జన్మభూమి కాదు.. జాదూభూమి

వాగ్ధానాలు ఒక్కటి కూడా నెరవేర్చలేదని బాబే ఒప్పుకున్నాడు
ప్రజలను డైవర్ట్‌ చేయడానికి జన్మభూమి కార్యక్రమం
అధికారులను నిలదీస్తే పోలీసులతో బెదిరింపులా?
ప్రజా సంకల్పయాత్రకు స్వచ్ఛందంగా వస్తున్న ప్రజానికం
మోసంలో లోకేష్‌ తండ్రిని మంచిన తనయుడు
దత్తత తీసుకున్న నిమ్మకూరును సర్వనాశనం చేశాడు
హైదరాబాద్‌: చంద్రబాబు నాయుడు జన్మభూమి కార్యక్రమం జాదూభూమిగా పేరుగాంచిందని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి విమర్శించారు. ఐదోసారి జన్మభూమి– మా ఊరు కార్యక్రమంలో చంద్రబాబు 17 లక్షల ఇళ్లు, 2 లక్షల రేషన్‌ కార్డులు, 4 లక్షల పెన్షన్లు ఇస్తానని చెబుతున్నారని, అంటే ఇంతకు ముందు జరిగిన నాలుగు విడుతల్లో ఒక్కటి కూడా నెరవేర్చలేదని ఆయనే ఒప్పుకున్నారన్నారు. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు, ప్రతిపక్షనేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజా సంకల్పయాత్రకు వస్తున్న మద్దతు చూసి బెదిరిన టీడీపీ సర్కార్‌ ప్రజలను డైవర్ట్‌ చేయడానికి జన్మభూమి కార్యక్రమాన్ని తీసుకొచ్చాడని ఆర్కే ధ్వజమెత్తారు. హైదరాబాద్‌ లోటస్‌పాండ్‌లోని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆర్కే విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబు తప్పుడు వాగ్ధానాలు నమ్మి మోసపోయామని ప్రజలంతా స్వచ్ఛందంగా ప్రజా సంకల్పయాత్రకు వచ్చి వైయస్‌ జగన్‌కు తమ సమస్యలు చెప్పుకుంటున్నారన్నారు. ఈ పొరబాటు మళ్లీ చేయం అండగా ఉంటామని చెప్పడాన్ని గమనించిన చంద్రబాబు ప్రజలను మభ్యపెట్టేందుకు మళ్లీ తన తప్పుడు వాగ్ధానాల చిట్టాను తెరిచారన్నారు. 
వైయస్‌ఆర్‌ పాలనను చూసి నేర్చుకో...
2004లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి ప్రజలు అన్ని సంక్షేమాలు అందించి తరువాత 2009 ఎన్నికల్లో రేషన్, పెన్షన్‌ అందుతున్నాయా, నేను కట్టించిన ఇంట్లో ఉంటున్నారా.. ఆరోగ్యశ్రీ, 108 సౌకర్యాలు అందుతున్నాయా..? అందితేనే మీరు నాకు ఓటు వేసి ఆశీర్వదించండి అని ఎన్నికలకు వెళ్లారన్నారు. అలాంటి మహానేతను ఆదర్శంగా తీసుకొని చంద్రబాబు పరిపాలన సాగించాలన్నారు. కానీ మళ్లీ అబద్ధపు హామీలు ఇస్తూ ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నాడని ఆర్కే మండిపడ్డారు. జన్మభూమి సభల్లో ప్రజలు అధికారులను ఇల్లు, రేషన్, పెన్షన్‌ రాలేదని నిలదీస్తున్నారన్నారు. అవిపట్టించుకోకుండా నిలదీస్తున్న ప్రజలను పోలీసులతో బెదిరించి భయపెట్టి సభ నుంచి పంపిచేస్తున్నారన్నారు. 
విద్యాశాఖ దారుణంగా తయారైంది..
చంద్రబాబు పాలనలో విద్యాశాఖ దారుణంగా తయారైందని ఆర్కే ఆవేదన వ్యక్తం చేశారు. సుమారు 3500  ప్రభుత్వ పాఠశాలలను మూసివేస్తానని సిగ్గులేకుండా చంద్రబాబు సుప్రీం కోర్టుకు అఫిడవిట్‌ ఇచ్చారన్నారు. జన్మభూమి సభలకు రావడానికి నిరాకరిస్తే ఉపాధ్యాయులను, పిల్లలను తీసుకెళ్లి కూర్చోబెట్టి చంద్రబాబు చప్పట్లు కొట్టించుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నారాయణ, చైతన్య వంటి విద్యా సంస్థలను విడిచి పెట్టి ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థుల భవిష్యత్తును చంద్రబాబును నాశనం చేస్తున్నాడని ఆరోపించారు. 
నిమ్మకూరును ఏం ఉద్దరించావు లోకేష్‌..
