ధర్మదీక్షల పేరుతో చంద్రబాబు మరోసారి మోసగించే ప్రయత్నం

కాంగ్రెస్‌కు పట్టినగతే టీడీపీ, బీజేపీకి పడుతుంది
రైల్వేజోన్‌ ఇవ్వలేమని చెప్పడం బాధాకరం
రాష్ట్రంలో ఎక్కడ చూసినా అవినీతి కంపుకొడుతోంది
చంద్రబాబు, లోకేష్‌ అవినీతిపై ఏ ఎంక్వైరీ వేసినా ఆధారాలతో సహా నిరూపిస్తాం
తనది నీతివంతమైన పాలన అని బాబు చెప్పడం సిగ్గుచేటు
వైయస్‌ఆర్‌ సీపీ పారిపోయిందనడానికి అది నోరా.. తాటిమట్టా బాబూ?
బాబుతో కలిసి ప్రవచనాలు బోధిస్తున్న పవన్‌కల్యాణ్‌
అవిశ్వాసానికి మద్దతు కూడగడతానని పత్తాలేకుండా పారిపోయాడు
చంద్రబాబుకు దమ్ముంటే ఢిల్లీలో ధర్మపోరాటాలు చేయాలి
కాపుల విషయంలో వైయస్‌ జగన్‌ స్పష్టమైన ప్రకటన చేశారు
కాపులను ఎప్పటికీ వైయస్‌ జగన్‌ మోసం చేయరు
వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత బొత్స సత్యనారాయణ

విజయవాడ: రాష్ట్రంలో కాంగ్రెస్‌కు పట్టినగతే బీజేపీ, టీడీపీలకు పడుతుందని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత బొత్స సత్యనారాయణ హెచ్చరించారు. రైల్వేజోన్‌ ఇవ్వలేమని కేంద్రం ప్రకటించడాన్ని బొత్స సత్యనారాయణ తీవ్రంగా ఖండించారు.  విజయవాడలోని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో బొత్స సత్యనారాయణ విలేకరుల సమావేశం నిర్వహించారు. పార్లమెంట్‌లో కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ సానుకూల నిర్ణయం వస్తుందని చెప్పారని, సుప్రీం కోర్టులో రైల్వేజోన్‌ ఇవ్వడానికి వీలుపడదనే అంశాన్ని చూస్తుంటే బాధేస్తుందన్నారు. దీనికి బీజేపీ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు. బీజేపీకి నాలుగేళ్లు సహకరించిన చంద్రబాబుకూ ఆ గతే పడుతుందన్నారు. నాలుగేళ్లుగా కేంద్రం, రాష్ట్రంలో మిత్రపక్షాలుగా కొనసాగిన బీజేపీ, టీడీపీ రాజకీయ లబ్ధి పొందారన్నారు. ప్రత్యేక హోదా, విభజన చట్టంలోని అంశాలను కాలరాసిన చంద్రబాబు ఇప్పుడు ధర్మదీక్షలు అంటూ మాట్లాడే మాటలు చూస్తుంటే.. ఇంకోసారి ప్రజలను మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు అర్థం అవుతుందన్నారు. ప్రజలంతా చంద్రబాబు పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. 

రాష్ట్రంలో ఎక్కడ చూసినా అవినీతి కంపుకొడుతోందన్నారు. పరిపాలన గాలికొదిలేసిన చంద్రబాబు రైతులు, డ్వాక్రా మహిళలు, విద్యార్థులు, నిరుద్యోగులను మోసం చేశారని బొత్స ధ్వజమెత్తారు. శాంతిభద్రతల సమస్య తీవ్రమైందన్నారు. ఇవన్నీ కప్పిపుచ్చుకోవడానికి కేంద్రంపై యుద్ధమని మరోసారి మోసం చేయడానికి ప్రయత్నంలో భాగమే నిన్న చంద్రబాబు వ్యాఖ్యలన్నారు. వైయస్‌ఆర్‌ సీపీ అవినీతి కంపుకొడుతోందని చంద్రబాబు మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. నీది నీతివంతమైన పరిపాలన అని భావిస్తున్నావా చంద్రబాబూ? ఎక్కడెక్కడ అవినీతి జరుగుతుందో మీకు తెలియదా? అని ప్రశ్నించారు. అవినీతి గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదన్నారు. పట్టిసీమ మొదలుకొని పంచభూతాలను పంచుకొని తినేస్తున్నారన్నారు. సాదారణ కార్యకర్త నుంచి ముఖ్యమంత్రి వరకు అవినీతి చేస్తూ నీతివంతమూన పాలన అని మాట్లాడడం సిగ్గుచేటన్నారు. 

