అధికార టెర్రరిజం

హైదరాబాద్) ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారుల్ని బెదిరిస్తూ, అధికార
టెర్రరిజం కు పాల్పడుతున్నారని వైయస్సార్సీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ
మండిపడ్డారు. హైదరాబాద్ లోటస్ పాండ్ లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆమె మీడియాతో
మాట్లాడారు. చెప్పిన మాట వినేవారికే కోరిన పోస్టింగ్ లు అని చంద్రబాబు
నిస్సిగ్గుగా చెప్పడాన్ని బట్టి చంద్రబాబు వైఖరి అర్థం అవుతోందని ఆమె అన్నారు.
ఇటువంటి బెదిరింపులకు లొంగవద్దని, అధికారులు ప్రజాస్వామ్య విలువల్ని కాపాడుతూ
పనిచేయాలని ఆమె సూచించారు.

        రెవిన్యూ వ్యవస్థ, పోలీసు
వ్యవస్థ లకు ప్రత్యేకంగా గుర్తింపు ఉంటుందని వాసిరెడ్డి పద్మ అన్నారు. వాటిని
వదిలివ పెట్టేసి ఐఎఎస్ లు, ఐపీఎస్ లు తమకు జీ హుజూర్ అంటూ సలామ్ కొట్టాలని
చంద్రబాబు భావిస్తున్నారని ఆమె అన్నారు. అధికారులు పచ్చ చొక్కా తొడుక్కొని బతకాలని
కోరుకొంటున్నారని, ఇది సరికాదని ఆమె అన్నారు. వ్యవస్థల పట్ల తెలీనివారు కాదని,
సీనియర్ మంత్రులు ఉన్నారని, ముఖ్యమంత్రి కూడా తనకు తాను చాలా సీనియర్ అని చెప్పుకొంటారని
వివరించారు. వాస్తవానికి ఏ ప్రభుత్వం అయినా, అధికారులు తమకు సహకరించాలని, తమ
సంక్షేమ పథకాలు ప్రజల్లోకి బాగా తీసుకెళ్లాలని కోరుకొంటారని చెప్పారు. అయితే ఇంతటి
విపరీత పొకడలు మాత్రం ఎక్కడా కనిపించవని వివరించారు. ఈ విధమైన బెదిరింపు ధోరణుల
కారణంగా వ్యవస్థల్లో మార్పు వస్తోందని అన్నారు. ఈ రోజు పోలీసు స్టేషన్లలో,
రెవిన్యూ కార్యాలయాల్లో అధికారుల తీరు చూస్తుంటే ఇది అర్థం అవుతుందని
పేర్కొన్నారు.

        ఒక మహిళా తహశీల్దార్ ను
ఎమ్మెల్యే బెదిరిస్తే ముఖ్యమంత్రే స్వయంగా సెటిల్ మెంట్ చేయటాన్ని మనం చూశామని
వాసిరెడ్డి పద్మ గుర్తు చేశారు. ఒక వైపు అధికారుల్ని ఎమ్మెల్యేలు
బెదిరిస్తున్నారని, చంద్రబాబేమో తమకు అనుకూలంగా పనిచేసే అధికారులే ఉండాలని టెలీ
కాన్పరెన్స్ లో చెబుతున్నారని ఆమె మండిపడ్డారు. అంటే అధికారులు నోటికి ప్లాస్టర్లు
వేసుకొని, జై చంద్రబాబూ అంటూ పనిచేసుకోవాలా అని పద్మ ప్రశ్నించారు. అన్ని
వ్యవస్థల్ని చేతుల్లోకి తీసుకొంటాం, బెత్తం పుచ్చుకొని పరిపాలన చేస్తాం అన్న
దోరణిలో సాగుతోందని ఆమె అన్నారు.

        ఈ తతంగానికి కారణం చంద్రబాబు లో
ఉన్న భయం అని పద్మ అభివర్ణించారు. రెండేళ్లు పూర్తయినా, ప్రజలకు ఉపయోగపడే పనులు
ఏమీ చేయలేదన్న సంగతి బాబు అంతరంగానికి తెలుసని అందుకే ప్రజల్లో మంచి పేరు
తెచ్చుకోలేక పోతున్నామనే బెంగతో ఇటువంటి పోకడలకు దిగుతున్నారని పద్మ అన్నారు. ఒక
వైపు ఎమ్మెల్యేలను కొనుగోలు చేయటం, డబ్బుల్ని విచ్చలవిడిగా పంచటం, అధికారుల్ని
బెదిరించి దారికి తెచ్చుకోవటం, కర్ర పెత్తనంతో వ్యవస్థను గుప్పిట్లో పెట్టుకోవటం
వంటి పనులన్నీ అందుకే చేస్తున్నారని పేర్కొన్నారు. మొత్తం వ్యవస్థనే భయకంపితుల్ని
చేస్తున్నారని మండిపడ్డారు.

        వాస్తవానికి కొత్తగా ఏర్పడిన
రాష్ట్రం కాబట్టి సమస్యలు ఉంటాయని, వాటిని అధిగమించి ప్రజా రంజకమైన పాలన
అందించేందుకు పనిచేయాలని ప్రభుత్వానికి వాసిరెడ్డి పద్మ సూచించారు. అటువంటి
ప్రయత్నాలు చేయకుండా ఎంతసేపు బెదిరింపు ధోరణితో ఉండటం సరికాదని ఆమె అన్నారు. ఈ
సందర్భంగా అధికారులకు కూడా విన్నవిస్తున్నట్లు ఆమె చెప్పారు. ఈ రోజు అధికారం ఒకరి
చేతిలో ఉంటే, రేపు మరొకరి చేతిలో ఉంటుందని అందుచేత అధికారం గురించి ఆలోచించకుండా
ప్రజాస్వామ్య విలువల్ని కాపాడాలని ఆమె కోరారు. 

Back to Top