హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పట్టిసీమ ప్రాజెక్టు పేరుతో 1600 కోట్ల రూపాయలను నీటి పాలు చేసిందని ప్రతిపక్ష నేత, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విమర్శించారు. పట్టిసీమలో స్టోరేజ్ కెపాసిటీ లేకున్నా...పట్టిసీమ పూర్తిచేశామని బాబు గొప్పగా చెప్పుకోవడం విడ్డూరమన్నారు. పట్టిసీమకు పెట్టే ఖర్చు హంద్రీనీవాకో, గాలేరు-నగరికో ఖర్చుపెట్టి ఉంటే బాగుండేదన్నారు. ఏపీ అసెంబ్లీలో పట్టిసీమ ప్రాజెక్ట్పై చర్చలో వైఎస్ జగన్ మాట్లాడారు. <br/>అనంతరం వైఎస్ జగన్ మాట్లాడుతూ.. 180 టీఎంసీల నీరు అవసరమయ్యే కృష్ణా డెల్టాకు, 4 టీఎంసీల పట్టిసీమ ప్రాజెక్టు ద్వారా కాపాడటం సాధ్యమా అని ప్రశ్నించారు. పోలవరం ప్రాజెక్టులో 190 టీఎంసీల స్టోరేజ్ ఉందని, అందుకే అది పోల"వరమైందని" చెప్పారు. స్టోరేజ్ కెపాసిటీ కోసమే పోలవరం ప్రాజెక్ట్ను ప్రతిపాదించారని పేర్కొన్నారు. పోలవరం కుడికాలువను దివంగత మహానేత వైఎస్ఆర్ తవ్విస్తే, ఆ కాలువల ద్వారా బాబు పట్టిసీమ నీళ్లు తీసుకెళ్లారని తెలిపారు.