16 మందిపై వేటు వేయండి

అవినీతి సొమ్ముతో  అనైతిక పనులు
పట్టపగలే ప్రజాస్వామ్యం ఖూనీ
పార్టీ ఫిరాయించిన వారిపై వేటుకు డిమాండ్
రాజీనామా చేసి ప్రజల్లోకి రావాలని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేల సవాల్

హైదరాబాద్ః అవినీతి సొమ్ముతో ఎమ్మెల్యేలను ప్రలోభపెడుతూ చంద్రబాబు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, విశ్వేశ్వర్ రెడ్డి మండిపడ్డారు. ఓ పార్టీ తరపున గెలిచిన ఎమ్మెల్యేలు అనైతికంగా మరో పార్టీలోకి మారడం ప్రజలను వంచించడమేనని దుయ్యబట్టారు. అలా చేయడం చట్ట వ్యతిరేకమన్నారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలంతా రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీలో  వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు బుగ్గన, విశ్వేశ్వర్ రెడ్డి స్పీకర్ ను కలిశారు. పార్టీ ఫిరాయించిన 16 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని కోరారు. 

అక్కడో రూల్, ఇక్కడో రూలా..
బాబు  ఏవిధంగా ఎమ్మెల్యేల‌ను ప్ర‌లోభాల‌కు గురి చేసి అధికార పార్టీలోకి తీసుకుంటున్నారో ప్ర‌జ‌లంతా గ‌మ‌నిస్తున్నార‌ని ఎమ్మెల్యేలు చెప్పారు.  పూర్తి మెజారిటీ ఉన్నా కూడా ఎమ్మెల్యేలను కొనడంలో  మీ ఉద్దేశ్యమేంటని అధికారపార్టీని నిలదీశారు. తెలంగాణలో టీడీపీ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ లోకి వెళుతుంటే పశువుల మాదిరి కొంటున్నారని మాట్లాడిన చంద్రబాబు....ఏపీలో చేస్తున్నదేంటని ప్రశ్నించారు. మీరు చేస్తే నీతి, వేరేవాళ్లు చేస్తే అన్యాయమా. అక్కడ ఓ రూల్..ఇక్కడ ఓ రూలా అంటూ బాబుపై ధ్వజమెత్తారు పార్టీ మారిన ఎమ్మెల్యేలంద‌రూ అభివృద్ధి కోస‌మే పోతున్నామని  చెప్ప‌డం విడ్డూరంగా ఉంద‌ని ఎద్దేవా చేశారు. 

చట్టాలు, రూల్స్ బ్రేక్ చేస్తూ అరాచక పాలన
పొద్దున లేస్తే నా అంత అనుభ‌వం, వ‌య‌స్సు, క్యారెక్ట‌ర్, విజన్ ఎవ‌రికీ లేద‌ని చెప్పే చంద్ర‌బాబు మ‌రి ఆ అనుభ‌వాన్ని, క్యారెక్ట‌ర్‌ను ప్ర‌జ‌ల‌కు ఏ విధంగా ఉప‌యోగిస్తున్నార‌ని ప్ర‌శ్నించారు. కొత్త రాష్ట్రానికి ఒక దిక్సూచి చూపించాల్సిన నాయ‌కుడే అడ్డ‌దారిలో వెళ్తున్నార‌ని ఆయ‌న మండిప‌డ్డారు. ఓ సింబల్ పై గెలిచిన ఎమ్మెల్యేలంతా వ్యతిరేక విధానాలు చేస్తే అనర్హతకు గురవుతారని ఫిరాయింపుల నిరోధక చట్టం క్లియర్ గా చెబుతోందని బుగ్గన అన్నారు. చ‌ట్టాన్ని, రూల్స్‌ను వ్య‌తిరేకిస్తూ న‌వ్యాంధ్ర‌ప్ర‌దేశ్‌కు  మంచి ప‌రిపాల‌న ఇస్తామన‌డం బాబు చెప్పడం హాస్య‌ాస్ప‌దమన్నారు. దేశ రాజ‌ధాని ఢిల్లీలో ప్ర‌తి రాజ‌కీయ నాయ‌కుడు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో అడ్డ‌గోలుగా చ‌ట్ట‌వ్య‌తిరేకంగా జరుగుతున్న పనులు చూసి ముక్కున వేలేసుకుంటున్నార‌ని బుగ్గన అన్నారు.  

29 రాష్ట్రాల్లో ఒక్క ఏపీ గురించే ఎందుకు ఇలా..?
భార‌త‌దేశంలో 29 రాష్ట్రాలుండ‌గా కేవ‌లం ఒక్క ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వంపైనే ఎందుకు విమ‌ర్శ‌లు చేస్తున్నారో  బాబు తెలుసుకోవాలన్నారు. బాబు దేశానికి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ను అన్ని ర‌కాల అవినీతి, అక్ర‌మాల‌కు నిల‌యంగా చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. కొత్త రాష్ట్రానికి చంద్రబాబు చూపిస్తున్నదల్లా ఎవరికి క్యారెక్ట‌ర్ ఉండ‌కూడ‌ద‌ు, ఉంటే వారిని వ‌దిలిపెట్టేదీ లేద‌న్న‌ట్లు వ్యవహరిస్తున్నాడని ఫైరయ్యారు. చంద్ర‌బాబుకు అభివృద్ధి చేశామన్న న‌మ్మ‌కమే ఉంటే.... పార్టీ మారిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ప్ర‌జ‌ల్లోకి రావాలని సవాల్ విసిరారు. 2014కు ముందు వైఎస్ జగన్ తన పార్టీలోకి వచ్చిన ఎమ్మెల్యేల చేత రాజీనామా చేయించి ప్రజాతీర్పుకు పోయారని..అలా వారిని గెలిపించుకున్నారని బుగ్గన చెప్పారు. వైఎస్ జగన్ వ్యక్తిత్వం, బాబు వ్యక్తిత్వం ఎలాంటిదో  ప్రజలు ఆలోచన చేయాలన్నారు. ఏదో ఓ రోజు కేంద్రం గానీ, కోర్టులు గానీ న్యాయం చేస్తాయని తాము విశ్వసిస్తున్నామని బుగ్గన పేర్కొన్నారు.  
Back to Top