ఫైబర్‌ కుట్రపూరిత గ్రిడ్‌


కేబుల్‌ ఆపరేటర్స్‌ను రోడ్డుపై నిలబెట్టాలనే దుర్బద్ధి
తనకు ఇష్టమైన ఛానల్స్‌ మాత్రమే చూపించేందుకు కుట్ర
ప్రభుత్వ సంస్థలు టెలివిజన్‌ రంగంలోకి వెళ్లొద్దని చంద్రబాబుకు తెలియదా
కేబుల్‌ ఆపరేటర్స్‌కు పార్టీ అండగా ఉంటుంది
విజయవాడ: కేబుల్‌ ఆపరేటర్స్‌ వ్యవస్థను రోడ్డున పడేసేందుకు చంద్రబాబు కుట్రపూరితంగా ఫైబర్‌ గ్రిడ్‌ను తీసుకువచ్చారని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు అన్నారు. టెలివిజన్‌ రంగంపై పెత్తనం చలాయించాలనే దుర్బుద్ధిలో చంద్రబాబు, లోకేష్‌ ఉన్నారని మండిపడ్డారు. విజయవాడ వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో అంబటి రాంబాబు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఫైబర్‌ గ్రిడ్‌ ఒక విప్లవం అని దీని ద్వారా ప్రతి ఇంటికి కేబుల్‌ టీవీ, హైస్పీడ్‌ ఇంటర్నెట్‌ సర్వీసులు కేవలం రూ. 149కే అందిస్తామని చంద్రబాబు మాట్లాడారని గుర్తు చేశారు. ఫైబర్‌ గ్రిడ్‌ ఏ విధంగానూ ప్రజలకు ఉపయోగపడదన్నారు. కుట్రపూరితంగా ఏర్పాటు చేసిన గ్రిడ్‌ ఇదన్నారు. వైయస్‌ఆర్‌ సీపీ టెక్నాలజీకి వ్యతిరేకం కాదని, టెక్నాలజీ కొత్తదనానికి ప్రజలు చేరువ కావాలన్నారు. కానీ ప్రభుత్వం మసిపూసి మారేడు కాయ చేస్తుందని ధ్వజమెత్తారు. టెక్నాలజీ ప్రైవేట్‌రంగంతో పాటు ప్రభుత్వరంగం కూడా పోటీ పడినప్పుడే మంచి నాణ్యతగా అందించే అవకాశం ఉంటుందన్నారు. గతంలో బీఎస్‌ఎన్‌ఎల్‌ తప్ప వేరే ఫోన్‌ లేదన్నారు. కానీ ఇప్పుడు ప్రైవేట్‌రంగం వచ్చాక ఫోన్‌ చార్జిలు చాలా చౌకగా లభిస్తున్నాయన్నారు. టెక్నాలజీ పెరిగిన తరువాత అందరూ పాల్గొనేటట్లు ఉండాలి కానీ.. ప్రభుత్వమే మోనోపలైజ్‌ చేసి దాన్ని స్వాధీనం చేసుకోవాలనే ప్రయత్నం ఫైబర్‌ గ్రిడ్‌ ద్వారా జరుగుతుందన్నారు. 

ట్రాయ్‌ రూల్స్‌ ప్రకారం ఏ ప్రభుత్వ సంస్థ అయినా టెలివిజన్‌ రంగంలోకి రాకూడదని నిబంధన ఉందని అంబటి గుర్తు చేశారు. కానీ చంద్రబాబు దొడ్డిదారిన ఇంటర్నెట్‌ పొటోకాల్‌ టీవీ అనే విధానంతో కేబుల్‌ రంగంలోకి వస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు, లోకేష్‌ ఒక దుర్బుద్దితో ఒక మెమోను కూడా విడుదల చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫైబర్‌ గ్రిడ్‌ కార్పొరేషన్‌ తప్ప ఎవరూ విద్యుత్‌ స్తంభాలపై లైన్‌లు వేయడానికి వీల్లేదని చట్టవిరుద్ధమైన ఆర్డర్‌ను పాస్‌ చేశారన్నారు. 4బీ రైట్‌ వే ఆఫ్‌ కేబుల్‌ ఆపరేషన్‌ అండ్‌ పర్మీషన్‌ బై పబ్లిక్‌ అథారిటీ సెక్షన్‌ ప్రకారం లైసెన్స్‌ తీసుకున్న వారు అండర్‌ గ్రౌండ్, పోల్స్‌పై లైన్లు వేసుకోవచ్చు అని నిబంధన ఉందన్నారు. కడపలో కొంతమంది కేబుల్‌ ఆపరేటర్స్‌ కోర్టును ఆశ్రయిస్తే కోర్టు చంద్రబాబు మెమోను కొట్టిపారేసిందన్నారు. తరువాత ఏపీ ఎస్‌ఎఫ్‌ఎల్‌ తప్ప మిగితా ఎవరూ వేసుకున్నా తీసేయమని, అవసరం అయితే పోలీసుల సహకారం తీసుకోవాలని చెప్పడం దుర్మార్గమన్నారు. అంటే ఏపీ ఎస్‌ఎఫ్‌ఎల్‌ ఒక్కరే బిజినెస్‌ చేయాలా అని ప్రశ్నించారు. 

మీడియాపై తన పెత్తనం చెలాయించేందుకు కేబుల్‌ ఆపరేటర్స్‌ సిస్టమ్‌లోకి ప్రభుత్వం ఎంటర్‌ అవుతుందని అంబటి మండిపడ్డారు. గతంలో చంద్రబాబు చెబితే ఒక చానల్‌ను 6 నెలల పాటు ఆంధ్రప్రదేశ్‌లో ప్రసారం కానివ్వకుండా నిలిపివేశారని గుర్తు చేశారు. ఆపరేటర్‌ వ్యవస్థను అంతా తన దగ్గరకు తెచ్చుకుంటే ఇష్టం వచ్చిన చానల్‌ను మాత్రమే చూపించవచ్చు అని కుట్రతో ఫైబర్‌ గ్రిడ్‌ తీసుకువచ్చార ని విరుచుకుపడ్డారు. న్యూస్‌ తప్ప అన్ని పే చానల్స్‌ ఉన్నాయని, అలాంటప్పుడు రూ.149కి ఎలా ఇస్తారని, ఇది సాధ్యపడే గ్రిడ్‌ కాదన్నారు. ఫైబర్‌ గ్రిడ్‌తో వినియోగదారులకు తీవ్రమైన నష్టం కలుగుతుందన్నారు. ఫైబర్‌ గ్రిడ్‌లో  వందల కోట్ల కుంభకోణం జరిగిందని, ఈవీఎంల దొంగతనం కేసుల్లోని నిందితుడు వేమూరి హరికృష్ణను సలహాదారుడిగా పెట్టుకున్నారన్నారు. హెరిటేజ్‌లో డైరెక్టర్‌లు కొల్లి రాజేష్, దేవినేని సీతారాంలు కూడా దీంట్లో భాగస్వాములుగా ఉన్నారన్నారు. తన కోటరీకి దొడ్డిదారిన డబ్బులు అందించేందుకు, కేబుల్‌ ఆపరేటర్‌ వ్యవస్థను తన ఆదీనంలోకి తెచ్చుకునేందుకు ఫైబర్‌ గ్రిడ్‌ ఏర్పాటు చేశారన్నారు. కేబుల్‌ ఆపరేటర్స్‌కు వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అండగా ఉంటుందని అంబటి భరోసా ఇచ్చారు.  
 
Back to Top