రెండవరోజు కొనసాగుతున్న జగన్‌ సమైక్య దీక్ష

హైదరాబాద్, 6 అక్టోబర్ 2013:

రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలన్న డిమాండ్‌తో వైయస్‌ఆర్ కాంగ్రె‌స్ పార్టీ అ‌ధ్యక్షుడు, యువనేత, జననేత శ్రీ వైయస్ జగన్మోహన్‌రెడ్డి చేస్తున్న ‘సమైక్య దీక్ష’ రెండవరోజు ఆదివారంనాడు కూడా కొనసాగుతోంది. విభజన విషయంలో కేంద్రం అనుసరిస్తున్న నిరంకుశ విధానాలను నిరసిస్తూ ఆయన లోటస్‌పాండ్‌లోని తన క్యాంపు కార్యాలయం ఎదుట శనివారం ఉదయం ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించారు. మహానేత డాక్టర్‌ రాజన్న తనయుడైన శ్రీ జగన్ ‌మొక్కవోని సంకల్పంతో తన దీక్షను కొనసాగిస్తున్నారు.

జననేత శ్రీ జగన్ దీక్షకు రాష్ట్రం నలుమూలల నుంచీ‌ అభిమానులు, పార్టీ శ్రేణుల నుంచి మద్దతు వెల్లువెత్తుతోంది. శ్రీ జగన్‌కు సంఘీభావంగా ఆదివారం ఉదయం నుంచే దీక్షా ప్రాంగణానికి ప్రజలు తరలివస్తున్నారు. దీక్షా ప్రాంగణానికి వచ్చిన ప్రతి ఒక్కరినీ శ్రీ జగన్ ఎంతో ఆప్యాయంగా పలకరిస్తున్నారు. రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న శ్రీ జగన్మోహన్‌రెడ్డిని అందరూ అభినందిస్తున్నారు. శ్రీ జగన్‌ ఆరోగ్యం పట్ల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించాలని కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని వారంతా తూర్పారపడుతున్నారు.

రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకూ సమన్యాయం చేయకుండా అడ్డగోలుగా రాష్ట్రాన్ని విభజించడంపై సుప్రీంకోర్టులో న్యాయపోరాటం చేస్తామని శ్రీ జగన్మోహన్‌రెడ్డి దీక్ష ప్రారంభించిన అనంతరం స్పష్టంచేశారు. అసెంబ్లీ తీర్మానం లేకుండా గతంలో ఏ రాష్ట్రాన్నీ విడదీయలేదని అన్నారు. కానీ మన రాష్ర్టం విషయానికొచ్చేసరికి తీర్మానం లేకపోయినా, ఆరు నెలల్లో ఎన్నికలున్నా అన్నీ పక్కనపెట్టి ఓట్లు, సీట్ల కోసం విడదీస్తామంటున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మా రాష్ట్రంలోని బిడ్డల జీవితాలతో, భవిష్యత్తుతో చెలగాటమాడటం ఎందుకని సోనియాను ప్రశ్నించారు. కేవలం రాహుల్‌గాంధీని ప్రధానిని చేసుకోవడం కోసమే కాకుండా గుక్కెడు తాగునీటి కోసం రోడ్డెక్కుతున్న ఆంధ్రప్రదేశ్ బిడ్డల గురించి కూడా ఆలోచించాలని ఆమెకు సూచించారు.

చంద్రబాబు నాయుడు సోమవారం నుంచి ఢిల్లీలో దీక్ష ఎందుకు చేయాలనుకున్నారో చెప్పాలని శ్రీ జగన్మోహన్‌రెడ్డి ప్రశ్నించారు. ‘ఈ విభజనను నేను వ్యతిరేకిస్తున్నాను, సమైక్యాంధ్రప్రదేశ్‌ను కొనసాగించండి’ అంటూ లేఖ రాసిన తర్వాతే చంద్రబాబు నాయుడు దీక్షకు కూర్చోవాలని డిమాండ్ చేశారు. అప్పుడు తాను కూడా ‌చంద్రబాబు దీక్షకు మద్దతిస్తానన్నారు. ‘వాళ్లేదో బుద్ధి లేక రాష్ట్రాన్ని విభజిస్తే మీరెందుకు మద్దతు పలుకుతున్నారు?’ అని చంద్రబాబును శ్రీ జగన్ ప్రశ్నించారు.

Back to Top