ఉక్కు ప‌రిశ్ర‌మ సాధ‌న‌కు 29న రాష్ట్రబంద్


 

ఎమ్మెల్యే రాచమల్లుకు  ఎమ్మెల్యే అంజద్‌బాషా, సురేష్‌బాబు, వెంకటసుబ్బయ్య మద్దతు 

వైయ‌స్ఆర్ జిల్లా :  క‌డ‌ప ఉక్కు ప‌రిశ్ర‌మ సాధ‌న‌కు పోరాటం ఉద్ధృతం చేస్తూ ఈ నెల 29న రాష్ట్ర‌బంద్‌కు పిలుపునిస్తున్న‌ట్లు వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్యే రాచ‌మ‌ల్లు శివ‌ప్ర‌సాద్‌రెడ్డి పేర్కొన్నారు. ఎన్నికలు దగ్గర పడుతుండటంతో టీడీపీ నాటకాలు ఆడుతుంద‌ని,  ఎన్ని కుట్రలు పన్నినా ఈ ప్రాంత ప్రయోజనాల కోసం వైయ‌స్ఆర్‌సీపీ  పోరాడుతోంద‌ని స్ప‌ష్టం చేశారు. ఈ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని, 29న రాష్ట్రబంద్‌ను విజ‌య‌వంతం చేయాల‌ని ఆయ‌న పిలుపునిచ్చారు. ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి పుట్టపర్తి సర్కిల్‌లో చేపట్టిన 48 గంటల నిరాహార దీక్షకు అన్ని వ‌ర్గాల నుంచి అనూహ్య స్పంద‌న ల‌భించింది. ఈ సంద‌ర్భంగా వైయ‌స్ఆర్‌సీపీ నాయ‌కులు మాట్లాడుతూ..ఆరేళ్లుగా పార్లమెంట్‌ సభ్యునిగా ఉన్న సీఎం రమేష్‌ ఏనాడు జిల్లాలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలని మాట్లాడలేదని, నేడు ఆమరణ దీక్ష అంటూ డ్రామా ఆడటాన్ని ప్రజలు గమనిస్తున్నారని కడప ఎమ్మెల్యే అంజద్‌ బాషా అన్నారు.  ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటైతే నిరుద్యోగ సమస్య పరిష్కరమవుతుందన్నారు. దివంగత సీఎం వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి ఈ జిల్లాను పారిశ్రామికంగా అభివృద్ధి చేయాలని తలచారన్నారు. ఆయన బ్రహ్మణి స్టీల్‌ ఫ్యాక్టరీని ప్రారంభించారన్నారు. దీనికి రూ.1700 కోట్లు ఖర్చుపెట్టారన్నారు. అయితే చంద్రబాబు కోర్టులో కేసు వేయడంతో పరిశ్రమ ఆగిపోయిందన్నారు.

 వైయ‌స్ఆర్‌సీపీ  అన్ని పార్టీలను కలుపుకొని జిల్లాలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని ఉద్యమాలను చేసిం దని తెలిపారు. బ్రహ్మణీ స్టీల్స్‌కు ఇచ్చిన భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకుని సెయిల్‌ ప్రభుత్వ సంస్థ ద్వారా స్టీల్‌ ప్లాంట్‌ ఏర్పాటు చేయాలని కోరారన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు అవుతున్నా ఏ ఒక్క హామీని నెరవేర్చలేదన్నారు. రాష్ట్రానికి రావాల్సిన ప్రత్యేక హోదా, విభజన హామీల్లో అన్ని అంశాలపై పోరాడింది వైయ‌స్‌ జగన్‌ ఒక్కరే అని తెలిపారు.  

దిక్కుతోచ‌ని స్థితిలో టీడీపీ
నాలుగేళ్లుగా చంద్రబాబు మాయమాటలు చెప్పి కేంద్రంతో సంసారం చేశారని వైయ‌స్ఆర్‌సీపీ కడప పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు సురేష్‌బాబు అన్నారు. ఎన్నికలు వస్తుండటం, వైయ‌స్ జగన్‌మోహన్‌రెడ్డి పాదయాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతుండటంతో టీడీపీ దిక్కుతోచని స్థితిలో ఉందన్నారు. పార్లమెంట్‌లో సీఎంరమేష్‌ ఏ రోజన్నా జిల్లాకు ఉక్కు పరిశ్రమ కావాలని ప్రశ్నించారా? అని అన్నారు. ఎప్పుడు కాంట్రాక్టర్లు చేసుకుని డబ్బు ఎలా దోచుకుందుకే తప్ప రాష్ట్ర ప్రయోజనాల కోసం కాదన్నా రు. తమ ఎంపీలు మొదటి నుంచి ఉక్కు పరిశ్రమ కోసం మాట్లాడుతునే ఉన్నారన్నారు. బీజేపీతో తెగతెంపులు చేసుకున్నట్లు నాటకమాడుతూ దొంగ దీక్షలు చేస్తున్నారన్నారు.  


Back to Top