కేంద్రంతో లాలూచీ పడి రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్నారు.. పోరాడండి అని నాలుగేళ్లుగా వైయస్‌ జగన్‌ చంద్రబాబును ప్రశ్నిస్తే.. రాష్ట్ర అభివృద్ధి కోసం కలిసి ఉంటున్నామన్న చంద్రబాబు ఇన్నాళ్లు సఖ్యతగా ఉండి ఏం సాధించారో చెప్పాలని బొత్స డిమాండ్‌ చేశారు. నాలుగేళ్ల తరువాత ప్రత్యేక హోదా గుర్తుకు వచ్చిందా చంద్రబాబూ! అని నిలదీశారు. ప్రజలంతా వ్యతిరేకంగా ఉన్నారని చంద్రబాబు గేమ్‌ప్లాన్‌ మొదలుపెట్టారన్నారు. ఎంపీలతో రాజీనామాలు చేయిస్తామని వైయస్‌ జగన్‌ ప్రకటిస్తే.. చంద్రబాబు, కేబినెట్‌ మంత్రులు ఎప్పుడు చేస్తారు.. అని ప్రశ్నించింది వాస్తవం కాదా అన్నారు. ఇవాళ కేంద్రంతో లాలూచీ పడి వైయస్‌ఆర్‌ సీపీ రాజీనామాలు చేసి పారిపోయిందని చంద్రబాబు మాట్లాడడం దుర్మార్గమన్నారు. అది నోరా.. తాటిమట్టా చంద్రబాబూ అని విరుచుకుపడ్డారు. అంటే ఎప్పుడు పడితే అప్పుడు.. ఎలా కావాలంటే అలా మీ భాషను, భావాన్ని మార్చుకుంటారా..? అని ప్రశ్నించారు. ప్రజలను సులువుగా మోసం చేయొచ్చు.. చెవుల్లో పూలు పెట్టుకున్నారనుకుంటున్నావా చంద్రబాబూ అని నిలదీశారు. 

చంద్రబాబుకు తోడు మరో వ్యక్తి కలిసి ప్రవచనాలు బోధిస్తున్నారని బొత్స మండిపడ్డారు. చంద్రబాబుతో చేతులు కలిపి టీడీపీ అధికారానికి ప్రచారం చేసిన పవన్‌కల్యాణ్‌ వైయస్‌ఆర్‌ సీపీ అవిశ్వాసం పెడితే నేను మద్దతు కూడగడతానని చెప్పారని, చంద్రబాబు ఐదుగురితో అవిశ్వాసం ఏం సాధ్యమన్నారని గుర్తు చేశారు. వైయస్‌ఆర్‌ సీపీ అవిశ్వాసంతో చంద్రబాబు యూటర్న్‌ తీసుకుంటే.. మద్దతు కూడగడతానన్న వ్యక్తి కనుచూపు మెరల్లో కానరాకుండా పారిపోయాడన్నారు. వీళ్లు ఇవాళ ప్రవచాలు చేస్తుంటే వినాల్సిన దౌర్భాగ్యం దాపరించిందన్నారు. 

బీజేపీ పెద్దలారా.. ఇంకా మా ప్రజలను చంపేయకండీ.. ఆరు నెలల సమయం ఉంది.. ప్రత్యేక హోదా ఇచ్చి రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలని బొత్స సత్యనారాయణ వేడుకున్నారు. ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితిని కల్పించకండీ.. ఇంకా ఎంతమందిని పొట్టనపెట్టుకుంటారని ప్రశ్నించారు. మదనపల్లెలో హోదా కోసం ప్రాణాలొదిలిన సుధాకర్‌ది ఆత్మహత్యా.. లేక ప్రభుత్వ హత్యా చెప్పాలన్నారు. గొంతులు చించుకొని చంద్రబాబు మాట్లాడుతున్నారు. ఇలాంటి మాటలు మూడేళ్ల క్రితం చేస్తే బాగుండేదన్నారు. నరేంద్రమోడీ ప్రసంగాలు టీవీల్లో వేయించి ప్రజలకు చూపిస్తున్నారని, మూడున్నరేళ్లుగా వీటినే వైయస్‌ జగన్‌ వివిధ సభల్లో అందరికీ వినిపించారన్నారు. ప్రత్యేక హోదా కంటే ప్యాకేజీ బ్రహ్మాండంగా ఉంది.. ప్యాకేజీని ప్రకటించిన వారికి సన్మానాలు చేసింది మీరు కాదా చంద్రబాబూ అని విరుచుకుపడ్డారు. 

