ప్రపంచమంతా విజయవాడ వైపు చూస్తోందిసవాంగ్ సెలవు రద్దు చేసుకొని రావడం హర్షణీయంకాల్ మనీ కేసులో ఎంతటివారైనా వదలవద్దుకేసు డైవర్ట్ చేసేందుకే చంద్రబాబు దొంగ దాడులుమహిళలను చెరిపేస్థాయికి టీడీపీ దిగజారిందిప్రభుత్వంపై అంబటి రాంబాబు ఆగ్రహం
హైదరాబాద్ః సీఎం అంటే కాల్ మనీ అని..టీడీపీ అంటే తెలుగు దుశ్సాసనుల పార్టీ అని రాష్ట్ర ప్రజలంతా అనుకుంటున్నారని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ఎద్దేవా చేశారు. దానికి ప్రధాన కారణం విజయవాడ నడిబొడ్డున టీడీపీ చేస్తున్న దుష్టచేష్టలే కారణమన్నారు. నవనగరాలు తీసుకొచ్చి పెడతానని చెప్పిన చంద్రబాబు..ఇసుకమాఫియా,కల్తీ మద్యం, కాల్ మనీ లాంటి నవరోగాలు తీసుకొచ్చారని దుయ్యబట్టారు.
ప్రజలు, ప్రతిపక్షాల కోరిక మేరకు విజయవాడ ప్రజల మీద విశ్వాసంతో..నగర సీపీ గౌతం సవాంగ్ సెలవు రద్దు చేసుకొని తిరిగి విధుల్లో చేరడం అభినందనీయమని అంబటి అన్నారు. కాల్ మనీ సెక్స్ రాకెట్ దందాను సవాంగ్ వెలికి తీసినందున...అలాంటి సిన్సియర్ ఆఫీసర్ లేకపోతే న్యాయం జరగదన్నారు. గౌతం సవాంగ్ భుజస్కందాలపై బృహత్తరమైన బాధ్యత ఉందన్నారు. కాల్ మనీ కేసులో టీడీపీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలున్నందున వారిని శిక్షించాలని, అలా జరిగిన రోజే సమాజం నమ్ముతుందన్న విషయాన్ని సవాంగ్ గమనించాలన్నారు.
అధికారులకు, టీడీపీ కార్యకర్తలకు మధ్య పోటీ వస్తే చంద్రబాబు టీడీపీ నేతలకే సపోర్ట్ చేస్తారని అంబటి అన్నారు. గతంలో ఇది ఎన్నోసార్లు రుజువైందన్నారు. మహిళా అధికారిణి వనజాక్షిని దెందలూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కొట్టినప్పుడు చంద్రబాబు చింతమనేనిని ఏవిధంగా వెనకేసుకొచ్చారో అందరికీ తెలిసిందేనన్నారు. ఆరోజే చింతమనేనిని చంద్రబాబు శిక్షించి ఉంటే ఇవాళ ఈపరిస్థితి వచ్చేది కాదన్నారు. కాల్ మనీ కేసులో రాజకీయ నాయకులకు సంబంధం లేదని డీజీపీ మాట్లాడడం దారుణమన్నారు. ఎమ్మెల్సీ సోదరుడు అడ్డంగా దొరికిపోతే సంబంధం లేదని ఎలా మాట్లాడుతారని ప్రశ్నించారు. కాల్ మనీ నిందితులను శిక్షించాల్సిన ఉన్నతాధికారి...వారిని కాపాడేవిధంగా చంద్రబాబు చెప్పినట్లు నడుచుకోవడం బాధాకరమన్నారు.
ప్రపంచవ్యాప్తంగా ప్రజానీకమంతా విజయవాడవైపు చూస్తోందని అంబటి తెలిపారు. 500పైగా మహిళలను అన్యాయంగా అక్రమంగా బజారుకీడ్చే కార్యక్రమాలు చేసిన స్కాం ఇదని, దోషులు ఎంతటివారైనా శిక్షించాలని ప్రతి పౌరుడు కోరుకుంటున్నాడన్నారు. భారతదేశం చరిత్రలో రాజకీయ పార్టీల అండతో ఇలాంటి దుష్టపరమైన చర్య ఎక్కడ జరగలేదన్నారు. టీడీపీ నేతల కాల్ మనీ వ్యవహారాన్ని డైవర్ట్ చేసేందుకే చంద్రబాబు రాష్ట్రవ్యాప్తంగా దాడులు చేయిస్తున్నారన్నారు.ఇల్లీగల్ వడ్డీ వ్యాపారం వేరు, కాల్ మనీ సెక్స్ వ్యాపారం వేరన్న విషయం చంద్రబాబు గుర్తించాలన్నారు. వడ్డీ వ్యాపారం మితిమీరిపోయి మహిళలకు మత్తుమందు ఇచ్చి చేరిపేసి ఆవీడియోలతో బ్లాక్ మెయిల్ చేసే స్థాయికి టీడీపీ నేతలు దిగజారారని అంబటి నిప్పులు చెరిగారు. ఇందుకు సంబంధించి 500 సీడీలు లభ్యమయ్యాయన్నారు.