ఆందోళన ఉద్ధృతానికి వైయస్ఆర్ కాంగ్రెస్ నిర్ణయం

కరెంటు సత్యాగ్రహ దీక్షా ప్రాంగణం, హైదరాబాద్, 06 ఏప్రిల్ 2013:

విద్యుత్తు చార్జీల పెంపుపై రాష్ట్ర ప్రభుత్వం తగిన విధంగా స్పందించటంలో విఫలమైందని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ధ్వజమెత్తింది. ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ఇప్పటికే ఉద్యమించిన పార్టీ తన ఆందోళనను మరింత ఉద్ధృతం చేయాలని నిర్ణయించింది. ఇప్పటికే నిరవధిక నిరాహార దీక్షలో ఉన్న పార్టీ గౌరవాధ్యక్షురాలు శ్రీమతి వైయస్ విజయమ్మ, పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు సంఘీభావంగా రాష్ట్రంలోని అన్ని విద్యుత్తు సబ్ స్టేషన్ల ఎదుట పికెటింగులు, ధర్నాలూ నిర్వహించాలనీ, జిల్లా కేంద్రాలలో ర్యాలీలు చేపట్టాలనీ కూడా నిర్ణయించారు.

ప్రజా సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోందని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యుడు డాక్టర్ ఎమ్.వి. మైసూరారెడ్డి, రాజకీయ వ్యవహారాల కమిటీ సమన్వయకర్త కొణతాల రామకృష్ణ  శనివారం విమర్శించారు. కరెంటు సత్యాగ్రహం దీక్షా ప్రాంగణం వద్ద వారిరువురూ శనివారం మధ్యాహ్నం విలేకరులతో మాట్లాడారు. వ్యవసాయ, గృహ, పారిశ్రామిక వర్గాల విద్యుత్తు వినియోగదారులపట్ల కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం దురుసుగా వ్యవహరిస్తోందని వారు ఆరోపించారు. మూడేళ్ళలో మూడుసార్లు కరెంటు చార్జీలు పెంచి ప్రజల నడ్డి విరుస్తున్నారని మండిపడ్డారు. 800 కోట్ల రూపాయల రాయితీ ఇచ్చామని చెప్పుకుంటున్న ప్రభుత్వం 5400 కోట్ల రూపాయల భారాన్ని మోసిన విషయాన్ని మరిచిపోయిందని ఎద్దేవా చేశారు. విద్యుత్తు సంక్షోభం నుంచి గట్టెక్కడానికి తప్పుడు గణాంకాలతో ప్రజలను తికమకపెట్టడానికి ప్రయత్నిస్తున్నారని వారు ఆరోపించారు.

Back to Top