విదేశీ మోజులో అమరావతిని నాశనం చేస్తున్నారు

కుమారుడికి దోచిపెట్టడమే లక్ష్యంగా బాబు పనిచేస్తున్నారు
నెంబ‌ర్ 1 కూలీ కాదు... నెంబ‌ర్ 1 విలాసాల ముఖ్య‌మంత్రి 
విదేశీ పర్యటనలో మోడీని మించిపోయారు
విమానాల్లో తరలుతున్న సూట్ కేసుల్లో ఏముందో బాబు చెప్పాలి
వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్ర‌తినిధి అంబ‌టి రాంబాబు

హైదరాబాద్ః రాష్ట్రానికి నేను ముఖ్య‌మంత్రిని కాదు నెంబ‌ర్ వ‌న్ కూలీన‌ని చెప్పుకునే చంద్ర‌బాబు కుటుంబం... 7 స్టార్ హోట‌ల్ లో ఎందుకు ఉంటుంద‌ని వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్ర‌తినిధి అంబ‌టి రాంబాబు నిలదీశారు. ప్ర‌భుత్వ సొమ్మును వంద‌ల కోట్లు ఖ‌ర్చుపెడుతూ, ప్ర‌త్యేక విమానాల్లో విదేశాల‌కు వెళ్లే బాబు నెంబ‌ర్ 1 కూలేనా అని ఆయ‌న ప్ర‌శ్నించారు. భార‌త‌దేశంలో ఉన్న ముఖ్య‌మంత్రులంద‌రిలో అత్యంత విలాసవంత‌మైన ఖ‌ర్చుదారుడైన ముఖ్య‌మంత్రి చంద్రబాబేనని అంబటి దుయ్యబట్టారు. బాబు నెంబర్ వన్ కూలా లేక విలాసవంతమైన ముఖ్యమంత్రో ఒక్కసారి ఆత్మ‌విమ‌ర్శ చేసుకోవాల‌ని సూచించారు. 

ఇప్ప‌టి వ‌ర‌కు ఎన్ని పెట్టుబ‌డులు తెచ్చారు బాబు..?
రాష్ట్రానికి పెట్టుబ‌డులు తీసుకురావ‌డానికే నేను విదేశీ ప‌ర్య‌ట‌న‌లు చేస్తున్నానని చెప్పే బాబు ఇంత వ‌ర‌కు ఎన్ని పెట్టుబ‌డులు తీసుకోచ్చారో చెప్పాల‌ని అంబ‌టి డిమాండ్ చేశారు. నేరుగా విదేశీ పెట్టుబ‌డులు భారత‌దేశానికి రావ‌డం త‌గ్గిపోయాయ‌ని ఆయ‌న తెలిపారు. 18 దేశాల్లో నేరుగా విదేశీ పెట్టుబ‌డులు తీసుకురావ‌డంలో భార‌త‌దేశం పేరు లేద‌ని వివ‌రించారు. ఇండియాకు నిధులు త‌క్కువ వ‌చ్చి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు ఎక్కువ పెట్టుబ‌డులు ఎలా వ‌స్తాయో ప్ర‌జ‌ల‌కు వివ‌రించాల‌న్నారు. 

మోడీని మించిపోయారు
చంద్ర‌బాబు విదేశీప‌ర్య‌ట‌న‌లో మోడీని సైతం మించిపోయార‌ని అంబ‌టి ఎద్దేవా చేశారు. భార‌త‌దేశ పాల‌సీమీదే ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు నేరుగా విదేశీ పెట్టుబ‌డులు ఉంటాయ‌న్న విష‌యాన్ని బాబు విస్మ‌రిస్తున్నారో లేక నాట‌కం ఆడుతున్నారో అర్థం కాని ప‌రిస్థితి నెల‌కొంద‌ని ఆయ‌న ఫైర్ అయ్యారు.  రాష్ట్రంలో పెట్టుబ‌డులు పెట్టేందుకు జపాన్  అంగీక‌రించింద‌ని బాబు చెప్పారని... మ‌రి ఆ పెట్టుబ‌డులు ఏమ‌య్యాయ‌ని అంబటి ప్ర‌శ్నించారు. ఎంఓఎం రాసుకోవ‌డానికి ముందుకువ‌చ్చాయ‌న్న బాబు మాట‌లు గాలిలో మేడ‌ల వంటివ‌ని విమ‌ర్శించారు. బాబు రెండేళ్ల పరిపాల‌న‌లో ఒక్క రూపాయి పెట్టుబ‌డి తీసుకువ‌చ్చారా అని నిల‌దీశారు. విశాఖ‌ప‌ట్నంలో పార్ట్‌న‌ర్‌షిఫ్ స‌మ్మిట్ పెట్టి రూ.ల‌క్ష 50వేల కోట్ల రూపాయ‌లు వ‌స్తున్నాయ‌న్న బాబు మ‌రి ఎందుకు రాలేదో వివ‌ర‌ణ ఇవ్వాల‌ని డిమాండ్ చేశారు. 

