వ్యవస్థలను భ్రష్టుపట్టించడంలో బాబు నంబర్ వన్

  • ప్రతిపక్షంపై కక్షపూరితంగా వ్యవహరిస్తున్న సీఎం
  • వైయస్‌ఆర్‌ ఇలానే ఉంటే మీరుండేవారా బాబూ
  • ఎమ్మెల్యే రోజాకు ఎందుకు ఆహ్వానం పంపారు
  • హోదా కోసం 104 భాషల్లో ఫ్లకార్డ్స్‌
  • వైయస్‌ఆర్‌ సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు
గుంటూరు: వాస్తవాలు రాసిన జాతీయ పత్రికలు అమ్ముడుపోయాయని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించడం బాధాకరమని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు అన్నారు. చంద్రబాబుకు అనుకూలంగా రాస్తే అమ్ముడు పోలేదు.. వ్యతిరేకంగా రాస్తే అమ్ముడు పోయాయని అంటారా అని ధ్వజమెత్తారు. గుంటూరు జిల్లా వైయస్‌ఆర్‌ సీపీ కార్యాలయంలో పార్టీ సీనియర్‌ నేత, ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లుతో అంబటి రాంబాబు కలిసి మాట్లాడారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి అయిన తరువాత నాలుగు ఈవెంట్లు నిర్వహించామని మహిళా పార్లమెంటరీ సదస్సు తనకు సంతృప్తినిచ్చిందని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ఈవెంట్‌లను మ్యానేజ్‌ చేసే వ్యక్తిలా ముఖ్యమంత్రి ప్రవర్తించడం బాధాకరమన్నారు. చిత్తశుద్ధితో చేయాల్సిన మహిళా సదస్సును ఈవెంట్‌తో పోల్చుతూ ప్రారంభం... విజయవంతం అంటూ గొప్పలు చెప్పుకుంటున్నారని మండిపడ్డారు. చాలా అనుభవం ఉందని చెప్పుకొని తిరిగే వ్యక్తి ఎందుకు తొందరపాటు పడుతున్నారో అర్థం కావడం లేదని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు కారు షెడ్‌లో ఉండాలి... మహిళలు ఇంట్లో ఉండాలని మాట్లాడడం తప్పుకాదని ముఖ్యమంత్రి సమర్థించడం దురదృష్టకరమన్నారు. తప్పేమీ లేకుండానే జాతీయ పత్రికలు రాశాయా అని చంద్రబాబును నిలదీశారు.

అలాంటి లక్షణాలున్నవాటిని బాబు ముందేకొన్నారు
ఎంత పవిత్రమైన వ్యవస్థలనైనా భ్రష్టుపట్టించగల శక్తి, సామర్ధ్యం గల ఏకైక వ్యక్తి చంద్రబాబేనని అంబటి విమర్శించారు. జాతీయ మీడియా అమ్ముడుపోయాయి అంటున్నారు.. అలాంటి లక్షణాలు ఉన్న పత్రికలు ఇంతకు ముందే చంద్రబాబు కొన్నారని దుయ్యబట్టారు. జాతీయ మీడియాను కొనే శక్తి చంద్రబాబుకు తప్ప మరెవ్వరిరీ లేదని చురకంటించారు.  నిన్న మొన్నటి వరకు వాస్తవాలు ప్రచురిస్తున్న సాక్షిని మూసేస్తా మూసేస్తా అని జపం చేసి బాబు నేడు టీడీపీ బాగోతాలను బట్టబయలు చేస్తున్న జాతీయ మీడియా అమ్ముడుపోయిందని మీడియాపై ఆరోపణలకు దిగుతున్నారన్నారు. వాస్తవాలు ప్రచురిస్తున్న ఫోర్త్‌ ఎస్టేట్‌పై ఆరోపణలు చేయడం శ్రేయస్కరం కాదని హితవుపలికారు. మహిళా సాధికారతను చిత్తశుద్ధితో నిర్వహించివుంటే చంద్రబాబుకు అభినందనలు అందేవన్నారు. చంద్రబాబు పేరు ప్రతిష్టల కోసం పాకులాడడం తప్ప మహిళల పట్ల చిత్తశుద్ది లేదని స్పష్టంగా అర్థం అవుతుందని చెప్పారు.

