7న గుంతకల్లులో షర్మిల పాదయాత్ర: వైవి

గుంతకల్లు:

షర్మిల ‘మరో ప్రజా ప్రస్థానం’ పాదయాత్ర ఈ నెల ఏడో తేదీన గుంతకల్లులో ప్రారంభమవుతుందని వైయస్ఆర్‌ సీపీ కేంద్ర పాలక మండలి సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. కసాపురం శ్రీనెట్టికంటి ఆంజనేయస్వామి దర్శనార్ధం విచ్చేసిన ఆయన పాదయాత్ర సమన్వయ కమిటీ సభ్యులు కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, గుంతకల్లు నియోజకవర్గ ఇన్‌చార్జి వై. వెంకటరామిరెడ్డి, ఎమ్మెల్సీ ఎస్వీ మోహన్‌రెడ్డితో కలిసి పాదయాత్ర వివరాలను  వెల్లడించారు. ఆరో తేదీ రాత్రికే షర్మిల గుంతకల్లు శివారుకు చేరుకుని, భీమిరెడ్డి గార్డెన్‌లో బస చేస్తారన్నారు. ఏడో తేదీ ఉదయాన్నే భీమిరెడ్డి గార్డెన్ నుంచి పాదయాత్రను ప్రారంభించి హనుమాన్ సర్కిల్‌లోని అభయాంజనేయస్వామి విగ్రహం, పాతగుంతకల్లులోని బీరప్ప గుడి సర్కిల్, వాల్మీకి సర్కిల్ మీదుగా మార్కెట్‌ యార్డుకు చేరుకుని, అక్కడే మధ్యాహ్న భోజనం చేస్తారని వివరించారు. అనంతరం షర్మిల టీవీస్టేషన్, 60  అడుగుల రోడ్డు మీదుగా ఆర్‌టీసీ బస్టాండ్ సమీపంలోని పొట్టి శ్రీరాములు సర్కిల్‌లో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభాస్థలికి చేరుకుంటారన్నారు. సభ ముగిసిన తరువాత మెయిన్‌రోడ్డు మీదుగా కూరగాయల మార్కెట్, కసాపురం రోడ్డు మీదుగా సత్యనారాయణపేటలోకి ప్రవేశిస్తారన్నారు. ఇదే రోజు కసాపురం పోలీసుస్టేషన్ సమీపాన ఉన్న అయ్యప్పస్వామి ఆలయంలో ఏర్పాటు చేసిన విశ్రాంతి మందిరానికి చేరుకుంటారని, ఆ రోజు రాత్రి అక్కడే బస చేస్తారన్నారు. ఎనిమిదోతేదీ ఉదయాన్నే కసాపురం మీదుగా కర్నూలు జిల్లా మద్దికెర మండలంలోకి ప్రవేశిస్తారని వారు వివరించారు.

Back to Top