‘ఓటుకు కోట్లు’ నిందితులకు నోటీసులు?

చంద్రబాబును ఏసీబీ విచారణకు పిలిచే అవకాశం
హైదరాబాద్లో హై అలర్ట్
మోహరించిన ఇరు రాష్ట్రాల పోలీసులు
జగన్ పై ఆంధ్ర మంత్రుల అక్కసు
బాబు రాజీనామా చేసి విచారణకు సహకరించాలిః వైఎస్ఆర్సీపీ
 
హైదరాబాద్ః ఓటుకు నోటు కేసులో తెలుగుదేశం పార్టీ ముఖ్యనేతల మెడకు ఉచ్చు బిగుసుకుంటోంది. తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే రేవంత్రెడ్డిని రంగంలోకి దించి తెర వెనుక నుంచి వ్యవహారాన్ని నడిపిన పెద్ద తలకాయల గుట్టు రట్టు చేసేందుకు అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) సిద్ధమైంది. దొంగచాటుగా ఈ బాగోతాన్ని నడిపిన నేతలందరినీ త్వరలోనే ప్రశ్నించనుంది. మంగళవారం నాటి పరిణామాలతో హైదరాబాద్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎన్టీఆర్ ట్రస్టు భవన్, సచివాలయం, చంద్రబాబు నివాసం, మంత్రుల ఇళ్ల వద్ద ఒకవైపు తెలంగాణ పోలీసులు ఉండగానే ఆంధ్ర నుంచి వచ్చిన పోలీసులు కూడా మోహరించారు. మరోవైపు ఈ వివాదంపై కేంద్ర హోం మంత్రి రాజ్నాథ్ సింగ్ కూడా స్పందించారు. దానిని కేంద్ర హోం శాఖ కార్యదర్శి చూసుకుంటారని ఆయన వ్యాఖ్యానించారు. స్పష్టమైన ఆధారాలున్నందునే ఏసీబీ నోటీసులు ఇచ్చే పరిస్థితి వచ్చిందని, అందువల్ల చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి విచారణకు సహకరించాలని వైఎస్ఆర్కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది.
 
అందరికీ నోటీసులు సిద్ధం...
తెలుగుదేశం పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సహా ఈ కేసులో నిందితులందరికీ  తెలంగాణ ఏసీబీ నోటీసులు జారీ చేసి నిర్దేశిత సమయానికి విచారణకు హాజరు కావలసిందిగా కోరనున్నట్లు తెలుస్తోంది. మంగళవారం నాడు శరవేగంగా చోటు చేసుకుంటున్న పరిణామాలను గమనిస్తే ఏ క్షణాన్నైనా చంద్రబాబుకు ఏసీబీ నోటీసులు అందవచ్చని, ఆ వెంటనే ఆయన రాజీనామా చేయాల్సి ఉంటుందని మీడియాలో ప్రత్యేక కథనాలు ప్రసారమయ్యాయి. చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్తో సంప్రదింపులు జరిపిన టీడీపీ నేతలందరికీ దశలవారీగా నోటీసులు జారీ చేయాలని, అందరినీ విచారణకు హాజరుకావాల్సిందిగా కోరాలని ఏసీబీ భావిస్తున్నది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసిన వేం నరేందర్ రెడ్డిని కూడా ఏసీబీ విచారించనున్నది. ఆ తర్వాత సీనియర్ నేతలు సీఎం రమేష్, గరికపాటి మోహనరావుతో పాటు ఈ కేసుతో సంబంధం ఉన్న ఇతరులకూ నోటీసులు జారీ చేయనున్నది.
 
జగన్ పై ఆంధ్ర మంత్రుల అవాకులు
ఎక్కడ ఏది జరిగినా జగన్మోహన్రెడ్డికి ఆపాదించడం తెలుగుదేశం పార్టీ ముందు నుంచీ అనుసరిస్తున్న కుట్రపూరిత వైఖరి. ఇపుడు ఆ పార్టీ పీకల్లోతులో ‘ఓటుకు కోటు’్ల కుంభకోణంలో కూరుకుపోయినా నెపాన్ని జగన్పై వేసి అక్కసు తీర్చుకోవాలని చూడడం గమనార్హం. కేసీఆర్తో జగన్ చేతులు కలిపారని, చంద్రబాబు ప్రభుత్వాన్ని అస్థిర పరచడానికి కుట్రలు పన్నుతున్నాడని ఆరోపిస్తున్నారు. రేవంత్ రెడ్డికి రు.50 లక్షలు ఇచ్చి స్టీఫెన్సన్ వద్దకు జగన్ పంపించారా? లేక పోతే జగనే దగ్గరుండి చంద్రబాబు చేత ఫోన్లో స్టీఫెన్సన్తో మాట్లాడించారా?  కన్నంతో చిక్కుకున్న దొంగ అరిచే మాదిరిగానే చంద్రబాబు, ఆయన మంత్రివర్గ సహచరులు అరుస్తున్నారు. చంద్రబాబు, ఇతర తెలుగుదేశం నాయకులు కుంభకోణంలో ఇరుక్కుంటే అదేదో తెలుగుజాతి మొత్తానికి అన్యాయం జరిగిపోతున్నట్లు మంత్రులు అరిచి గోలచేస్తున్నారు. ఇది రెండు రాష్ట్రాల మధ్య వివాదంలా మార్చేందుకు పడరాని పాట్లు పడుతున్నారు.
 
