ఆర్టీసీ ప్రయాణికులపై 'టోల్' బాదుడు వద్దు

హైదరాబాద్:

టోల్ చార్జీల ‌నెపంతో ఆర్టీసీ ప్రయాణికులపై ప్రభుత్వం అదనపు భారం వేయటాన్ని వైయస్‌ఆర్ కాంగ్రె‌స్ పార్టీ తీవ్రంగా ఖండించింది. ‌టోల్‌ బాదుడును తక్షణమే ఉపసంహరించుకోవాలని పార్టీ ట్రేడ్ యూనియ‌న్ అధ్యక్షుడు బి.‌ జనక్‌ప్రసాద్ డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం ఆయన ‌ఒక ప్రకటన విడుదల చేశారు.

మహానేత,దివంగత ముఖ్యమంత్రి  డాక్టర్ వై‌యస్ రాజశేఖరరెడ్డి హయాంలో ఒక్క రూపాయి కూడా ఆర్టీసీ ప్రయాణికులపై భారం వేయకుండా సంస్థను లాభాల బాట పట్టించారని గుర్తు చేశారు. ‌ఆయన తరువాత అధికారం వెలగబెడుతున్న సిఎంలు మూడుసార్లు చార్జీలు పెంచి ప్రయాణికుల నడ్డి విరిచారని ధ్వజమెత్తారు.

తాజాగా టోల్‌గేట్ చార్జీల ‌నెపంతో మరోసారి ప్రయాణికులపై భారం మోపుతున్నారని జనక్‌ప్రసాద్‌ తన ప్రకటనలో మండిపడ్డారు. గ్రామీణ ప్రజలను సైతం వదలకుండా పల్లె వెలుగు బస్సుల్లో తిరిగే ప్రయాణికుల నుంచి‌ కూడా టోల్ రుసుం వసూలు చేయడం సిగ్గుచేటు అన్నారు. ప్రయాణికులపై పెంచిన టోల్ భారాన్ని ‌వెంటనే ఉపసంహరించుకోవాలని, లేకపోతే ప్రజల పక్షాన వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ పెద్ద ఎత్తున ఉద్యమిస్తుందని జనక్‌ప్రసాద్ హెచ్చరించారు.

Back to Top