్ని తెలియజేస్తుంది. ‌సిడబ్ల్యుసి నిర్ణయం వచ్చినప్పుడు కిరణ్‌ ఏం చేశారు? అప్పుడు చప్పుడు నోరు మెదపకుండా ఇప్పుడు దొంగ నాటకం ఆడుతున్నది కిరణ్‌ కుమార్‌ రెడ్డి’ అని అంబటి దుయ్యబట్టారు.

తాజా ఫోటోలు

Back to Top