ఎర్రగుంట్లలో టీడీపీ దాదాగిరి

  • ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి, ఆయన అనుచరుల వీరంగం
  • వైయస్సార్సీపీ కౌన్సిలర్ ను తీసుకెళ్లేందుకు ఆదినారాయణరెడ్డి యత్నం
  • పార్టీ ఫిరాయింపులకు పాల్పడడంపై ఎమ్మెల్యే, కౌన్సిలర్ లను నిలదీసిన సుబ్బారెడ్డి
  • టీడీపీలోకి వెళ్లడం అనైతికమని ప్రశ్నించినందుకు దాడికి తెగబడ్డ పచ్చనేతలు
  • టీడీపీ దుర్మార్గాలపై తిరగబడిన జనం
  • ఎర్రగుంట్ల పీఎస్ లో  బైఠాయించిన వైయస్ అవినాష్ రెడ్డి, సుధీర్ రెడ్డి
  • దాడికి పాల్పడిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ 
వైయస్సార్‌ జిల్లా: ఎర్రగుంట్లలో పచ్చనేతలు రెచ్చిపోయారు.  వైయస్సార్‌సీపీ కార్యకర్తలపై జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి అనుచరులు దాడికి పాల్పడ్డారు. దీంతో,  పట్టణంలో ఉద్రిక్తపరిస్థితి నెలకొంది. తెలుగుదేశం కార్యకర్తల దౌర్జన్యానికి నిరసనగా వేలాదిమంది ప్రజలు స్వచ్ఛందంగా రోడ్డుపైకి వచ్చి ఆందోళన చేపట్టారు. 

వైయస్సార్‌సీపీ నుంచి టీడీపీలోకి పార్టీ ఫిరాయించిన జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి తన అనుచరులతో సోమవారం ఉదయం ఎర్రగుంట్లకు వచ్చి వైయస్సార్‌సీపీకి చెందిన 17వ వార్డు కౌన్సిలర్‌ దివ్య, ఆమె తండ్రి ఎరికలరెడ్డిని వెంట తీసుకుని వెళుతుండగా దివ్యను ప్రజలు నిలదీశారు. వైయస్సార్‌సీపీ తరపున నిలబడిన నీకు మేము ఓటువేసి గెలిపిస్తే ఇప్పుడు తెలుగుదేశంలోకి వెళ్లడం ఎంతవరకు సమంజసమని సుబ్బారెడ్డి అనే వ్యక్తి ప్రశ్నించాడు. పార్టీ ఫిరాయించేందుకు వీలులేదని ఆ వార్డు ప్రజలు అడ్డుకున్నారు. దాంతో కాస్త ఘర్షణ జరిగింది. ప్రజలు అడ్డుకోవడంతో ఆదినారాయణరెడ్డి వర్గం వెనక్కివెళ్ళిపోయింది.

కాసేపటి తరువాత వచ్చిన టీడీపీ కార్యకర్తలు మమ్మల్నే ఎదురు ప్రశ్నిస్తావా అంటూ సుబ్బారెడ్డిపై దాడిచేశారు. దీంతో సుబ్బారెడ్డి ఎర్రగుంట్ల పోలీస్‌స్టేషన్‌కు వెళ్ళి ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి, ఆయన అనుచరులపై ఫిర్యాదుచేశారు. ఇదే సందర్బంగా జమ్మలమడుగు వైయస్సార్‌సీపీ నియోజకవర్గ సమన్వయకర్త సుధీర్ రెడ్డి పోలీస్‌స్టేషన్‌కు వెళ్ళి సుబ్బారెడ్డికి అండగా నిలిచారు. తమపై కేసు పెట్టేందుకు సుబ్బారెడ్డి పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లాడని తెలుసుకున్న జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి కోపంగా స్టేషన్‌కు వచ్చారు. అక్కడ సుధీర్‌రెడ్డికి, ఆదినారాయణరెడ్డికి మధ్య వాదోపవాదాలు జరిగాయి. ఈ నేపథ్యంలో పోలీస్‌స్టేషన్‌ వెలుపల వేలాదిమంది జనం గుమిగూడారు. దీంతో, ఉద్రిక్తపరిస్థితి నెలకొంది. విషయం తెలిసిన కడప ఎంపీ అవినాష్‌రెడ్డి హుటాహుటిన ఎర్రగుంట్లకు చేరుకుని వైయస్సార్‌సీపీ కార్యకర్తలపై దాడిచేసిన టీడీపీ కార్యకర్తలను అరెస్టుచేయాలని పోలీస్‌స్టేషన్‌లో బైఠాయించారు.
Back to Top