కళ్లు మూసినా, తెరిచినా జగన్ నామస్మరణే

మీ బినామీల భూబాగోతంపై విచారణకు సిద్ధమా బాబు
ప్రపంచంలోనే ఇది అతిపెద్ద కుంభకోణం 
పేదల పొట్టగొట్టిన బాబుకు..
కచ్చితంగా  ఉసురు తగులుతుందిః శ్రీధర్ రెడ్డి

హైదరాబాద్ః  రాజధాని పేరు జెప్పి  వేలమంది రైతుల కడుపు కొట్టి వారిని వీధి పాలు జేశారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చంద్రబాబుపై ధ్వజమెత్తారు.  ముఖ్యమంత్రి, ఆయన కుమారుడు లోకేష్,  మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర టీడీపీ నేతలంతా రాజధానిలో సాగించిన భూ దురాక్రమణపై  విచారణకు సిద్ధపడాలని శ్రీధర్ రెడ్డి సవాల్ విసిరారు. అమరావతి పేరుతో స్వాతంత్ర్యం వచ్చాక దేశంలోనే అతి పెద్ద కుంభకోణానికి చంద్రబాబు తెరలేపారని విమర్శించారు. 

భూములు కొంటే తప్పా, వ్యాపారం చేసుకోవద్దా అంటూ చంద్రబాబు మాట్లాడిన వ్యాఖ్యలపై శ్రీధర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు పదేళ్లు ముఖ్యమంత్రిగా, ప్రతిపక్ష నేతగా ఉన్నావే... ప్రజలకు ఎలాంటి నష్టం చేయమని ప్రమాణస్వీకారం చేసిన విషయం తెలియదా అని ఎద్దేవా చేశారు.  మీ బినామీలు ఎక్కడైతే రాజధానికి భూసేకరణ జరుగుతుందో అక్కడ కాకుండా...రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకునే చోట భూములు ఎందుకు కొనుక్కున్నారో చెప్పాలన్నారు. రైతుల భూములను గ్రీన్ జోన్ లో పెట్టి...మీరు దోచుకున్న భూములను కమర్షియల్ జోన్ లో పెట్టుకుంటారా అంటూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. 

అసైన్డ్ భూములు, లంకభూములకు ప్రభుత్వ పరిహారం రాదని దండోరా వేసి...పేదలను భయాందోళనకు గురిచేసి తరతరాలుగా సాగుచేసుకుంటున్న వారి భూముల్ని మీ బినామీల పేర రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు.  శవాల మీద చిల్లర వేరుకుంటున్న చందాన పేద రైతుల కడుపు కొట్టారు. ప్రభుత్వ డాక్యుమెంటరీ ఎవిడెన్స్ బయటకు వచ్చాయి. ఇంత పెద్ద భూదందా జరిగితే ఇంకో ముఖ్యమంత్రి అయితే రాజీనామా చేసేవాడు. కానీ, చంద్రబాబుకు అలాంటి బుద్ధి లేదు. బాబు మాట్లాడితే  సత్యహరిశ్చంద్రున్ని అని చెప్పుకుంటావే...  భూదోపిడీపై విచారణకు  ఎందుకు సిద్ధపడడం లేదు. నిస్సిగ్గుగా ఎంత దారుణాలకు పాల్పడ్డారో తేటతెల్లం అవుతోందని శ్రీధర్ రెడ్డి తూర్పారబట్టారు. 

ముద్రగడ లేఖ రాసినా, రాష్ట్రంలో తుఫాన్ వచ్చినా అది వైఎస్ జగన్ అని మాట్లాడడం చంద్రబాబుకు అలవాటైపోయిందని శ్రీధర్ రెడ్డి ఎద్దేవా చేశారు. కళ్లు మూసినా, తెరిచినా చంద్రబాబు వైఎస్ జగన్ నామస్మరణ చేయడాన్ని చూసి రాష్ట్ర ప్రజానీకం  నవ్వుకుంటోందని అన్నారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి భూదోపిడీపై విచారణకు సిద్ధం కావాలన్నారు. ఎవరి హస్తాలున్నాయో తెలుస్తోందన్నారు. రైతులను నిలువునా ఎలా మోసం చేశారో అర్థమవుతోందని దుయ్యబట్టారు. 

అమరావతి సాక్షిగా భూదందాకు పాల్పడి ఏపీ ప్రతిష్ట దిగజార్చారని శ్రీధర్ రెడ్డి టీడీపీ సర్కార్ పై ధ్వజమెత్తారు. గుంటూరు, కృష్ణా జిల్లాల పేద రైతులు గుండెలు బాదుకుంటున్నారని వాపోయారు. వాళ్ల కడుపు కొట్టిన చంద్రబాబు, ఆయన కుమారుడికి కచ్చితంగా ఉసురు తగులుతుందన్నారు. బాబు కనికట్టు గారడీ చేస్తామంటే కుదరదని..మీ దోపిడీ, దొంగతనాలు బట్టబయలైనాక తప్పించుకోలేరన్నారు. కోట్ల మంది ప్రజలు గమనిస్తున్నారన్న సంగతి చంద్రబాబు గుర్తెరగాలన్నారు. మీ చేతగానితనంతో వైఎస్ జగన్ పై నిందలు వేయడం మానుకోవాలని హెచ్చరించారు. అసెంబ్లీ వేదిక ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను  వైఎస్ జగన్ నాయకత్వంలో కలిసికట్టుగా నిలదీస్తామన్నారు.  

Back to Top