'ముసాయిదా'లోని అన్ని క్లాజులనూ తొలగించాలి

హైదరాబాద్:

ఆంధ్రప్రదేశ్‌ ‌పునర్వ్యవస్థీకరణ బిల్లు -2013లో పేర్కొన్న ప్రతి క్లాజునూ ‘తొలగించండి’ అని వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ శాసనసభ్యులు సవరణలు ప్రతిపాదించారు. ఆంధ్రప్రదేశ్‌ పునర్వ్యవస్థీకరణ బిల్లుగా పేర్కొన్న క్లాజును కూడా తొలగించాలని సవరణలు కోరారు. రాష్ట్రాన్ని విభజిస్తే అన్ని ప్రాంతాల ప్రజల ప్రయోజనాలకు తీరని నష్టం వాటిల్లుతుంది కనుక తాము విభజనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. అందుకే రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లుకు సవరణలు ప్రతిపాదిస్తున్నామని వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సభ్యులు స్పష్టంచేశారు.

ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ పు‌నర్వ్యవస్థీకరణ బిల్లుగా పేర్కొంటున్న క్లాజ్‌ ఒకటి నుంచి ఆరవ క్లాజ్‌ వరకూ, ఏడవ క్లాజ్‌ నుంచి 108వ క్లాజ్‌ వరకు ప్రతి క్లాజును తొలగించాలంటూ పార్టీ శాసనసభాపక్ష నాయకురాలు శ్రీమతి వైయస్‌ విజయమ్మతో పాటు పార్టీ ఎమ్మెల్యేలందరూ స్పీకర్‌కు శుక్రవారంనాడు ‌సవరణ ప్రతిపాదనలు అందజేశారు. పునర్వ్యవస్థీకరణ బిల్లులోని 1 నుంచి 6, 7 నుంచి 108 క్లాజులకు మొత్తంగా సవరణలు ప్రతిపాదిస్తూ పార్టీ ఎమ్మెల్యేలందరూ విడివిడిగా నిర్దేశిత ఫార్మాట్‌లో అసెంబ్లీ స్పీకర్‌కు అందజేశారు. పార్టీ ఎమ్మెల్సీలు కూడా ఇదేవిధమైన సవరణను ప్రతిపాదిస్తూ బిల్లులో పొందుపరిచిన ప్రతి క్లాజును ‘తొలగించాలి’ అని సవరించాలని శాసనమండలి చైర్మన్‌కు నివేదించారు.

ఈ క్లాజులను తొలగించాలన్న ప్రతిపాదనకు కారణాలను వివరిస్తూ.. ‘రాజ్యాంగ సంప్రదాయాలను, నిబంధనలను పాటించకుండా, మన రాజ్యాంగానికి మూలమైన ఫెడరల్‌ స్ఫూర్తికి పూర్తి విరుద్ధంగా పూనుకున్న రాష్ట్ర విభజనను నేను వ్యతిరేకిస్తున్నాను. విభజన జరిగితే మిగిలిపోయే మిగతా రాష్ట్రంలో ఆర్థికాభివృద్ధి కుంటుపడుతుంది. వనరుల రాబడిలో అన్యాయం జరుగుతుంది. జలాల్లో రావాల్సిన వాటాలో హాని జరుగుతుంది. యువకులు ఉపాధి అవకాశాలను కోల్పోతారు. అంతేకాదు.. సామాజిక, విద్యా, వైద్య మౌలిక సదుపాయాలు కూడా కోల్పోతాం. రాష్ట్రంలోని మూడు ప్రాంతాల్లో నివసిస్తున్న మెజారిటీ ప్రజల విశాల ప్రయోజనాలకు భంగం కలిగిస్తుంది. రాష్ట్ర పరిస్థితులను అధ్యయనం చేసిన శ్రీకృష్ణ కమిటీ ఆంధ్రప్రదేశ్‌ను సమైక్యంగా ఉంచడమే ఉత్తమమని చేసిన సిఫారసుకు వ్యతిరేకంగా ఈ విభజన జరుగుతోంది కనుక వ్యతిరేకిస్తున్నాం’ అని పేర్కొన్నారు.

Back to Top