అన్ని వర్గాలను మోసం చేశారు

  • మోసగిస్తే దుర్మార్గులు అనక మరేమంటారు..?
  • దేవతా ముఖ్యమంత్రి అంటారా..?
  • వ్యవసాయం శుద్ధ దండగ అనే క్యారెక్టర్‌ బాబుది
  • ప్రతిపక్షనేత వస్తున్నాడనే బాబు హెలికాఫ్టర్‌ పర్యటన
  • వైయస్సార్సీపీ సీనియర్‌ నేత బొత్స సత్యనారాయణ 
గుంటూరు: ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చని వ్యక్తిని దుర్మార్గపు ముఖ్యమంత్రి అనక దేవతా ముఖ్యమంత్రి అంటారా? అని వైయస్‌ఆర్‌ సీపీ సీనియర్‌ నేత బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిన చంద్రబాబును ఏమని సంబోధించాలో చెప్పాలని టీడీపీ నేతలను నిలదీశారు. గుంటూరు జిల్లా కాకమాను మండలంలో వరద ముంపు ప్రాంతాలను గురువారం ఆయన పరిశీలించారు. భారీ వరదలతో తీవ్రంగా నష్టపోయిన రైతుల పంటలను పరిశీలించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో గత పది రోజులుగా అధిక వర్షాలతో తీవ్రమైన పంట, ఆస్తినష్టం వాటిల్లిందన్నారు. వరద కారణంగా మరణాలు కూడా సంభవించాయని గుర్తు చేశారు. గుంటూరు జిల్లాలో అత్యధికంగా నష్టం జరగిందన్నారు. వర్షాభావ ప్రభావంతో నష్టపోయిన కుటుంబాలను, రైతులను వైయస్‌ఆర్‌ సీపీ అధినేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కలిసి పరామర్శించారని చెప్పారు. రైతులకు జరిగిన నష్టానికి ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేశారన్నారు. 

అత్యధిక వర్షాలు పడుతున్నాయని వాతావరణ శాఖ పలు సార్లు హెచ్చరించినా చంద్రబాబు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు. ప్రతిపక్షనేత చెప్పేంత వరకు రాష్ట్రంలో సహాయక చర్యలు చేపట్టలేదన్నారు. ప్రతిపక్షనేత వైయస్‌ జగన్‌ ముంపు ప్రాంతాల్లో పర్యటిస్తారని ప్రకటించిన తరువాత బాబు హడావిడిగా హెలికాఫ్టర్‌ ద్వారా వరద ప్రాంతాలను పరిశీలించారన్నారు. నష్టపడి రైతులను, ప్రజలను పట్టించుకోకుండా రాజకీయ ఆలోచనలతోనే ఉన్నారన్నారు. రెండు రోజుల పాటు నిర్వహించిన కలెక్టర్‌ల సదస్సులో వరద నష్టం గురించి చంద్రబాబు చర్చించకపోవడం దారుణమన్నారు. వర్షాలతో గుంటూరు జిల్లా ఎంతో నష్టపోయిందని, ఆ నష్టాన్ని ఉదారంగా ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు.

కరువులో బాబు గొప్పలు
రాష్ట్రంలో కరువుతో ప్రజలు అల్లాడుతుంటే జీడీపీ 12 శాతం పెరిగిందని చంద్రబాబు గొప్పలు చెప్పుకుంటున్నారని బొత్స విమర్శించారు. గొప్పలు ఎనైనా చెప్పుకోండి కానీ రైతుల నడ్డి విర్చోద్దని ప్రభుత్వానికి సూచించారు. స్కేల్‌ ఆఫ్‌ ఫైనాన్స్‌ కంటే మించిన రుణాలు ఇవ్వోద్దని బ్యాంకర్స్‌మీటింగ్‌లో చెప్పి ఇప్పుడు బ్యాంక్‌లు రుణాలు ఇవ్వడం లేదని బాబు మాట్లాడడం సమంజసమా అని ప్రశ్నించారు. రుణమాఫీ పూర్తిగా చేయకుండా రైతులు రుణాలెలా ఇస్తారని నిలదీశారు. వాగులు పొంగి పొలాల్లో ఇసుక మేటలు వేశాయని, వాటిని తొలగించాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. 

ఉపాధి హామీ పథకం కింద ఇసుక మేటల పనిని వినియోగించుకోవాలని కోరారు. స్థానిక అధికారులను, ప్రజాప్రతినిధులను అప్రమత్తం చేసి పంట, ఆస్తి నష్టాలను అంచెనా వేయించాలని డిమాండ్‌ చేశారు. ప్రతిపక్ష మాటలపై వాస్తవాలను తెలుసుకోకుండా ఎదురుదాడి చేసి పబ్బం గడుపుకోవడం మానేయాలని బాబుకు సూచించారు. చంద్రబాబుకు, టీడీపీ నేతలకు వ్యవసాయం అంటే శుద్ద దండగ అని మనస్సులో బలంగా నాటుకుపోయిందన్నారు. అదే విధంగా ఆయన పాలన కొనసాగుతుందన్నారు. సంక్షోభాన్ని అవకాశంగా చేసుకోవాలని పదే పదే చెప్పే చంద్రబాబు రైతుల ఇన్‌పుట్‌ సబ్సీడీ, నష్ట పరిహారాన్ని అవినీతికి ఆసరాగా చేసుకోవద్దని హితవు పలికారు. 

 
Back to Top