500 కి.మీ. దాటిన షర్మిల పాదయాత్ర

జూల్కల్(మహబూబ్‌నగర్):

మహానేత తనయ, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి అయిన వైయస్ షర్మిల చేపట్టిన మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర శనివారం నాడు 500 కిలోమీటర్లు దాటింది. మహబూబ్ నగర్ జిల్లా వడ్డేపల్లి మండలం జూల్కల్ గ్రామానికి చేరుకున్నప్పుడు ఈ దూరాన్ని దాటింది. మహబూబ్ నగర్ జిల్లాలో ఆమె మూడో రోజు పాదయాత్ర చేస్తున్నారు. ఆమె యాత్ర మొదలు పెట్టి ముపై ఎనిమిది రోజులైంది.  వైయస్ఆర్ కడప జిల్లా ఇడుపులపాయనుంచి యాత్ర ప్రారంభమైన సంగతి తెలిసిందే.  అడుగిడిన ప్రతి చోట ప్రజలు షర్మిలకు ఘన స్వాగతం పలుకుతున్నారు. ఇంతవరకూ షర్మిల వైయస్ఆర్ కడప జిల్లా, అనంతపురం, కర్నూలు జిల్లాల్లో పాదయాత్ర చేసి గురువారం మహబూబ్‌నగర్ జిల్లాలో ప్రవేశించారు. ఆమె వెంట నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి, వైయస్ఆర్ కాంగ్రెస్ నేతలు వైవీ సుబ్బారెడ్డి, కెకె మహేందర్ రెడ్డి, బాజిరెడ్డి గోవర్థన్, తదితరులు ఉన్నారు.

Back to Top