పెట్టుబ‌డులు తీసుకురావ‌డానికా...?  దోచుకుంది దాచుకోవ‌డానికా..?
మాట్లాడితే చైనా, జ‌పాన్‌, సింగ‌పూర్‌, దావోస్ అంటూ విదేశీ ప‌ర్య‌ట‌న‌లు చేసే చంద్ర‌బాబు అస‌లు రాష్ట్రానికి పెట్టుబ‌డులు తీసుకురావ‌డానికి వెళ్తున్నారా..?  లేక ఏపీలో దోచుకుంది దాచుకోవ‌డానికి వెళ్తున్నారా అని అంబ‌టి విమ‌ర్శించారు. ప్ర‌త్యేక విమానాల్లో సూట్‌కేస్‌లతో ఎందుకు వెళుతున్నారో స‌మాధానం చెప్పాల‌న్నారు. ప్ర‌ధాన‌మంత్రి క‌న్నా ఎక్కువ‌గా విదేశీ ప‌ర్య‌ట‌న‌లు చేస్తున్న బాబుపై కేంద్రం ఎందుకు ప‌రిశీల‌న పెట్ట‌లేద‌ని ఆయ‌న నిలదీశారు. ఇప్ప‌టికైనా బాబు విదేశీ ప‌ర్య‌ట‌న‌ల‌పై ప‌రిశీల‌న పెట్టాల్సిన బాధ్య‌త కేంద్ర ప్ర‌భుత్వంపై ఉంద‌న్నారు. చంద్ర‌బాబు ధోర‌ణి దేశానికి ప్ర‌మాద‌క‌ర ప‌రిస్థితుల‌ను తెచ్చిపెట్టే విధంగా క‌నిపిస్తున్నాయ‌ని మండిపడ్డారు. 

ప్రత్యేకహోదాను కాదని బిక్షాటనా
బాబు విదేశీ పెట్టుబ‌డుల కోసం ఎందుకు బిక్షాట‌న చేస్తున్నార‌ని అంబటి ప్ర‌శ్నించారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో స‌దుపాయ‌లు బాగుంటే వారే వ‌చ్చి పెట్టుబ‌డులు పెడ‌తార‌ని సూచించారు. స‌దుపాయాలు బాగుండాలంటే గ‌తంలో బీజేపీ ఇచ్చిన ప్ర‌త్యేక హోదా ఇస్తే అన్ని స‌దుపాయ‌లు బాగుంటాయ‌ని, అప్పుడు బాబు వ‌ద్ద‌న్నా వ‌చ్చి మ‌రి పెట్టుబ‌డులు పెడ‌తార‌ని తెలిపారు. అధిక లాభాలు పొందే అవ‌కాశం ఉంటుంది కాబ‌ట్టి వారే వ‌స్తారన్నారు. 

