మహానేతే నాకు ఆదర్శం: జలగం

ఖమ్మం:

పేదల మోములో చిరునవ్వు చూసేందుకు దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్‌రెడ్డి అహర్నిశలు కష్టపడ్డారని, ఆయన మరణానంతరం ప్రభుత్వం సంక్షేమ పథకాలను విస్మరించిందని సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావ్ చెప్పారు. ఖమ్మం పెవిలియన్ గ్రౌండ్‌లో ఏర్పాటైన భారీబహిరంగ సభలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మ సమక్షంలో జలగం వెంకట్రావ్ పార్టీలో చేరిన సందర్భంగా ఆయన ప్రసంగించారు. మహానేత పాదయాత్రతో 2004లో రాష్ట్రంలో, కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందనీ, పాదయాత్రలో ఆయన చూసిన ప్రజల ఇబ్బందులను తీర్చేందుకు అహోరాత్రులు శ్రమించారనీ అన్నారు. మహానేత స్ఫూర్తితో ఆనాడు ఎమ్మెల్యేగా ఉన్న తాను జిల్లాలో అనేక అభివృద్ధి పనులకు నిధులు తెచ్చానని వివరించారు. జిల్లాను సస్యశ్యామలం చేసేందుకు ఇందిరాసాగర్, రాజీవ్‌సాగర్ ప్రాజెక్టులను ప్రారంభించారనీ, మహానేత ఉన్నంత కాలం ఇవి వేగంగా సాగాయనీ, అనంతరం నిలిచిపోయాయనీ వివరించారు. ప్రజల సంక్షేమం కోసం వైయస్ఆర్ 108, 104, ఆరోగ్యశ్రీతోపాటు అనేక పథకాలను రూపొందించారనీ, ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం వీటిని విస్మరించిందన్నారు. జిల్లాలో మాజీ ముఖ్యమంత్రి జలగం వెంగళరావు అనంతరం జిల్లాను అభివృద్ధి పథంలో నడిపించిన ఘనత  రాజశేఖర్‌రెడ్డికే దక్కిందన్నారు. గిరిజనులకు ఉపాధి కల్పించేందుకు గిరిజన బెటాలియన్ ఏర్పాటు చేశారని, దీని వల్ల 4,500 మంది గిరిజనులకు ఉపాధి లభించిందన్నారు.  వైయస్‌ఆర్‌తో ఐదేళ్లపాటు పనిచేసిన స్ఫూర్తితో ఆయన ఆశయసాధనకోసం ఆవిర్భవించిన వైఎఎస్‌ఆర్‌సీపీలో చేరినట్లు వివరించారు.

Back to Top