తీవ్ర సంక్షోభంలో వ్యవసాయరంగం

  • రైతాంగాన్ని నిర్లక్ష్యం చేసిన చంద్రబాబు
  • కరువులో తన రికార్డు తానే బ్రేక్ చేసిన బాబు
  • వర్షాభావం, అధిక వర్షాలతో పూర్తిగా పంటనష్టం
  • రైతులు కన్నీరు పెడుతున్నా పట్టించుకోని  ప్రభుత్వం
  • మోసపూరిత విధానాలు విడనాడి రైతులను ఆదుకోవాలి
  • ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన ఎంవీఎస్ నాగిరెడ్డి
హైదరాబాద్ః ఏపీలో వ్యవసాయరంగం తీవ్ర సంక్షోభంలో ఉందని వైయస్సార్సీపీ రైతు విభాగం అధ్యక్షుడు ఎంవీఎస్ నాగిరెడ్డి అన్నారు. 13 జిల్లాల్లో ఈఏడాది అతి తక్కువగా సాగు జరిగిందని చెప్పారు. కరువులో చంద్రబాబు తన రికార్డును తానే బ్రేక్ చేశారని ఎద్దేవా చేశారు.  2014-15లో 238 మండలాలు, 2015-16లో 359 మండలాలు, 2016-17లో 301 మండలాలను కరువు మండలాలుగా ప్రభుత్వమే ప్రకటించిందని గుర్తు చేశారు. సాగు జరిగిన ప్రాంతంలో కూడ లక్షల హెక్టార్లలో పంటలు ఎండిపోయాయని అన్నారు. కష్టపడి పండించిన పంటలకు గిట్టుబాటు ధర లేక రైతులు విలవిలలాడుతున్నారన్నారు. పంటలన్నీ పూర్తి సంక్షోభంలోకి వెళ్లిపోయాయన్నారు. 2015-6, 16-17లో నాగార్జున సాగర్ ఆయకట్టు కుడి కాలువకు 140 టీఎంసీలు నికర జలాలు కేటాయింపు ఉన్నా వరి సాగుకు ప్రభుత్వం నీళ్లు విడుదల చేయకపోవడం మూలంగా రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు. వరిగడ్డిని అమ్మి పశువులను పోషిచలేక అమ్మేసుకుంటే కబేళాలకు వెళ్లిపోయిన పరిస్థితిని చూసామన్నారు. ఇదంతా తాము చెబుతున్నది కాదని,  ప్రభుత్వ వ్యవసాయ శాఖ డిపార్ట్ మెంట్ లో ఉన్న డేటాయేనని నాగిరెడ్డి స్పష్టం చేశారు. పరిస్థితి ఇంత దారుణంగా ఉంటే....ముఖ్యమంత్రి మాత్రం వ్యవసాయ అనుబంధ రంగాలు 2015-16లో 12 శాతం, 2016-17లో 14 శాతం వృద్ధి రేటు సాధించమని చెప్పడం అన్యాయమన్నారు. 

వేరుశనగ పంట, పెసర, మినుము తక్కువగా సాగుకాగా, పండించిన కొద్దిపాటి పంట వర్షాభావం, అధిక వర్షాలకు పూర్తిగా నష్టపోయిందన్నారు. పత్తిసాగు గతేడాది కంటే పెరిగినా ఫలితం లేదన్నారు. అధిక వర్షాలతో 90శాతం పంట పూర్తిగా దెబ్బతిందన్నారు.  పత్తి పొలాలను దుక్కిదున్నేస్తున్నారని పత్రికల్లో వాస్తవాలొస్తున్నా ప్రభుత్వం ఆలోచన చేయకపోవడం బాధాకరమన్నారు. 1988లోనాటి సంక్షోభాన్ని పత్తి రైతులు ఎదుర్కొంటున్నారన్నారు. ముఖ్యమంత్రి నివాసముంటున్న కూతవేటు దూరంలో పత్తి మొత్తం నాశనమైపోయిందన్నారు. రైతాంగం కన్నీళ్లు పెట్టుకుంటుంటే ప్రభుత్వం గానీ, ప్రభుత్వ యంత్రాంగం గానీ కనీసం క్షేత్రస్థాయిలో పరిస్థితులను పరిశీలించకపోవడం దారుణమన్నారు. ఉత్పత్తి వ్యయానికి 50శాతం అదనంగా లాభసాటి ధరలు ఇప్పిస్తామని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రమాణం చేసి మాట తప్పాయన్నారు. ఉత్పత్తి వ్యయం పత్తి క్వింటాలుకు 5,500 అవుతుందని ప్రభుత్వ అధికారిక లెక్కలే చెబుతున్నాయన్నారు. కానీ, ప్రకటించిన మద్దతు ధర మాత్రం 4,320 రూపాయలన్నారు. అది కూడ రాకుండా రైతాంగం 1500కు అమ్ముకుంటున్న పరిస్థితి ఉందన్నారు. 5వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తామని చెప్పి చంద్రబాబు మోసం చేశారన్నారు.  ఎక్కడ కూడ క్షేత్రస్థాయిలో వెళ్లడం లేదని,  వ్యవసాయశాఖ రైతాంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని నాగిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయం ఇంత సంక్షోభంలో ఉంటే రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి కనీసం లేఖ కూడ రాయకపోవడం దారుణమన్నారు. వ్యవసాయరంగం సంక్షోభంలో ఉండడంతో రైతులు పక్కరాష్ట్రాలకు వలస పోతున్న పరిస్థితి ఉందన్నారు. మోసపూరిత విధానాలు విడనాడి రైతులను ఆదుకునేలా చూడాలని నాగిరెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 


Back to Top