ప్రజలను మోసం చేయడంలో మంత్రి లోకేష్‌ తండ్రిని మంచిన తనయుడిగా ఎదుగుతున్నాడని ఎమ్మెల్యే ఆర్కే విమర్శించారు. ఎమ్మెల్సీ కాకమునుపే కృష్ణ జిల్లా నిమ్మకూరు స్వర్గీయ ఎన్టీఆర్‌ జన్మించిన గ్రామాన్ని లోకేష్‌ దత్తత తీసుకున్నాడని గుర్తు చేశారు. తాతగారి ఊరిని ఉద్దరిస్తానని చెప్పిన లోకేష్‌ ఇప్పటికి నాలుగు జన్మభూమి కార్యక్రమాలు అయిపోయినా ఆ గ్రామానికి ఏం చేశాడో ఆత్మ పరిశీలన చేసుకోవాలని సూచించారు. ప్రభుత్వ ధనం నుంచి రూ. 18 కోట్లు కేటాయించానని చెబుతాడు కానీ ఇప్పటి వరకు ఆ గ్రామం అభివృద్ధికి నోచుకోలేదన్నారు. అయినా దత్తత తీసుకున్న గ్రామానికి ఎవరైనా ప్రజాధనాన్ని ఉపయోగిస్తారా లోకేష్‌ అని ప్రశ్నించారు. నాన్న నీను నీకు ఏమాత్రం తీసిపోను నిమ్మకూరును సర్వనాశనం చేయడానికి తీసుకున్నానన్నట్లుగా స్పష్టంగా అర్థం అవుతుందన్నారు. గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని తన నియోజకవర్గంతో పాటు ఆ గ్రామాన్ని కూడా అభివృద్ధి చేస్తానని ఎస్‌డీఎఫ్‌ ఫండ్స్‌ ఇవ్వాలని కోరినా చంద్రబాబు పైసా ఇవ్వలేదన్నారు. 
ఎన్టీఆర్‌ విగ్రహం కాళ్లు పట్టుకొని క్షమాపణ అడుగు
పొట్టపొడిస్తే అక్షరం ముక్కరాని వ్యక్తి, ఏది ఎక్కడ, ఎప్పుడు, ఎలా మాట్లాడాలో.. తెలియని వ్యక్తి లోకేష్‌ అని ఆర్కే అభిప్రాయపడ్డారు. అలాంటి వ్యక్తికి సీనియర్‌ మంత్రులను పక్కనబెట్టి మూడు ప్రధాన శాఖలు చంద్రబాబు కేటాయించారని మండిపడ్డారు. గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్న లోకేష్‌ దత్తత తీసుకున్న నిమ్మకూరునే బాగుచేయలేకపోయారన్నారు. నిమ్మకూరులో వాటర్‌ ట్యాంక్‌ కుప్పకూలే పరిస్థితికి వచ్చిందని, అదే విధంగా ప్రభుత్వ పాఠశాల దుస్థితి, చెరువులో చుక్క నీరు లేని ఫొటోలను ఆర్కే మీడియాకు చూపించారు. వైయస్‌ఆర్‌ సీపీ ఎమ్మెల్యే అనిల్‌కుమార్‌ యాదవ్‌ అసెంబ్లీలో చంద్రబాబు పుట్టిన గ్రామం నారావారిపల్లెలో అభివృద్ధి ఎలా ఉందో.. అసెంబ్లీలో ఫొటోలతో సహా చూపించారని గుర్తు చేశారు.  కన్నతల్లి మీద ఎలాగూ ప్రేమలేదు.. కనీసం జన్మనిచ్చిన ఊరిపై కూడా ప్రేమ లేకుంటే ఎలా చంద్రబాబూ అని ఆర్కే ప్రశ్నించారు. ఎన్టీఆర్‌ తనయకుడు హరికృష్ణ రాజ్యసభ సభ్యుడిగా ఉన్న సమయంలో వేసిన రోడ్లు మాత్రమే గ్రామంలో ఉన్నాయని ఆర్కే చెప్పారు. దత్తత తీసుకున్న, పుట్టిన ఊరిలో సంక్షేమాన్ని పట్టించుకోని వారు రాష్ట్ర ప్రజలను ఏ విధంగా పట్టించుకుంటారని ప్రశ్నించారు. మీరు నిజంగా ప్రజా సంక్షేమం బాగుండాలని కోరుకుంటే ఒకరు నారావారిపల్లె వెళ్లి పుట్టిన ఊరి రుణం తీర్చుకోండి.. మరొకరు దత్తత తీసుకున్న నిమ్మకూరు వెళ్లి ఎన్టీఆర్‌ విగ్రహానికి పాలాభిషేకం చేసి కాళ్లు పట్టుకొని అభివృద్ధి చేస్తానని వేడుకోవాలని సూచించారు.  
 
Back to Top