ఉద్యోగులపై దాడి దుర్మార్గం: అంబటి రాంబాబు


గుంటూరు:  ఉద్యోగులపై టీడీపీ నాయకులు దాడిచేయడం దుర్మార్గమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాంబాబు విమర్శించారు. గంటూరు జిల్లా  ముప్పాళ్ల  మండలం పలుదేవర్లపాడు గ్రామానికి చెందిన ఉపాధిహామీ పథకం ఫీల్డ్ అసిస్టెంట్ యనమాల అడ్వర్డ్‌పై ఇటీవల మరుగుదొడ్ల బిల్లులు మంజూరు చేసే విషయంలో గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు దాడిచేసిన విషయం తెలిసిందే. ఏరియా వైద్యశాలలో చికిత్స పొందుతున్న ఆయనను అంబటి పరామర్శించారు. దాడికి గల కారణాలు అడిగి తెలుసుకున్నారు. మొత్తం 78 మందికి స్వచ్ఛభారత్ కింద మరుగు దొడ్లు నిర్మిస్తున్న రవి అనే వ్యక్తికి అడ్వాన్స్ కిందట మొదటి బిల్లు చెల్లించినట్లు తెలిపారు. పది మంది సొంతంగా నిర్మించుకుంటున్నారని, మరో 18 మంది నిర్మాణాలు చేపట్టలేదన్నారు. ఆ 28 మంది బిల్లులు కూడా చేయాలంటూ టీడీపీ నాయకులు ఒత్తిడి తెచ్చినట్లు తెలిపారు. మరుగుదొడ్లు నిర్మించకుండా బిల్లులు మంజూరు చేయడం సాధ్యం కాదనడంతో దాడిచేసినట్లు చెప్పారు. దీనిపై అంబటి మాట్లాడుతూ దాడిచేసిన వారిని శిక్షించేలా త్వరలో జిల్లా ఎస్పీని కలుస్తామన్నారు. పార్టీ ఎస్సీ సెల్ రాష్ట్ర కమిటీ సభ్యుడు కోడిరెక్క దేవదాస్, పట్టణ పార్టీ కన్వీనర్ గార్లపాటి ప్రభాకర్, బీసీసెల్ రాష్ట్ర కమిటీ సభ్యుడు దూదేకుల మీరావలి, వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ కట్టా సాంబయ్య, పదో వార్డు కౌన్సిలర్, పెద్దింటి వెంకటేశ్వర్లు, పార్టీ నాయకులు యనమాల సింగయ్య, కంచేటి కుచేల్‌రావు, మద్దురత్నరాజు, కొత్తా భాస్కర్, నాయకులు కార్యకర్తలున్నారు.
Back to Top