బాబువి దౌర్జన్యపోకడలు

హైదరాబాద్‌: ముఖ్యమంత్రి చంద్రబాబు దౌర్జన్యపోకడలు అనుసరిస్తున్నారని వైయస్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు మండిపడ్డారు.  ప్రభుత్వ కార్యక్రమంలో ఎంపీ వైయస్‌ అవినాష్‌రెడ్డి మాట్లాడుతున్న సందర్భంలో టీడీపీ నేతలు మైక్‌ లాక్కోవడం దుర్మార్గమని ఖండించారు. పార్లమెంట్‌ సభ్యుడు వెళ్లి మైక్‌ తీసుకొని కొన్ని వాస్తవాలు మాట్లాడితే చంద్రబాబుకు నచ్చడం లేదన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి చిత్రావతి, గండికోట, పైడిపాలెం ప్రాజెక్టులు పూర్తి చేస్తే ఆ నిజాలు కూడా చెప్పకూడదా అని ప్రశ్నించారు.  ఇది సరైన పద్ధతి కాదని తెలిపారు. పులివెందులలో ఈ కార్యక్రమం చేయడం దురదృష్టకరమన్నారు. పార్లమెంట్‌ సభ్యుడి హోదాలో అవినాష్‌రెడ్డి వస్తే ఎందుకు అడ్డుకున్నారని ప్రశ్నించారు. ప్రభుత్వ ఖర్చుతో జరిగే కార్యక్రమంలో ఎందుకు మాట్లాడనివ్వరని నిలదీశారు. గతంలో కర్నూలు జిల్లాలో ఎమ్మెల్యే ఐజయ్య మాట్లాడిన సందర్భంలో కూడా మైక్‌ కట్‌ చేశారని గుర్తు చేశారు. చంద్రబాబును పొగిడితే బహుమతులు ఇస్తున్నారని, నిజాలు మాట్లాడితే మైక్‌లు కట్‌ చేయడం సిగ్గు చేటు అన్నారు. 
Back to Top