వచ్చే ఎన్నికల్లో మళ్లీ మిమ్మల్ని ఆశీర్వదించమని అడిగే నైతిక హక్కు మీకుందా?

 
09–06–2018, శనివారం
నిడదవోలు, పశ్చిమ గోదావరి జిల్లా

సత్యం గడపదాటే లోపల అసత్యం ప్రపంచాన్ని చుట్టేసి వస్తుందట! అందుకేనేమో అసత్యం మీద అపార నమ్మకాన్ని పెంచుకున్న బాబుగారు.. ప్రజల కళ్లకు గంతలు కట్టే ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఓ వైపు చంద్రబాబుగారు తన నాలుగేళ్ల పాలనను పురస్కరించుకుని కోట్లాది రూపాయలు ఖర్చుపెడుతూ, సంబరాలు చేసుకుంటూ, ఇచ్చిన అన్ని హామీలు నెరవేర్చానని, సంక్షేమ పథకాలను అందించడంలో ఎక్కడా పార్టీలవారీగా వివక్ష చూపలేదని, దోపిడీ, అవినీతి లేని సుపరిపాలన అందించానని, ప్రజలంతా సుఖసంతోషాలలో తేలిపోతున్నారని.. అబద్ధాలతో, అసత్య ప్రచారాలతో ప్రజల్ని మభ్యపెట్టడానికి ప్రయత్నిస్తున్నారు. మరోవైపు ఈ రోజు పాదయాత్రలో సైతం నా దృష్టికి వచ్చిన ప్రజా సమస్యల వెల్లువ.. వివక్షాభరితమైన బాబుగారి అవినీతి పాలనను పట్టిచూపింది. ఇప్పటివరకు జరిగిన పాదయాత్రలో బాబుగారి వివక్ష గురించిన ఫిర్యాదు లేని రోజంటూ లేదు. ఇదీ అసలుసత్యం.

మూతపడ్డ చాగల్లు షుగర్‌ ఫ్యాక్టరీ ఆస్తులను అమ్మి తమకు న్యాయం చేయాల్సింది పోయి యాజమాన్యంతో లాలూచీ పడి, ఆస్తుల వేలం ప్రక్రియను మొక్కుబడి తంతుగా మార్చేసి, తమకు తీరని అన్యాయం చేసిందీ ప్రభుత్వం అంటూ విరుచుకుపడ్డారు నన్ను కలిసిన కార్మిక, రైతు సోదరులు. నాలుగేళ్లుగా నరకయాతనకు గురిచేస్తున్న కార్మిక, కర్షక వ్యతిరేక పాలనకు అద్దంపట్టిన ఘటన ఇది.  


యంత్రాల సాయంతో వందల కోట్ల విలువైన ఇసుకను గోదారమ్మ గర్భం నుంచి కొల్లగొట్టి స్థానిక ప్రజాప్రతినిధి, అధికారులు మొదలుకుని చినబాబు, పెదబాబు వరకు వాటాలు పంచుకున్న వైనాన్ని వివరించారు.. కడుపుమండిన నిడదవోలు రైతన్నలు. కూలిపోయిన పశ్చిమ డెల్టా ప్రధాన కాలువ వంతెనను ఈ రోజు సాయంత్రం నిడదవోలులో ప్రవేశిస్తున్నప్పుడు కళ్లారా చూశాను. పుష్కరాల అవినీతికి నిలువెత్తు నిదర్శనం.. ఆ వంతెన. వెలుగులో క్లస్టర్‌ యానిమేటర్‌గా పనిచేస్తున్న తనను.. జగనన్న అభిమానినని ఉద్యోగంలో నుంచి తీసేశారని వాపోయింది వాణీలక్ష్మి.



వైసీపీ మద్దతుదారులమని తమకు పింఛన్లు ఇవ్వడం లేదని, లోన్లు మంజూరు చేయడం లేదని మునిపల్లి గ్రామ రజకుల వీధి, కొమ్మనవారి వీధి అక్కచెల్లెమ్మలు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీవారి అక్రమాలకు సహకరించలేదని ఉపాధి హామీ ఫీల్డ్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న తనను విధుల నుంచి తొలగించడంతో మానసికంగా కుంగిపోయి అనారోగ్యం పాలయ్యానని కలవచర్ల దగ్గర కలిసిన సుధారాణి కన్నీరుపెట్టుకుంటుంటే... ఆడపడుచన్న కనీస సానుభూతి కూడా చూపలేని అనాగరిక పాలనపై అసహ్యమేసింది. రెండు కిడ్నీలు పాడై చావుబతుకుల్లో ఉన్న తన బిడ్డను కాపాడుకోవడానికి లక్షలు అప్పుచేసి కిడ్నీ ఆపరేషన్‌ చేయించాడు సూరిబాబనే తండ్రి.

కేవలం అతడు వైసీపీ సానుభూతిపరుడనే వివక్షతో సీఎం రిలీఫ్‌ ఫండ్‌ నుంచి చేయూతను అందించకుండా కక్ష సాధిస్తున్నారట. ఆరోగ్య శ్రీ వర్తించక, ముఖ్యమంత్రి సహాయనిధీ అందక ఆ అన్న పడుతున్న బాధ చూస్తుంటే ఇంతకన్నా అమానవీయత ఎక్కడైనా ఉంటుందా? అనిపించింది. వైసీపీ తరఫున సర్పంచ్‌గా గెలిచిన తనను బీసీ మహిళ అని కూడా చూడకుండా, అధికారాలన్నీ హరించివేసి, ఉత్సవ విగ్రహంగా మార్చేసి, అవమానాలపాలు చేస్తూ, వేధింపులకు గురిచేస్తున్నారని తాళ్లపాలెం సర్పంచ్‌ వీరమల్లు ప్రశాంతి చెబుతుంటే.. బలహీనవర్గాలపై ఈ పాలకులకున్న కపటప్రేమ మరోసారి తేటతెల్లమైంది.

ముఖ్యమంత్రిగారికి నాదో ప్రశ్న.. మీ పాలనలో సంక్షేమ పథకాలెన్నింటినో నిర్వీర్యం చేశారు. మిగిలిన కొద్దివాటిలో ప్రజలకందేది అరకొరగానే ఉండటం జగమెరిగిన సత్యం. వాస్తవ పరిస్థితులిలా ఉంటే.. పార్టీలకతీతంగా ప్రజలందరికీ సంక్షేమ పథకాలందించామంటూ ప్రకటించడం మళ్లీ ఎవరిని మోసం చేయడానికి? వచ్చే ఎన్నికల్లో మళ్లీ మిమ్మల్ని ఆశీర్వదించమని అడిగే నైతిక హక్కు మీకుందా?
- వైయ‌స్ జ‌గ‌న్‌


Back to Top