ఆరోగ్యశ్రీని అటకెక్కిస్తే అంగీకరించం

హైదరాబాద్, 04 ఏప్రిల్ 2013:

సామాన్యుడికి ఆరోగ్యాన్ని అందించే ఆరోగ్యశ్రీ పథకాన్ని అటకెక్కించే చర్యలు సహించబోమని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. హైదరాబాద్‌లోని పార్టీ ప్రధాన కార్యాలయంలో మంగళవారం సాయంత్రం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆరోగ్యశ్రీ పేరు వింటే దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డిగారు గుర్తొస్తారని చెప్పారు. ప్రపంచంలో ఎక్కడా లేనివిధంగా సామాన్యుడికి కార్పొరేట్ వైద్యం అందుబాటులో ఉండాలనే సదుద్దేశంతో డాక్టర్ వైయస్ఆర్ దీనిని ప్రారంభించారన్నారు. ఆయన తన ఐదేళ్ళ మూడు నెలల పాలనలో ప్రవేశపెట్టిన అనేక సంక్షేమ పథకాలలో ఆరోగ్యశ్రీ అత్యంత కీలకమైనదని పేర్కొన్నారు. మూడు కోట్ల 73 లక్షల మంది ప్రజానీకం ఈ పథకంతో లబ్ధి పొందారని తెలిపారు. అత్యంత ధనవంతులతో సమానంగా సామాన్యులు ఈ పథకంలో కార్పొరేట్ ఆస్పత్రులలో వైద్య చికిత్సలు అందుకున్నారన్నారు. గుండెకు శస్త్ర చికిత్స చేయించుకున్న సామాన్యులు తమ గుండెను చూపించి మహానేత ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీలో ఆపరేషన్ చేయించుకుని హాయిగా తిరగగలుగుతున్నానని సగర్వంగా చెప్పుకుంటున్నారన్నారు. రాజశేఖరరెడ్డిగారు ప్రవేశపెట్టారు కాబట్టి.. ఆయనకు అత్యంత ఇష్టమైనది కాబట్టీ ఆరోగ్యశ్రీ పథకాన్ని కిరణ్ సర్కారు రోజురోజుకూ నీరుగారుస్తోందని అంబటి ఆరోపించారు. 133 వ్యాధులను ఈ పథకం నుంచి తొలగించడమే కాక.. వాటి చికిత్సను ప్రభుత్వాస్పత్రులకు మాత్రమే పరిమితం చేశారని మండిపడ్డారు. వీటికి సేవలందించడానికి అవసరమైన సౌకర్యాలు కూడా ప్రభుత్వాస్పత్రులలో లేవని ఎద్దేవా చేశారు. కనీసం కల్పించే ప్రయత్నం కూడా ప్రభుత్వం చేయలేదన్నారు. 133 వ్యాధులకు కేవలం ప్రభుత్వ ఆస్పత్రులలోనే చికిత్స చేయించుకోవాలనీ, కార్పొరేట్ హాస్పటల్సుకు వెళ్ళడానికి వీలులేదనీ కిరణ్ సర్కారు స్పష్టమైన ఆదేశాలిచ్చిందన్నారు. ఈ వ్యాధుల్ని తమ పరిథినుంచి తొలగించడం సబబు కాదని కార్పొరేట్ ఆస్పత్రుల యాజమాన్యాలు అంటే మిగిలిన వ్యాధుల్ని కూడా తొలగించేస్తామని ముఖ్యమంత్రి కోపంగానూ, పంతంగానూ మాట్లాడారని అంబటి చెప్పారు.