పోలీసుల‌కు ప‌చ్చ చొక్కాలు వేసి తిప్పుతున్నార‌ని, వ్యాపార‌వేత్త‌ల‌ను జైలులో పెట్టే ప‌రిస్థితిని బాబు తీసుకొచ్చార‌ని అంబటి ఆరోపించారు. రాష్ట్రంలో పెట్టుబ‌డులు పెట్టాలంటే భ‌య‌ప‌డే దుస్థితి నెల‌కొంద‌న్నారు. స్విస్ ఛాలెంజ్ ప‌ద్థ‌తి చాలా ప్ర‌మాద‌క‌ర‌మైంద‌ని ఐఏఎస్ అధికారులే చెబుతున్నార‌న్నారు. బాబు ప‌రిపాల‌న స‌క్ర‌మంగా లేనందునే పెట్టుబ‌డులు పెట్ట‌డం లేద‌ని చెప్పారు. ఇప్ప‌టికైనా బాబు ప్ర‌త్యేక హోదా తీసుకొచ్చి స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్కరించాల‌ని అంబటి సూచించారు. విదేశాల మోజులో స్వ‌దేశంలో ఉన్న వ్యాపార‌వేత్త‌ల‌ను కించ‌ప‌రిచే విధంగా బాబు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

సింగపూర్ వాళ్లు సిమెంట్‌, ఇసుక ఏమైనా తెస్తారా..?
తెలుగు వాళ్లు రాజ‌ధానిని మురికివాడ‌లుగా క‌డ‌తార‌న్న బాబు వ్యాఖ్య‌లు సిగ్గు చేట‌న్నారు. సింగ‌పూర్ వారికి రాజ‌ధాని నిర్మాణ ప‌నులు అప్ప‌గిస్తే సింగ‌పూర్ నుంచి ఇసుక‌, ఇటుక‌, ఐరన్, సిమెంట్‌, వేల సంఖ్య‌లో కూలీల‌ను  ఏమైనా తీసుకొస్తారా..? అని అంబ‌టి ప్ర‌శ్నించారు. సింగ‌పూర్ వారు రాజ‌ధానిని నిర్మించిన దానికి మ‌న సిమెంట్‌, మ‌న ఇటుక‌, మ‌న మాన‌వ వ‌న‌రులు, మ‌న కూలీలే ప‌ని చేయాల‌న్న విష‌యం బాబు తెలుసుకోవాల‌న్నారు. విదేశీ వ్యామోహంలో బాబు అమ‌రావ‌తిని న‌ాశ‌నం చేస్తున్నార‌ని మండిప‌డ్డారు. మ‌న‌వాళ్లు రాజధాని క‌డితే క‌మీష‌న్‌లు ఇవ్వ‌ర‌నే బాబు విదేశాల‌కు అప్ప‌గిస్తున్నార‌ని ఆరోపించారు. 

స్వీడ‌మ్ నుంచి ఒక ఆర్థిక మినిస్ట‌ర్ వ‌చ్చిన‌ప్పుడు బాబు ఇలాగే ఇష్ట‌మొచ్చిన‌ట్లు కూత‌లు కూస్తే ...ఆయన వెళ్తూ ఇలాంటి వారిని మా దేశంలో పిచ్చి ఆస్ప‌త్రికి పంపిస్తాన‌ని చెప్పిన విష‌యం గుర్తు చేశారు. రాజ‌ధాని నిర్మాణ ప‌నుల‌ను మీడియా కెమెరాల‌కు చిక్క‌కుండా నిశిద్ధ ప్రాంతంలాగా పోలీసుల‌ను మొహరించ‌డం ఎందుక‌ని ప్ర‌శ్నించారు. కేవ‌లం త‌న కుమారుడికి దోచిపెట్ట‌డ‌మే ల‌క్ష్యంగా బాబు ప‌ని చేస్తున్నార‌ని విమ‌ర్శించారు. బాబు అక్ర‌మ, అన్యాయ పాల‌న‌ను వైయ‌స్సార్‌సీపీ ఎప్పుటికప్పుడు ఎండ‌గ‌డుతుంద‌న్నారు. భ‌వ‌నాలు పూర్తికాక‌ముందే ప్రారంభోత్స‌వాలు ఏంట‌ని ఆయ‌న కడిగిపారేశారు. ఓటుకు నోటు కేసు ఒప్పందంలో భాగంగానే హైద‌రాబాద్ నుంచి బాబు పారిపోతున్నార‌ని విమ‌ర్శించారు. 
Back to Top