వైయస్ జగన్ ను సీఎం చేసేందుకు సిద్ధమవ్వండి

అనంతపురం: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డిని సీఎం చేసేందుకు కార్యకర్తలంతా సిద్ధంగా ఉండాలని ఎంపీ మిథున్‌ రెడ్డి పిలుపునిచ్చారు. గురువారం మడకశిర నియోజకవర్గంలో వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్లీనరీ సమావేశం జరిగింది. సమన్వయకర్త డాక్టర్‌ తిప్పేస్వామి ఆధ్వర్యంలో ప్లీనరీ సమావేశం ఏర్పాటయింది. దీనికి వైయస్‌ఆర్‌సీపీ ఎంపీ మిథున్‌ రెడ్డి, జిల్లా అధ్యక్షుడు శంకర్‌ నారాయణ, మాజీ ఎమ్మెల్యే గుర్నాథ్‌ రెడ్డి, గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్‌ ఎల్‌ఎం మోహన్‌ రెడ్డి తదితరులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా మిథున్‌ రెడ్డి మాట్లాడుతూ ...అమరావతి పేరుతో చంద్రబాబు భారీ అవినీతికి పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. చిన్నపాటి వర్షానికే అసెంబ్లీలో లీకులు కావడం బాబు అవినీతికి నిదర్శనం అని చెప్పారు. అసెంబ్లీ, సచివాలయం నాణ్యతా రహితంగా నిర్మించారని ఆరోపించారు. నవ నిర్మాణ దీక్షల పేరుతో బాబు మరో మోసం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.  అవినీతి రహిత పాలన, ఆదర్శ పాలన చూడాలంటే వైయస్‌ జగన్‌ను ముఖ్యమంత్రిని చేసుకోవాల్సిన అవసరం ఉందని, ఇందుకై పార్టీ కార్యకర్తలంతా కూడా సిద్ధంగా ఉండాలని చెప్పారు.
Back to Top