<strong>మంచిర్యాల (ఆదిలాబాద్ జిల్లా) :</strong> వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు శ్రీమతి విజయమ్మ ఈ నెల 17న ఆదిలాబాద్ జిల్లా నిర్మల్‌లో నిర్వహించే బహిరంగ సభలో ప్రసంగిస్తారు. నిర్మల్‌లోని ఎన్టీఆర్ మినీస్టేడియంలో ఈ బహిరంగ సభ జరుగుతుంది. ఈ సభలోనే, శ్రీమతి విజయమ్మ సమక్షంలో మాజీ ఎంపి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, జిల్లా కో-ఆపరేటివ్ బ్యాంకు మాజీ చైర్మన్ రామకృష్ణారెడ్డి, బోధ్ మార్కెట్ కమిటీ చైర్మన్ తూల శ్రీనివాన్ వైయస్‌ఆర్ సిపిలో చేరనున్నారు. వారితో పాటు కాంగ్రెస్ పార్టీకి చెందిన జెడ్పీటిసిలు, ఎంపిటిసిలు, సర్పంచ్‌లు, పార్టీ కార్యకర్తలు భారీ సంఖ్యలో పార్టీలో చేరతారని వైయస్‌ఆర్‌సిపి ఆదిలాబాద్ జిల్లా కన్వీనర్ బోడ జనార్ధన్ తెలిపారు.<br/>కాగా, పశ్చిమ జిల్లా పరిధిలోని ఐదు నియోజకవర్గాల ఇన్‌చార్జీల సమావేశాన్ని ఈ నెల 10న నిర్మల్‌లో ఏర్పాటు చేసినట్లు జనార్దన్ పేర్కొన్నారు. ఈ సమావేశానికి నిర్మల్, ఆదిలాబాద్, ముథోల్, ఖానాపూర్, బోథ్ నియోజకవర్గాల పరిధిలోని మండల పార్టీ కన్వీనర్లు, జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు, అనుబంధ సంఘాల కన్వీనర్లు హాజరు కానున్నారు. తూర్పు జిల్లా పరిధిలోని మంచిర్యాల, ఆసిఫాబాద్, కాగజ్‌నగర్, బెల్లంపల్లి, చెన్నూరు నియోజకవర్గాల ఇన్‌చార్జిలు, ముఖ్య కార్యకర్తలకు శ్రీమతి విజయమ్మ బహిరంగ సభకు జనసమీకరణ బాధ్యతలు అప్పగించారు.<br/>రాష్ట్ర ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కారం కావాలంటే, దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి తనయుడు శ్రీ వైయస్ జగన్మోహన్‌రెడ్డి నాయకత్వాన్ని బలపర్చాల్సిన అవసరం ఉందని బోడ జనార్దన్ పిలుపునిచ్చారు. నిర్మల్ బహిరంగ సభకు జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల నుంచి అన్ని వర్గాల ప్రజలు భారీ సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.