ఉక్కు ఫ్యాక్టరీ సాధనకు రాచమల్లు దీక్ష

వైయస్‌ఆర్‌ జిల్లా: కడప ఉక్కు ఫ్యాక్టరీ సాధన కోసం దీక్ష చేయనున్నట్లు వైయస్‌ఆర్‌ సీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి ప్రకటించారు. ప్రొద్దుటూరులో పార్టీ కార్యకర్తలతో సమావేశమైన అనంతరం ఆయన వివరాలను వెల్లడించారు. ఉక్కు పరిశ్రమ ఆంధ్రరాష్ట్ర ప్రజల హక్కు అన్నారు. పరిశ్రమ సాధన కోసం 19వ తేదీన ఉదయం 10 గంటల నుంచి 48 గంటల పాటు దీక్ష చేయనున్నట్లు ఆయన చెప్పారు. నిన్నటి వరకు విభజన చట్టంలోని హామీలు, ప్రత్యేక హోదా విషయంలో ఒక్క మాట మాట్లాడని చంద్రబాబు సర్కార్‌ ఇప్పుడు దీక్షలు చేస్తానని ప్రకటించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ప్రత్యేక  హోదా, విభజన హామీలపై ప్రతిపక్షనేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో వైయస్‌ఆర్‌ సీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, నాయకులు, కార్యకర్తలు నాలుగేళ్లుగా పోరాటం చేస్తున్నారని గుర్తు చేశారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం వైయస్‌ఆర్‌ సీపీ ఎంపీలు వారి పదవులను సైతం త్యాగం చేశారన్నారు. ఎంపీ పదవులకు రాజీనామాలు చేసి ఢిల్లీలో ఆమరణ దీక్ష చేశారన్నారు. టీడీపీ నేతలు చిత్తశుద్ధి లేని దీక్షలు చేస్తున్నారని, ఇదంతా ఎన్నికల ఎత్తుగడ అని, ప్రజలు ఎవరూ టీడీపీ చేష్టలను నమ్మే పరిస్థితిల్లో లేరన్నారు.
Back to Top