ప్రతిపక్షాన్ని అణగదొక్కాలనే కక్ష
పనిగట్టుకొని చంద్రబాబు ప్రధాన ప్రతిపక్షాన్ని అణగదొక్కాలని కక్షగట్టుకున్నారని అంబటి విమర్శించారు. దివంగత మహానేత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైయస్‌ రాజశేఖరరెడ్డి కక్షపూరితంగా వ్యవహరించి వుంటే మీరు ఉండేవారా అని చంద్రబాబును ప్రశ్నించారు. ఏనాడైనా వైయస్‌ఆర్‌ ప్రతిపక్షాన్ని కించపరిచారా.. అక్రమంగా అరెస్టులు చేయించారా అని నిలదీశారు. ప్రతిపక్షం అంటే ఖచ్చితంగా విమర్శలు చేస్తుందన్నారు. విమర్శలు కూడా తట్టుకోలేని పరిస్థితుల్లో చంద్రబాబు దిగజారా అని ప్రశ్నించారు. ఎమ్మెల్యే రోజా గోడవ చేస్తామంటే రానిస్తారా అని చంద్రబాబు మాట్లాడడం సిగ్గుచేటన్నారు. అలాంటప్పుడు రోజాకు ఎందుకు ఆహ్వానం పంపారని ప్రశ్నించారు. ప్రభుత్వ తప్పులపై మాట్లాడుతుందని సంవత్సరం పాటు రూల్స్‌కు వ్యతిరేకంగా సస్పెండ్‌ చేశారని మండిపడ్డారు. సదస్సుకు రాకపోతే మహిళల పట్ల గౌరవం లేదు కాబట్టే రాలేదంటారు. వస్తేనేమో అడ్డగించి పోలీసులతో నిర్భందిస్తారని దుయ్యబట్టారు.

 ప్రభుత్వానికి సిగ్గుండాలి
మహిళలపై దాడులు జరుగుతున్నా ప్రతిపక్షం పట్టించుకోకూడదా అని అంబటి చంద్రబాబును ప్రశ్నించారు. మీ సొంత పార్టీ జెడ్పీ చైర్మన్‌ జానీమూన్‌ మంత్రి వల్ల ప్రాణభయం ఉందని బయటకు వచ్చి చెప్పిందంటే ప్రభుత్వానికి సిగ్గుండాలన్నారు. ఇదేనా మహిళా సాధికారత పెంపొందించడమని నిలదీశారు. చంద్రబాబు చరిత్ర సృష్టించలేదని, చరిత్ర హీనులుగా మిగిలిపోయే విధంగా ప్రవర్తిస్తున్నారన్నారు. పుష్కరాల్లో ఎంతోమంది మృత్యువాతపడినా ఇప్పటి దిక్కుమొక్కు లేకుండా పోయిందన్నారు. ప్రభుత్వం చేతుల్లో కొన్ని మీడియాలున్నాయనో... నోరు పెద్దదనో మాట్లాడడం సమంజసం కాదన్నారు. ఇప్పటికైనా చంద్రబాబు బుద్ధిమార్చుకొని ప్రవర్తించాలని, ఎమ్మెల్యే రోజా లాంటి వారిపై కక్షతో వ్యవహరించడం శ్రేయస్కరం కాదని హెచ్చరించారు. 

హోదా కోసం 104 బాషల్లో...
ప్రత్యేక హోదా సాధన కోసం ఈ నెల 16న గుంటూరులో నిర్వహించే యువభేరిని పురస్కరించుకొని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సేవాదళ్‌ నేత సీపీరెడ్డి 104 బాషల్లో హోదా కావాలని ఫ్లకార్డ్స్‌ తయారు చేశారన్నారు. వాటిని అంబటి, ఉమ్మారెడ్డి మీడియా ముందు ప్రదర్శించారు. 104 బాషల్లో కేంద్రానికి ఏ బాష అర్థం అవుతుందో ఆ బాష తెలుసుకొని హోదా ప్రకటించాలని ఆకాంక్షించారు. 

 
Back to Top