బాబుకు అంత అధికార గర్వం పనికిరాదు

  • ఇందిరాగాంధీ, ఎన్టీఆర్ లే ఓడిపోయారు
  • చంద్రబాబు నీవు ఓడింది మర్చిపోయావా..?
  • డబ్బులు, ప్రలోభాలతోనే టీడీపీ గెలుపు
  • నియంతలే అధికారం శాశ్వతమనుకుంటారు
  • ప్రజాసంక్షేమం కోసం పోరాడుతూనే ఉంటాం
  • టీడీపీని ఓడించేవరకు వైయస్సార్సీపీ నిద్రపోదు
  • వైయస్సార్సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు
గుంటూరుః శాశ్వతంగా అధికారం టీడీపీదేనంటూ చంద్రబాబు అహంభావంతో మాట్లాడుతున్నారని వైయస్సార్సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు మండిపడ్డారు. ఇందిరాగాంధీ, ఎన్టీఆర్ లాంటి మహా నాయకులే ఓడిపోయారని, కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు చంద్రబాబు కూడ ఓడిపోయారన్న సంగతిని గుర్తెరగాలన్నారు. నియంతలే అధికారం శాశ్వతమని అనుకుంటారని, సద్దాం హుస్సేన్, హిట్లర్ లు తాము శాశ్వతమనుకొని ఏమైపోయారో బాబు తెలుసుకోవాలన్నారు. ఏదీ శాశ్వతం కాదన్న సంగతి బాబు గ్రహించాలన్నారు.  నంద్యాల ఎన్నిక ప్రలోభాల ఎన్నిక అని అంబటి రాంబాబు అన్నారు. గుంటూరులో పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో అంబటి రాంబాబు మాట్లాడారు. వైయస్సార్సీపీ పనైపోయిందన్న అధికార టీడీపీ నేతల వ్యాఖ్యలపై అంబటి రాంబాబు మండిపడ్డారు. 

 2012లో జరిగిన ఎన్నికల్లో టీడీపీకి డిపాజిట్లు కూడ రాలేదని,  ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో మళ్లీ  అధికారంలోకి వచ్చారన్నారు. నంద్యాల, కాకినాడలో విజయం సాధించినంత మాత్రాన తామే శాశ్వతం అనుకోవడం టీడీపీ అంహకారానికి నిదర్శనమన్నారు.  కాకినాడలో చంద్రబాబు బీజేపీకి వెన్నుపోటు పొడిచాడని అంబటి రాంబాబు అన్నారు. బీజేపీకి కేటాయించిన స్థానాల్లో కూడ టీడీపీ రెబల్సే గెలిచారన్నారు. బీజేపీ మూడు చోట్ల మాత్రమే గెలిచిందని అన్నారు. చంద్రబాబు తీరుపై బీజేపీ ఆలోచించుకోవాలని సూచించారు. నంద్యాలలో ముస్లింలు ఎక్కువగా ఉన్నారని బీజేపీ జెండాలు కనబడకుండా చంద్రబాబు రాజకీయం చేసి గెలిచారని అంబటి విమర్శించారు. పోల్ మేనేజ్ మెంట్, పొలిటికల్ మేనేజ్ మెంట్ తో గెలిచామని బాబు చెబుతున్నాడంటేనే టీడీపీ విజయం ఎలాంటిదో అర్థమవుతోందన్నారు. బాబు ప్రజల అభిమానంతో గెలవలేదని స్పష్టంగా తెలుస్తోందన్నారు. 

డబ్బు, అధికారం, పోల్ మేనేజ్ మెంట్ ఉపయోగించడం వల్లే గెలిచారని బాబుకు కూడ తెలుసునని అంబటి రాంబాబు అన్నారు. నంద్యాల, కాకినాడ ఎన్నికల్లో  ఎన్ని కోట్లు ఖర్చుపెట్టారో, ఎంతగా అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారో చంద్రబాబుకు తెలుసునన్నారు. గెలుస్తామన్న నమ్మకమే ఉంటే ఎక్కడ లేనివిధంగా నంద్యాలలో మాత్రమే ఎన్నికలకు ముందు ఎమ్మెల్సీ పదవులు ఇవ్వడం, భారీగా ఇళ్లు, రోడ్ల వెడల్పులు చకచకా ఎందుకు చేయాల్సి వచ్చిందని ప్రశ్నించారు. బాబు ప్రజాభిప్రాయాన్ని ఒత్తిడికి లోనుచేశారని అంబటి దుయ్యబట్టారు. కాపులకు చంద్రబాబు తీరని ద్రోహం చేస్తున్నారని, రాబోవు ఎన్నికల్లో టీడీపీకి తగిన బుద్ధి చెబుతారుని అంబటి హెచ్చరించారు. 

కులాలను వైయస్సార్సీపీ రెచ్చగొడుతుందని బాబు మాట్లాడుతున్నారని, రెచ్చగొట్టి నాటకమాడే  తత్వం తమకు లేదన్నారు. వైయస్ జగన్ ముక్కుసూటి మనిషి అని, ఏం చేసినా ఆయన నేరుగా చేస్తారు తప్ప....బాబులా వెనక ఉండి రాజకీయాలు చేసే తత్వం కాదన్నారు. టీడీపీకి తాత్కాలిక విజయాలు రావొచ్చుగానీ శాశ్వత విజయాలు ఉండవని అన్నారు.  మూడేళ్ల బాబు పాలన తీరును ప్రజలు గమనిస్తున్నారని,  సరైన సమయం వచ్చినప్పుడు తగిన గుణపాఠం చెబుతారన్నారు. విజయగర్వంతో  వైయస్సార్సీపీని కించపర్చే మాటలు మానుకోవాలని అధికార టీడీపీని హెచ్చరించారు. వైయస్సార్సీపీ మొక్కవోని ధైర్యంతో ప్రజాసంక్షేమం కోసం పోరాడుతుందని స్పష్టం చేశారు.  ప్రజల ఆశీస్సులతో ముందుకు వెళతామని,  వెనకడుగేసే ప్రసక్తే లేదని అన్నారు. టీడీపీని ఓడించేవరకు నిద్రపోయేది లేదని అన్నారు.  

Back to Top