22న గుంటూరులో షర్మిల పాదయాత్ర ప్రారంభం

గుంటూరు, 17 ఫిబ్రవరి 2013: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి సోదరి శ్రీమతి షర్మిల గుంటూరు జిల్లాలో చేయనున్న మరో ప్రజాప్రస్థానం పాదయాత్రలో స్వల్ప మార్పులు చేసినట్లు పార్టీ గుంటూరు జిల్లా కన్వీనర్‌ మర్రి రాజశేఖర్‌, పార్టీ కార్యక్రమాల అమలు కమిటీ కో ఆర్డినేటర్ తలశిల రఘురాం ఆదివారం మీడియాకు తెలిపారు. ముందుగా నిర్ణయించినట్లు ఈ నెల 18న కాకుండా 22వ తేదీ మధ్యాహ్నం శ్రీమతి షర్మిల నల్లగొండ జిల్లా వాడపల్లి వంతెన మీదుగా పొందుగుల గ్రామంలోకి ప్రవేశించి జిల్లాలో యాత్ర ప్రారంభిస్తారని వారు వెల్లడించారు.

వాస్తవానికి ఈ నెల 18నే గుంటూరు జిల్లాలో యాత్ర ప్రారంభం కావాల్సి ఉన్నా.. వర్షాలతో పాటు జిల్లాలో ఎన్నికల నిబంధనావళి అమలులో ఉన్నందున మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర 22 నుంచి మొదలవుతుందన్నారు. గుంటూరు జిల్లా కలెక్టర్‌ను పాదయాత్ర అనుమతి కోసం శనివారం కలిశామని, జిల్లాలో ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున జిల్లాయేతరులు ఈ నెల 19 నుంచి 21 వరకు జిల్లాలో ఉండకూడదని ఎన్నికల కమిషన్‌ ఆదేశాలు జారీ చేసిందని చెప్పినట్లు వివరించారు. ఇందుకు సహకరించాలని కలెక్టర్ కోరారన్నారు. దీంతో పార్టీ నేతలతో చర్చించి యాత్ర షెడ్యూ‌ల్‌లో మార్పు చేశామని వారు తెలిపారు.

గుంటూరు జిల్లాలోని 14 అసెంబ్లీ నియోజకవర్గాల్లో సుమారు 300 కిలోమీటర్ల మేర శ్రీమతి షర్మిల పాదయాత్ర కొనసాగుతుందని రాజశేఖర్‌, రఘురాం చెప్పారు. గురజాల, మాచర్ల, పెదకూరపాడు, సత్తెనపల్లి, నరసరావుపేట, చిలకలూరిపేట, తాడికొండ, గుంటూరు తూర్పు, గుంటూరు పశ్చిమ, ప్రత్తిపాడు, పొన్నూరు, తెనాలి, వేమూరు, మంగళగిరి నియోజకవర్గాల్లో మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర జరుగుతుందన్నారు. మంగళగిరి నియోజకవర్గంలో యాత్ర ముగిసిన అనంతరం కృష్ణా జిల్లాలోకి పాదయాత్ర ప్రవేశిస్తుందని రాజశేఖర్‌, రఘురాం వివరించారు.
Back to Top