సమైక్య ఉద్యమ ఉద్యోగులకు సరకుల పంపిణి

నరసాపురం (ప.గో.జిల్లా),

15 అక్టోబర్ 2013: వైయస్ఆర్ కాంగ్రె‌స్ పార్టీ ఈ‌ నెల 19న హైదరాబాద్ ఎ‌ల్.బి. స్టేడియంలో నిర్వహించనున్న సమైక్య శంఖారావం బహిరంగ సభకు కోర్టు తప్పకుండా అనుమతి ఇస్తుందన్న దృఢ విశ్వాసాన్ని పార్టీ నాయకుడు, పారిశ్రామికవేత్త రఘురామ కృష్ణంరాజు వ్యక్తం చేశారు. వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ, ఎంఐఎం, సిపిఎంతో పాటు ఇతర పార్టీల్లో ఉన్న సమైక్యవాదులు కూడా తమతో కలిసి రావాలని ఆయన పిలుపు ఇచ్చారు. జీతాలు కాదు.. జీవితాలు ముఖ్యం అంటూ రెండు నెలలకు పైగా సమైక్య ఉద్యమం చేస్తున్న సమైక్య వాదులకు వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ బాసటగా నిలిచింది. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం లోక్ సభా నియోజకవర్గంలోని నాలుగవ తరగతి ఉద్యోగులకు రఘురామ కృష్ణంరాజు మంగళవారం నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. మొత్తం ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని ‌ఉద్యోగులకు ఒకేసారిగా ఈ నిత్యావసర వస్తువుల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు.

సమైక్యాంధ్ర ఉద్యమంలో పాల్గొంటున్న ఉద్యోగుల త్యాగాలు వెలకట్టలేనివని ఈ సందర్భంగా రఘురామ కృష్ణంరాజు అభివర్ణించారు. నెల నెలా జీతాలు రాకపోతే వచ్చే ఇబ్బందులను, విధులకు రాని తమపై ప్రభుత్వం ఎస్మా ప్రయోగిస్తుందేమో అన్న భయం ఉన్నప్పటికీ తమ ఉద్యోగ జీవితాలను పణంగా పెట్టారని అన్నారు. సమైక్య రాష్ట్రం కోసం ఇంతగా త్యాగాలు చేస్తున్న ఉద్యోగులకు ఎలా సహాయపడగలమనే ఆలోచన నుంచి కొంతమేరకైనా వారికి బాసటగా నిలవాలని పార్టీ నాయకులు గోపి లాంటి వారి సలహా మేరకు నిత్యావసర వస్తువుల పంపిణీని ప్రారంభించినట్లు ఆయన తెలిపారు.

వైయస్ఆర్ కాంగ్రె‌స్ పార్టీ సమైక్య శంఖారావం సభకు పోలీసులు అనుమతి నిరాకరించిన విషయం తెలిసిందే. ‌దీనితో సభకు అనుమతి కోసం పార్టీ కోర్టును ఆశ్రయించింది.

Back to Top