జగనన్న నాయకత్వ లక్షణాలు నచ్చే వైయ‌స్ఆర్‌సీపీలో చేరా




అనంతపురం :  వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత‌, ఏపీ ప్ర‌తిప‌క్ష నాయ‌కులు వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వ ల‌క్ష‌ణాలు న‌చ్చి వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన‌ట్లు వినాయ‌కుడు సినిమా ఫేమ్‌, న‌టుడు కృష్ణుడు తెలిపారు. ప్రజలే తన ఊపిరిగా.. కుటుంబంగా అలుపెరుగకుండా వారి కోసం ‘ప్రజాసంకల్ప యాత్ర’ పేరుతో పాదయాత్ర చేయడం చూసి చలించిపోయాన‌ని పేర్కొన్నారు. వేలాది కిలోమీటర్లు పాదయాత్ర చేయడమంటే ఆషామాషీ వ్యవహారం కాదు. పేదల కష్టాలను కళ్లారా చూసి.. వారి కోసం ఆయన ఇస్తున్న హామీలు, సంక్షేమ పథకాల రూపకల్పన నచ్చాయ‌ని చెప్పుకొచ్చారు.  అందుకే రాజకీయాల్లోకి రావాలనుకున్నాన‌ని ఆయ‌న వివ‌రించారు. అనంత‌పురంలో నిర్వ‌హించిన క్రికెట్ టోర్న‌మెంట్‌ను ప్రారంభించిన ఆయ‌న త‌న అభిప్రాయాల‌ను మీడియాతో పంచుకున్నారు.   

మీ కుటుంబ నేపథ్యం గురించి చెబుతారా?
♦ మాది తూర్పు గోవావరి జిల్లా రాజోలు మండలం చింతలపల్లి గ్రామం. అమ్మా, నాన్న సావిత్రి, సీతరామరాజు. వ్యవసాయం చేసేవారు. నాతో పాటు తమ్ముడు సుబ్రమణ్యం రాజు, చెల్లి విజయలక్ష్మి ఉన్నారు. చిన్న వయసులోనే చదువు కోసం వైజాగ్‌ సమీపాన గుడిలోవా బంధువుల గ్రామం చేరాం. ఐదేళ్ల కిత్రం ఇష్టపడ్డ అమ్మాయిని వివాహం చేసుకున్నా. మాకు ఒక అమ్మాయి.

సినిమాలపై ఆసక్తి ఎలా ఏర్పడింది..?
♦ గుడిలోవా గ్రామంలోని విజ్ఞానవిహార్‌ పాఠశాలలో చదువునేటపుడు సినిమాలపై ఆసక్తి ఏర్పడింది. ఎనిమిదో తరగతి చదువుతున్నపుడు పాఠశాల వార్షికోత్సవ సమయంలో రాముడి పాత్రలో నటించే అవకాశం వచ్చింది. తొలిసారి ముఖానికి రంగువేశా. వైజాగ్, బెంగళూరు ప్రాంతాల్లో పాలిటెక్నిక్‌ పూర్తిచేశా. సినీ రంగంలో అడుగుపెట్టి హీరోగా నటించి తీరాలని కసితో 12 ఏళ్లుగా ఎన్నో ఒడిదుడుకుల మధ్య నా ప్రయాణం సాగింది.  

సంతృప్తినిచ్చిన పాత్ర ఏది?
♦ వినాయకుడు సినిమాలో ‘వినాయకుడి’ పాత్ర నాకు ఎంతో బాగా నచ్చింది. ఈ పాత్ర ప్రేక్షకుల్లో ఎంతో ఆదారాభిమానం చూరగొంది. ఈ చిత్రాన్ని ఎన్నటికీ మరచిపోలేను.  

ఇప్పటి దాకాఎన్ని చిత్రాలు నటించారు..
♦ హీరోగా, సహనటునిగా దాదాపు వంద చిత్రాలు తెలుగులో చేశా. అందులో విలేజ్‌లో వినాయకుడు, వినాయకుడు, ఓయ్, ఏమాయ చేశావే తదితర చిత్రాల్లోని పాత్రలు నాకు మంచి గుర్తింపు తెచ్చాయి.  