ఎద్దుల పోట్లాటలో నలిగిన లేగ గుర్తొస్తోంది..
ఈ అంశాల్ని పరిశీలించినపుడు ఎద్దుల పోట్లాటలో నలిగిపోయిన లేగదూడ గుర్తుకొస్తోందన్నారు. కార్పొరేట్ వ్యవస్థలో ఉన్న వైద్యశాలలకీ, కిరణ్ సర్కారుకి నడుమ విభేదాలు పెరిగి ఆరోగ్య శ్రీ వైద్యమందక సామాన్యుడు నలిగిపోతున్నాడని ఆవేదన వ్యక్తంచేశారు. దీనికి తోడుగా సామాన్యుడిపై మరో పిడుగు పడటానికి సిద్ధంగా ఉందన్నారు. తమ పరిథిలోని వ్యాధులకు అందించే చికిత్సలకు ఇప్పుడు చెల్లిస్తున్న దానికి అదనంగా ముప్పై శాతం పెంచాలని కార్పొరేట్ వైద్యశాలలు కోరాయనీ, ఇందుకు మేనెల 3వ తేదీని గడువుగా నిర్ణయించాయనీ, ఆపైన  ఏ వ్యాధికీ వైద్యం చేయబోమని హెచ్చరించాయనీ ఆయన వివరించారు.
ఈ అంశంమీద ఇద్దరు వైద్య శాఖ మంత్రుల స్పందన పరస్పర భిన్నంగా ఉందన్నారు. ఇప్పుడు చెల్లించేదే చాలా ఎక్కువనీ, ఎలా వైద్యం చేయరో చూస్తామనీ ఓ మంత్రి హెచ్చరికగా మాట్లాడగా.. మరో మంత్రి కార్పొరేటు ఆస్పత్రుల డిమాండు సమంజసమేనని వెనకేసుకొచ్చారని పేర్కొన్నారు.  ఇలా తగాదాలు పడడంవల్ల సామాన్యుడికి అందవలసిన సౌకర్యాలు దూరమయ్యే ప్రమాదముందని ఆయన ఆందోళన వ్యక్తంచేశారు. సామాన్యుడికి ఆరోగ్యాన్ని అందించే కార్పొరేషన్ వైద్యానికి సంబంధించిన అసోసియేషన్లకు ఆయనో విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వంతో చర్చించి ప్రస్తుత వివాదానికి పరిష్కారం కనుగొనాలి తప్ప మరింత జటిలం చేయడానికి ప్రయత్నించవద్దని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోరుకుంటోందని అంబటి తెలిపారు. సామాన్యుణ్ణి ఇబ్బంది పెట్టవద్దని కోరారు. పంతానికి పోయి.. వైద్యశాలలను బెదిరించి లొంగదీసుకునే చర్యలకు దిగి సామాన్యుడిని కష్టపెట్టొద్దని ఆయన ప్రభుత్వానికి హితవు పలికారు. అలాంటి పరిస్థితిని తెస్తే సహించేది లేదని కూడా అంబటి హెచ్చరించారు. ఫీజు రీయింబర్సుమెంటు వివాదంలో కూడా ఇలాంటి వ్యవహారశైలితోనే విద్యార్థులను ఇబ్బంది పెట్టచూశారని ఆరోపించారు. వాస్తవానికి మరింతగా విస్తరించాల్సిన పథకం ఆరోగ్యశ్రీ అని ఆయన అభిప్రాయపడ్డారు. ఇందిరమ్మబాట కార్యక్రమంలో ఆరోగ్యశ్రీని సామాన్యుడికి మరింత చేరువ చేస్తామని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చెప్పిన మరుసటి రోజే పిడుగులాంటి ఈ వార్త బయటకొచ్చిందన్నారు. ఇది చాలా దురదృష్టకరమన్నారు. ముఖ్యమంత్రి, మంత్రివర్గం సరైన రీతిలో వ్యవహరించాలని కోరారు. ఆరోగ్యశ్రీని అటకెక్కించేలా చేయకూడదని ఆయన సూచించారు. అలాచేస్తే ప్రజలు సహించరని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున హెచ్చరిస్తున్నామని అంబటి రాంబాబు స్పష్టంచేశారు.

విద్యుత్తు చార్జీలకు వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా సాగుతున్న ఆందోళనలలో పార్టీ సీనియర్ నేతలు పాల్గొంటున్నారనీ, విజయమ్మ గారి దీక్ష వద్దకు వారు రాలేదని ప్రచారం చేయడం తగదని అంబటి ఓ ప్రశ్నకు బదులు చెప్పారు. ఇలాంటివాటిని ప్రజలు కూడా నమ్మరని స్పష్టంచేశారు. 294 నియోజకవర్గాలలో సమన్వయకర్తలను నియమించి తమ పార్టీ పటిష్టంగా సాగుతోందని చెప్పారు. ఒకటిరెండు చోట్ల ఇబ్బందులుంటే సరిచేసుకుంటామనీ, అలాగనీ రాష్ట్రమంతా ఇలాంటి పరిస్థితే ఉందనడం తగదన్నారు.

Back to Top