దమ్ముంటే మొత్తం ఫుటేజి బయటపెట్టండి: రోజా

హైదరాబాద్: ఏపీ అసెంబ్లీలో బుధవారం నాడు జరిగిన సంఘటనలు, అనంతర పరిణామాలపై వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా తీవ్రంగా మండిపడ్డారు. అధికార పార్టీ సభ్యురాలు పీతల సుజాత పదే పదే తనను ఉద్దేశించి పచ్చి తీవ్ర వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు. చంద్రబాబు పదవి ఇచ్చారని అడ్డగోలుగా మాట్లాడటం సరికాదని హితవు పలికారు. ధైర్యముంటే అసెంబ్లీలోని మొత్తం ఫుటేజిని బయటపెట్టాలని డిమాండ్ చేశారు.

కేవలం తామున్న వీడియో దృశ్యాలను మాత్రమే విడుదల చేయడం సరికాదని చెప్పారు. ప్రతిపక్ష నేత జగన్ మాట్లాడుతున్నప్పుడు మైక్ కట్ చేసి రన్నింగ్ కామెంట్రీ చేయడం కరెక్టా అని ప్రశ్నించారు. మాట మాట్లాడితే ఎస్సీ ఎమ్మెల్యేలను తమపై ఉసిగొల్పుతున్నారని ఆమె చెప్పారు. ఎస్సీల పట్ల తామెప్పుడూ గౌరవంగానే వ్యవహరిస్తామని అన్నారు. తమ నేతపై కట్టుకథలు అల్లుతుంటే తామెందుకు మౌనంగా ఉంటామని రోజా నిలదీశారు.
Back to Top