గవర్నర్కు లాంఛనంగా తెలిపిన కేసీఆర్?
స్టీఫెన్సన్ను ప్రలోభపెట్టడం కోసం రు.50 లక్షలు ఇస్తూ రేవంత్రెడ్డి తదితరులు వీడియోల్లో అడ్డంగా దొరికిపోయారు. చంద్రబాబు నాయుడు కూడా స్వయంగా స్టీఫెన్సన్తో మాట్లాడుతూ తమ వాళ్లిచ్చిన హామీలన్నీ నెరవేరుస్తానని చెప్పిన ఆడియో టేపులూ దొరికాయి. వీటన్నిటినీ ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించి అక్కడి నుంచి నివేదికలు అందిన తర్వాతనే తదుపరి కార్యక్రమాలకు ఏసీబీ సన్నద్ధమయ్యింది. అంతకుముందు సోమవారం నాడు తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ను కలుసుకుని చంద్రబాబుపై ఇంకా అనేక ఆధారాలున్నాయని నివేదించినట్లు వార్తలొచ్చాయి. కేసు నుంచి దృష్టి మరల్చి తప్పించుకోవడం కోసమే చంద్రబాబు ఆయన మంత్రివర్గ సహచరులు సెక్షన్ - 8 గురించి పట్టుబడుతున్నారని, ఏడాదికాలంగా హైదరాబాద్లో శాంతిభద్రతలకు ఎలాంటి ఇబ్బందీ లేదు కనుక సెక్షన్ -8ను అమలు చేయాల్సిన అవసరం లేదని కేసీఆర్ వివరించినట్లు సమాచారం. గవర్నర్కు కేసీఆర్ లాంఛనప్రాయంగా తెలియజేసిన తర్వాతే చంద్రబాబుకు నోటీసులు జారీ చేసే ప్రక్రియను ఏసీబీ వేగిరం చేసిందని పరిణామాలు తెలియజేస్తున్నాయి.
 
ఉన్నతస్థాయి నుంచి గో ఎహెడ్ ఆదేశాలు..?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి మీద చట్టపరంగా ముందుకు వెళ్లవచ్చు అనేటటువంటి ఆదేశాలు ఉన్నతస్థాయి నుంచి వచ్చినట్లు పరిణామాలు తెలియజేస్తున్నాయి. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడిగా చంద్రబాబు ఓటుకు కోట్లు కుంభకోణంలో ఇరుక్కున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలవడం కోసం ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాలన్న కుంభకోణంలో చంద్రబాబు సూత్రధారిగా ఉన్నారని ఆధారాలు ఉన్నాయని తెలుస్తోంది. స్టీఫెన్సన్తో మాట్లాడారా లేదా అన్న ప్రశ్నకు ఇంతవరకు చంద్రబాబు సమాధానం ఇవ్వడం లేదు. మాట్లాడినట్లు రుజువు చేసే ఆడియోటేపుల ఆధారాలు చానళ్లలో ప్రసారమవుతున్నాయి. అయినా నేను మాట్లాడలేదు అని చంద్రబాబు ఇంత వరకు ఖండించలేదు. పక్కా ఆధారాలున్నందునే కేంద్రం గానీ పైస్థాయిలోగానీ ఈ కేసులో చట్టపరంగా ముందుకు వెళ్లవచ్చని గ్రీన్సిగ్నల్ వచ్చినట్లు కనిపిస్తోంది. 
 
పార్టీ అధ్యక్షుడిగా కేసులో చంద్రబాబు
ఇంకా ఈ దశలో కూడా ముఖ్యమంత్రిగా ఏం చేయవచ్చు? ఎలా బెదిరించవచ్చు? ఎలా బైటపడవచ్చు అని పథకాలు వేస్తున్నారు. నిజాయితీగా ముందుకొచ్చి విచారణను ఎదుర్కోవడానికి సిద్ధపడడం లేదు. పార్టీ అధ్యక్షుని హోదాలో ఓటుకు కోట్లు కుంభకోణంలో నిందితునిగా ఉన్న చంద్రబాబు ముఖ్యమంత్రి ముసుగును మాత్రం తీయడానికి ఇష్టపడడం లేదు. నేను ముఖ్యమంత్రిని.. నా మీదే కేసులు పెడతారా.. అని హూంకరిస్తున్నారు. పార్టీ అధ్యక్షుడి హోదాలో చంద్రబాబు ఎమ్మెల్యేలను కొనుగోలు చేసే ప్రయత్నాలు చేశారు. ఆధారాలున్నపుడు చంద్రబాబు నిజాయితీగా తక్షణం ఆ పదవి నుంచి తప్పుకోవాలి. ముఖ్యమంత్రి పదవికి మచ్చ తీసుకురాకూడదు. ఏడాదిగా చంద్రబాబు రాష్ట్రానికి చేసిందేమీ లేదు. పది రోజులుగా ఆయన పోలీసులు, న్యాయ నిపుణులతో భేటీలు జరపడం తప్ప రాష్ర్టంలో పరిపాలనను పట్టించుకున్న పాపాన పోలేదు. ఒక కేసులో నిందితునిగా ఉండే వ్యక్తి ముఖ్యమంత్రి పదవిలో ఉండడం నైతికంగా సరికాదు.
Back to Top