చీకట్లో ఏం కుట్ర జరిగింది చిన్నమ్మా?

హైదరాబాద్:

రాష్ట్ర విభజన బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టిన తీరును తీవ్రంగా తప్పుపడుతూ ఇలా అయితే సహకరించబోమని‌ చెప్పిన బీజేపీ నాయకురాలు, లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్ష నేత సుష్మా స్వరాజ్ అంతలోనే మాటమార్చి ఎలా మద్దతిచ్చారని వై‌యస్ఆర్‌ కాంగ్రెస్ ‌పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు సూటిగా ప్రశ్నించారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

‘ఎందుకు మాట మార్చారు... చిన్నమ్మా (సుష్మాస్వరాజ్)? చీకట్లో ఏం కుట్ర జరిగింది చిన్నమ్మా? లోక్‌సభ ప్రసారాలు నిలిపివేసి మరీ చీకట్లో కాంగ్రె‌స్‌తో కుమ్మక్కై ఏం ఆశించి బీజేపీ ఇలా చేసింది?’ అని అంబటి ప్రశ్నించారు. ‘ఆంధ్రప్రదేశ్ విభజన అన్యాయం, అక్రమం... అన్నదమ్ములు, మిత్రుల మధ్య కాంగ్రె‌స్ పార్టీ చిచ్చు పెడుతోందని గావుకేకలు పెట్టిన బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ ఎందుకు మౌనంగా ఉండిపోయారు. అప్రజాస్వామికంగా బిల్లును ఆమోదించుకునేందుకు ఎందుకు సహకరించారో తెలుగు ప్రజలకు సమాధానం చెప్పాలి’ అని అంబటి డిమాండ్ చేశారు.

‌సోనియాగాంధీ, బీజేపీ, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, సీఎం పదవి నుంచి తప్పుకున్న కిరణ్‌కుమార్‌రెడ్డి కుట్ర చేసి రాష్ట్ర విభజనను సజావుగా సాగించారని అంబటి ఆరోపించారు. విభజనకు పూర్తిగా సహకరించి అంతా అయ్యాక కిరణ్ ఇపుడు రాజీనామా ఎందుకు చేశారని‌ ఆయన ప్రశ్నించారు. కిరణ్ అసమర్థత, సంకుచితత్వం వల్లే రాష్ట్రం ముక్కలైపోతోందదని మండిపడ్డారు. దివంగత మహానేత డాక్టర్ వై‌యస్ రాజశేఖరరెడ్డి లాంటి బలమైన నాయకుడు ఉండి ఉంటే తెలుగు ప్రజలను ఇలా చీల్చేవారా? అని‌ అంబటి ఆవేదన వ్యక్తం చేశారు.

ఇన్నాళ్లూ అధిష్టానం చెప్పినట్లు నటించిన కిరణ్ ఇపుడు రంగు తీసేసి బయటకు వెళుతున్నా‌రని అంబటి విమర్శించారు. తెలుగు ప్రజలకు కిరణ్‌కుమార్‌రెడ్డి చేసిన నమ్మక ద్రోహం అంతా ఇంతా కాదన్నారు. సీడబ్ల్యూసీ రాష్ట్ర విభజన నిర్ణయం తీసుకున్న రోజునే సీఎం పదవికి కిరణ్ రాజీనామా చేయకుండా చివరి బంతి అని చెబుతూ లక్షల ఫైళ్లపై చివరి సంతకం వరకూ చేసి లక్షల కోట్లు గడించా‌రని అంబటి ఆరోపించారు.  ఇప్పుడు కిరణ్ రాజీనామా చేస్తే ఏంటి? చేయ‌కపోతే ఏమిటని ఆయన నిలదీశారు.

అత్యంత దారుణమైన రీతిలో రాష్ట్ర విభజన అప్రజాస్వామికంగా జరిగిపోతుంటే బాధ్యతాయుతమైన ప్రతిపక్ష నేతగా, తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు చేసిందేమిటని అంబటి రాంబాబు తూర్పారపట్టారు. రోజుకో మీడియా సమావేశం పెట్టి సంబంధంలేని సొల్లు మాట్లాడ్డం తప్ప ఆయన చేసిందేమీ లేదన్నారు. చంద్రబాబుకు ఏ మాత్రం సిగ్గూ, ఎగ్గూ, నీతి, నిజాయితీలు ఉన్నా ఆయన నిర్వహించిన పాత్రకు సిగ్గుపడి రాజకీయాలు వదిలి వెళ్లిపోవాలని అంబటి రాంబాబు సూచించారు.

తాజా వీడియోలు

Back to Top