ఈనెల 30న ప్రకాశం జిల్లాలో వైఎస్ జగన్ పరామర్శ..!

పొగాకు రైతుల పక్షాన పోరాటం..!
గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్..!
ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు పరామర్శ..!
హైదరాబాద్ః పొగాకు రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేస్తూ ప్రతిపక్ష నేత, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకాశం జిల్లా టంగుటూరులో బుధవారం ధర్నా చేయనున్నారు. ప్రభుత్వం కొనుగోళ్లు జరపక, మద్దతు ధర చెల్లించక  రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఐనా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుంది. ఈనేపథ్యంలోనే కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు వైఎస్ జగన్ రైతులకు మద్దతుగా టంగుటూరులో ధర్నా చేపడుతున్నారు. 

రైతుల పక్షాన పోరాటం
గిట్టుబాటు ధర లభించక గతంలో ఎన్నడూ లేనివిధంగా ప్రకాశం జిల్లాలో ముగ్గురు పొగాకు రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఈనేపథ్యంలోనే పొగాకు రైతుల పక్షాన పోరాడేందుకు వైఎస్ జగన్ సిద్ధమయ్యారు. ముందుగా ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలను వైఎస్ జగన్ పరామర్శిస్తారు. ఆత్మహత్యలు పునరావృతం కాకుండా రైతులకు భరోసా కల్పిస్తారు. ఆతర్వాత ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ టంగుటూరు పొగాకు కొనుగోలు కేంద్రంలో ధర్నా చేస్తారు. 

ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకొచ్చేందుకే..!
పొగాకు రైతుల దుస్థితికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలే కారణమని వైఎస్సార్సీపీ నేతలు మండిపడ్డారు. మార్చిలో ప్రారంభమైన కొనుగోళ్లు జూలై 17నాటికే ముగియాల్సి ఉండగా, ఇంకా కొనసాగుతున్నాయంటే ప్రభుత్వం నిర్లక్ష్యం ఏపాటిదో అర్థమవుతుందన్నారు. పొగాకు కొనుగోళ్లలో రాబోయే ఇబ్బందులపై వైఎస్ జగన్ ముందుగానే ప్రభుత్వాన్ని హెచ్చరించినా పట్టించుకోలేదని విమర్శించారు. తమ పార్టీ ఎంపీ వైవి సుబ్బారెడ్డి సహచర ఎంపీలతో రైతుల దుస్థితిని కేంద్రమంత్రుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేదని వాపోయారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్. రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు కిలో పొగాకు రూ.199 ధర చెల్లించారని వైఎస్సార్సీపీ నేతలు గుర్తుచేశారు. ప్రస్తుతం రూ.105 కూడా రాని పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. 
Back to Top