ఈ మధ్యనే మంత్రి అయిన చంద్రబాబు తనయుడు లోకేష్‌ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారని బొత్స సత్యనారాయణ అన్నారు. లోకేష్‌ ,చంద్రబాబుల అవినీతి ఎక్కడ నుంచి మొదలు పెట్టి.. ఎక్కడ ముగించమంటారో లోకేష్‌ చెప్పాలన్నారు. విశాఖపట్నం నుంచి మొదలుపెడితే.. విశాఖలో భూముల కుంభకోణాలు జరిగాయని, తాను పుట్టక ముందు నుంచి విశాఖలో సర్కులర్‌ హౌస్‌ ఉండేది.. దాని కనుచూపు మెరలో భూములు కనిపించేవనీ.. గత మూడేళ్లుగా అక్కడ ఇళ్లు కనిపిస్తున్నాయి. అవి ఎవరివంటే చంద్రబాబు, లోకేష్‌ బంధువులవి అని చెబుతున్నారన్నారు. హుద్‌హుద్‌ తుఫాన్‌ వస్తే రికార్డులు మారిపోయింది వాస్తవం కాదా..? ఆ భూములు నువ్వు దోచుకోలేదా లోకేష్‌..? ఎన్ని అవినీతి కార్యక్రమాలు బయటపెట్టాలి. జాతీయ ప్రాజెక్టుగా ఉన్న పోలవరాన్ని సంవత్సరన్నర కాలంగా ఒక్క పిడికెడు కాంక్రీట్‌ కూడా పడలేదని, హోదాను తాకట్టుపెట్టి కాంట్రాక్టుల కోసం పోలవరం తీసుకున్న తరువాత అడ్డగొలుగా దోచుకుంది వాస్తవం కాదా... పట్టిసీమలో అవినీతి జరిగింది నిజం కాదా..? 12 లక్షల మంది ఉసురు పోసుకొని విశాఖలో బీచ్, విజయవాడలో ఐల్యాండ్‌పై కన్నుపడి అగ్రిగోల్డ్‌ బాధితుల కడుపుకొట్టింది వాస్తవం కాదా..? జీఎస్‌ఎల్‌ సంస్థతో ఢిల్లీలో లావాదేవీలు నడిపి అగ్రిగోల్డ్‌ ఆస్తులు కొనకుండా ఒప్పందాలు కుదుర్చుకుంది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. పెద్ద నోట్ల రద్దు జరిగినప్పుడు కేంద్రంతో మీకున్న సంబంధాలతో హెరిటేజ్‌ గ్రూపుల్లో వందల కోట్లకు షేర్‌లు అమ్మారో తెలియదా.. ప్రజలు అమాయకులు అనుకుంటున్నారా లోకేష్‌ గారూఅని విరుచుకుపడ్డారు. గురజాలలో ఎమ్మెల్యే యరపతినేని అవినీతిపై చంద్రబాబు, లోకేష్‌కు భాగముందని కోర్టు అక్షింతలేసింది నిజం కాదా..? వీటిపై ఏ ఎంక్వైరీ వేసినా ఆధారాలతో సహా నిరూపిస్తామన్నారు. 

వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ బంద్‌లు చేస్తే ఢిల్లీకి వెళ్లి చేయండి అని చెప్పిన చంద్రబాబు, రాష్ట్రంలో ప్రభుత్వ ధనంతో ఎందుకు ధర్మపోరాటాలు చేస్తున్నారని ప్రశ్నించారు. వైయస్‌ఆర్‌ సీపీ అసెంబ్లీలో పోరాడకుండా.. ప్రజల్లోకి ఎందుకు వచ్చిందని, తనకు ఎమ్మెల్యేలు ఉంటే గట్టిగా పోరాడేవాడినని పవన్‌ కల్యాణ్‌ చేసిన వ్యాఖ్యలపై బొత్స ఘాటుగా స్పందించారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేలను కోట్లు పెట్టి సంతలో పశువులను కొన్నట్లు కొని మంత్రి పదవులు ఇస్తే.. దానికి గవర్నర్, స్పీకర్‌ ఆమోద ముద్ర వేశారన్నారు. రాజ్యాంగ విరుద్ధంగా చంద్రబాబు వ్యవహరిస్తున్నప్పుడు అసెంబ్లీకి వెళ్లి ఏం చేయాలని, ప్రజాక్షేత్రంలో ప్రభుత్వ తప్పులను ఎత్తిచూపుతూ పోరాడుతున్నామన్నారు. అసలు ఏ ఒక్కరోజైనా చంద్రబాబు చేసే అప్రజాస్వామిక విధానాలపై పవన్‌ ఎప్పుడైనా ప్రశ్నించారా? అలాంటి వ్యక్తికి వైయస్‌ఆర్‌ సీపీని విమర్శించే హక్కు లేదన్నారు.

కాపుల రిజర్వేషన్‌ అంశంపై చంద్రబాబులా మోసం చేయకుండా వైయస్‌ జగన్‌ స్పష్టంగా తన వైఖరి ప్రకటించారని బొత్స చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబులా ఇస్తానని మోసం చేయలేదు.. అసెంబ్లీలో చిత్తుకాగితాలకు కూడా పనికి రాని తీర్మానాలు చేయడం.. కమిషన్‌ వేయడం. చైర్మన్‌ పారిపోవడం లాంటి మోసాలు చేయను అని.. నిక్కచ్చిగా కాపుల తాలూకా అభివృద్ధి కోసం పోరాటం చేస్తానని వైయస్‌ జగన్‌ చెప్పారన్నారు. హోదా సాధించాలంటే 25 మంది ఎంపీలను వైయస్‌ఆర్‌సీపీకి ఇస్తే.. ప్రత్యేక హోదా ఫైల్‌ మీద ఎవరు అమరావతికి వచ్చి సంతకం పెడితే వారికి మద్దతు ఇచ్చి, కాపుల సమస్య కూడా ప్రస్తావిస్తానని చెప్పారన్నారు. చంద్రబాబులా మభ్యపెట్టకుండా వాస్తవం చెప్పారన్నారు.
Back to Top