మీ అసలు పేరు ఏమిటి..?
♦ నా అసలు పేరు కృష్ణంరాజు. ఈ పేరుతో ఇప్పటికే ఒక గొప్ప హీరో ఉన్నారు. అందుకని నేను సినీరంగ ప్రవేశం చేయగానే కృష్ణుడిగా పేరు మార్చుకున్నా.

మీ జీవితంలో మలుపుతిప్పిన ఘటన..
♦ బాల్యం నుంచే సినిమా హీరో కావాలనుకునేవాడిని. 20 ఏళ్ల వయసులో బైక్‌ యాక్సిడెంట్‌ జరిగింది. కుడికాలు పూర్తిగా దెబ్బతినింది. అప్పుడు మూడేళ్లపాటు బెడ్‌రెస్ట్‌. ఇక నాజీవితం ఇంతేనేమో.. అనుకున్న లక్ష్యం చేరుతానో లేదోనని ఆందోళన చెందాను. నా బాధ చూసి తమ్ముడు, చెల్లి, స్నేహితులు ఓదార్చేవారు. ఆ సమయంలోనే అధికంగా బరువు పెరిగిపోయాను. లావుగా ఉన్నందున నాకు సహనటుడుగా అవకాశం దక్కింది. తర్వాత డైరెక్టర్‌ కిరణ్‌సాయి సహకారంతో హీరోగా అవకాశం వచ్చింది.

ప్రేక్షకాదరణ ఎలా ఉంది?
♦ బొద్దుగా ఉన్న నన్ను ప్రేక్షకులు రిసీవ్‌ చేసుకున్న తీరును ఎన్నటికీ మరచిపోలేను. నిజంగా వారందరికీ థ్యాంక్స్‌ చెబుతున్నా. హ్యాపీడేస్‌ సినిమా ప్రేక్షకులకు ఎంతగానో నచ్చింది. ఈ సినిమా రీలిజ్‌ తర్వాత రాజమండ్రికి వెళ్లా. ‘అప్పుడు చాలాబాగా నటించారు.. బొద్దుగా ముద్దొచ్చేలా ఉన్నావం’టూ ప్రేక్షలు చెప్పడం చూస్తే నిజంగా సంతోషమేసింది.

ఆటలంటే ఇష్టమా..?
♦ క్రికెట్‌ అంటే నాకు చచ్చేంత ప్రాణం. సచిన్‌ బ్యాటింగ్‌ను ఎంతగానో ఇష్టపడుతా. క్రికెట్‌ ఆడే వారికి నా ప్రోత్సాహం అందిస్తూనే ఉన్నా.

‘అనంత’తో మీకున్న అనుబంధం
♦ రాయదుర్గం మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి కుటుంబంతో సాన్నిహిత్యం ఉంది. ఆయన కుమారుడు ప్రవీణ్‌రెడ్డి నాతో అన్యోన్యంగా ఉంటాడు. నేను అభిమానించే ఫ్యామిలీలో కాపు కుటుంబం కూడా ఒకటి. గొప్ప మనసున్న నాయకుడు కాపు.

ప్రజాసంకల్ప యాత్రపై మీ స్పందన?
♦ ప్రజల కష్టాలు స్వయంగా తెలుసుకునేందుకు ప్రతిపక్షనేత వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ‘ప్రజా సంకల్ప యాత్ర’ సూపర్బ్‌. ఎండనక.. వాననక.. పాదయాత్ర చేసుకుంటూ ముందుకు సాగిపోతున్నారు. ఇటీవల ఆయనతో కలిసి పాదయాత్రలో పాల్గొన్నా. ‘మీ కేమన్నా ఇంత కష్టం’ అని అడిగితే.. ‘నాన్నలా మంచి చేసి... పేరు సంపాదించుకోవాలి. పేదల కష్టాలు తొలగించటమే నా ధ్యేయం’ అని చెప్పారు. ఎంతటి గొప్ప మనసు జగనన్నది. జగన్‌ అనే నేను.. అనే పదం కోసం నాతో సహా ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు. 



Back to Top