ఆయిల్ కంపెనీలకు ప్రభుత్వాలు దాసోహం

హైదరాబాద్ 16 ఫిబ్రవరి 2013:

ఆయిల్ కంపెనీల వైఖరిని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండించింది. పార్టీ ప్రధాన కార్యాలయంలో శనివారం సాయంత్రం అధికార ప్రతినిధి, ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకరరావు విలేకరులతో మాట్లాడారు.  డీజీల్, పెట్రోల్ ధరల  పెంపును తాము నిరసిస్తున్నట్లు స్పష్టం చేశారు. ఆయిల్ కంపెనీలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దాసోహమయ్యాయని ఆయన మండిపడ్డారు. ఆయన విలేకరుల సమావేశం పూర్తి సారాంశం...
'అధికారంలో ఉన్న వారెవరైనా ప్రజల స్థితిగతుల్ని అర్థంచేసుకుని పాలించాలన్న మౌలిక సూత్రాన్ని కాంగ్రెస్ పార్టీ మరిచింది. సంస్థానాధీశులకు ప్రత్యేక హక్కులిచ్చినట్లుగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తోంది. తమ నిర్ణయాలను ప్రజలు ప్రశ్నిస్తే మేం చూసుకుంటామన్నట్లు ప్రవర్తిస్తోంది. ఆయిల్ కంపెనీలకు ధరల పెంపుదలపై గుత్తాధిపత్యాన్ని కట్టబెట్టింది. దీని దుష్ఫలితమే విపరీతంగా ఆయిల్ ధరలు పెరగడం. కంపెనీల మీద పర్యవేక్షణ లేకపోవడం దీనికి కారణం. రాజశేఖరరెడ్డిగారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఎల్పీజీ రేట్లు పెరిగితే వాటిని ఆయన నేతృత్వంలోని  రాష్ట్ర ప్రభుత్వమే  భరించింది. ఇప్పుడున్న ముఖ్యమంత్రి లేదా క్యాబినెట్‌లో ఇలాంటి వైఖరి కనిపించడం లేదు.' 

ధరలు పెంచుతూ పోతున్నారు

     డీజిల్ ధరల పెరుగుదల వల్ల రైల్వేపై రూ. 1200 కోట్లు ఆర్టీసీపై రూ. 1700 కోట్లు భారం పెరిగింది. ఇటీవలి కాలంలో కరెంటు సర్చార్జీ రూపంలో  ప్రభుత్వం రూ. 32వేల కోట్లు భారం మోపింది. ఈ మూడేళ్ళలో ఆర్టీసీ మూడుసార్లు చార్జీలు పెంచింది. ఆపైన అభివృద్ధి చార్జీ వేశారు.  మొత్తంమీద 2010 తర్వాత 20 సార్లు ఆయిల్ ధరలు పెంచారు. 2010కి పూర్వం పరిస్థితి అదుపులో ఉండేది. ప్రస్తుత పరిస్థితికి సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం. ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా పెరుగుతున్న చార్జీలు ప్రజల వీపు మోత మోగిగిస్తున్నాయి. గతంలో ఉన్న పరిపాలన పద్ధతులను, సమన్వయాన్ని విడిచిపెట్టి వ్యవహరించడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడింది. ఆయిల్ కంపెనీలకు ప్రభుత్వం దాసోహమైంది. ఇది ప్రజాస్వామ్య విలువల్ని కాలరాయడం తప్ప మరొకటి కాదు. బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాకముందే ధరలు ఎందుకు పెంచారంటే అసెంబ్లీలో ప్రతిఘటనను తట్టుకోవడానికి. ఈ రకమైన వైఖరి ప్రజలను అపహాస్యం చేయడమే.  రాజశేఖరరెడ్డిగారుండి ఉంటే ఆయిల్ కంపెనీలతో చర్చించి ఉండేవారు. లేదా మిగిలిన చోట్ల పెంచుకోండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తప్ప అని స్పష్టంచేసి ఉండేవారు.'

వైయస్ఆర్ కాంగ్రెస్ ఎప్పుడూ ప్రజల పక్షమే
     రాజశేఖరరెడ్డిగారు నిరంతరం ప్రజల పక్షాన ఎలా నిలబడ్డారో.. అలాగే వైయస్ఆర్ సీపీ కూడా నిలబడుతుందని జూపూడి స్పష్టంచేశారు. కేంద్రం ఏ నిర్ణయం తీసుకున్నా తాము అమలు చేస్తామన్న విధానాన్ని ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తోందనీ, ఇది తగదనీ సూచించారు. మహానేత వైయస్ఆర్ జీవించినపుడు  ప్రజలకు ఎప్పుడు ఎక్కడ ఏం కావాలో గమనించుకుంటూ తానే సర్వస్వమై సంక్షేమాన్ని చూశారన్నారు. శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి  ఆధ్వర్యంలో రాజన్న రాజ్యం వస్తుందని ఆయన పేర్కొన్నారు. సామాన్యుడిపై భారం మోపి తమాషా చూస్తున్న ప్రస్తుత ప్రభుత్వ వైఖరిని తాము ఖండిస్తున్నామన్నారు. అలాగే నిన్న కురిసిన భారీ వర్షాల వల్ల నష్టపోయిన రైతులకు సాయం అందించాలని తమ పార్టీ డిమాండ్ చేస్తోందని జూపూడి ప్రభాకరరావు చెప్పారు.

స్వాగతానికి కూడా ఎవరూ మిగలరు

     వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి తామున్న పార్టీల మీద నమ్మకం కోల్పోయిన ఎమ్మెల్యేలు వస్తున్నారని జూపూడి ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. తెలుగు దేశం పార్టీకి ఆదరణ లేదని తెలుసుకుని వస్తున్నారన్నారు. చంద్రబాబు పాదయాత్ర ఇచ్చాపురం వెళ్ళేసరికి ఆయనకు స్వాగతం పలకడానికి ఎవరూ మిగలకపోవచ్చన్నారు. ప్యాకేజీల వల్ల తమ పార్టీలో ఎమ్మెల్యేలు జేరుతున్నారనడం చంద్రబాబు దిగజారుడుతనానికి తార్కాణమని పేర్కొన్నారు. రాజకీయ భవిష్యత్తు ఉంటుందని వారు విచ్చేస్తున్నారనీ, రాజశేఖరరెడ్డిగారి కుటుంబానికి అండగా నిలవాలనేది వారి ఆకాంక్ష అనీ చెప్పారు.

తాజా వీడియోలు

Back to Top