దాచేపల్లి దారుణం మీ నిర్లిప్తత వల్లే కదా బాబూ..


 

03–05–2018, గురువారం
బుద్దాలపాలెం, కృష్ణా జిల్లా

‘ఈ ప్రభుత్వం మా పట్ల నిర్లక్ష్యం వహిస్తోంది.. వ్యాయామ విద్యకు గ్రహణం పట్టింది..’ అంటూ కష్టాలు చెప్పుకొచ్చారు పీఈటీ నిరుద్యోగ విద్యార్థులు. భారతదేశంలో ఎక్కడా లేనివిధంగా ఈ ప్రభుత్వం ఉపాధ్యాయ నియామకాల్లో పీఈటీ విద్యార్థులకు టెట్‌ పరీక్ష నిర్వహిస్తోందట. ఈ పరీక్షలో ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌లో లేని సిలబస్‌ను కొత్తగా ప్రవేశపెడుతున్నారట. ఇది వారికి చాలా ఇబ్బందిగా ఉందని చెప్పారు. ఒక వినతిపత్రాన్ని నా చేతికిస్తూ ‘సార్‌.. ఈ చంద్రబాబు ప్రభుత్వం వ్యాయామ విద్యను పెద్దగా పట్టించుకోవడం లేదు. ఒక్క వైఎస్సార్‌గారే మా విద్యను గుర్తించారు.

ఒకేసారి 2,700 పోస్టులను భర్తీచేశారు. 2001లో ఇదే బాబుగారి హయాంలో స్కిల్‌ టెస్ట్‌ పెడితే.. అందులో విపరీతమైన అవకతవకలు, అవినీతి, అక్రమాలు జరిగాయి. ఇప్పుడు ఆయన పాలనలోనే స్కిల్‌ టెస్ట్‌ అంటే భయమేస్తోంది’ అని ఆందోళన వ్యక్తం చేశారు. విద్యను వ్యాపారమయం చేసి, ప్రయివేటు విద్యా మాఫియాకు కొమ్ముకాసే ప్రభుత్వానికి.. విద్యార్థుల ఆరోగ్యం మీద, మనోవికాసం మీద శ్రద్ధ ఏముంటుంది? ఆరోగ్యవంతమైన శరీరంలోనే ఆరోగ్యవంతమైన మెదడు ఉంటుందన్న స్వామివివేకానందుడి స్ఫూర్తికి పూర్తి విరుద్ధంగా.. వ్యాయామమనేది లేకుండా విద్యావ్యవస్థను నడిపించాలని చూడటం ఏరకంగానూ హర్షించదగ్గ విషయం కాదు.


ఈ రోజు కూడా బందరు పోర్టు భూముల గురించి వ్యథలు వినిపించాయి. చిలకలపూడి సహకార సంఘం అధ్యక్షుడు గాజుల నాగరాజు నన్ను కలవగానే.. బందరు పోర్టు భూసేకరణ దెబ్బకు ఛిద్రమవుతున్న బతుకు చిత్రాల గురించి వివరంగా చెప్పుకొచ్చాడు. ‘సార్‌.. మీ నాన్నగారి హయాంలో మా ఊళ్లలో రైతులు లక్షాధికారులైతే.. చంద్రబాబు పాలనలో భిక్షాధికారులయ్యే పరిస్థితి వచ్చింది’ అన్నాడు. ఆయనే మళ్లీ ‘అవును సార్‌.. నిజం. మీ నాన్నగారు బందరు పోర్టుకు కొబ్బరికాయ కొట్టగానే.. ఎకరా లక్ష రూపాయలున్న భూముల ధరలు ఏకంగా పాతిక లక్షలు, యాభై లక్షల వరకూ పలికాయి. వైఎస్సార్‌గారు మా పాలిట దేవుడయ్యారు. ఈ చంద్రబాబు పరిపాలనలో పోర్టు కోసమంటూ 33 వేల ఎకరాలకు నోటిఫికేషన్‌ ఇవ్వగానే.. ఒక్కసారిగా ధర పతనమైంది. ఎకరం విలువ పది, పదిహేను లక్షలకు పడిపోయింది. అది కూడా అమ్ముకునే పరిస్థితి లేదిప్పుడు. రిజిస్ట్రేషన్‌లు నిలుపుదల చేశారు.

భూములు తనఖా పెట్టి రుణాలు తీసుకునే పరిస్థితి లేదు, బ్యాంకులు పంటరుణాలివ్వవు. విచిత్రమేంటంటే.. చంద్రబాబుగారికి సన్నిహితులుగా ఉండే ఇద్దరు ప్రజాప్రతిని«ధులు మాత్రం మా వద్ద నుంచి పది, పన్నెండు లక్షలకు భూములు తీసుకునేందుకు ఎగబడుతున్నారు. ఏమన్నా ఉంటే తాము చూసుకోగలమన్న ధీమా వారిది. సొంత బిడ్డల్లాంటి మా భూముల్ని తన్నుకుపోయే రాబందుల్లా తయారయ్యారు. రాజధానిలాగే ఇక్కడ కూడా రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేస్తున్నారు’ అంటూ ఆ అన్న చాలా బాధగా చెప్పాడు. ఆయనే మళ్లీ ‘సార్‌.. గతంలో ఎకరం నలభై, యాభై లక్షలున్నప్పుడు పిల్లలకు ఎకరం, రెండెకరాలిచ్చి పెళ్లిళ్లు చేశారు. ఇప్పుడు భూముల ధరలు పడిపోగానే.. భూమి వద్దు ఆ నలభై.. యాభై లక్షలే ఇమ్మంటున్నారు.

కాపురాలు కూడా కూలిపోయే పరిస్థితి తలెత్తింది. ఇంతకు ముందు అనారోగ్యం పాలయినా, పిల్లలకు పెళ్లిళ్లు చేయాలన్నా మాకేం తక్కువ.. పొలాలున్నాయన్న ధైర్యం ఉండేది. ఇప్పుడా ధైర్యం పోయింది. మీ పాలన వచ్చేదాకా వేచి చూద్దామంటే.. ఈ ప్రభుత్వం ఇస్తావా.. చస్తావా.. అన్నట్టు మీదపడుతోంది’ అని తీవ్ర నిస్పృహ వ్యక్తపరిచాడు. కనీవిని ఎరుగని రీతిలో భూదందాకు తెగబడుతున్న ఈ పాలకులు, వారి అనుచరులు.. అన్ని విలువలకూ పాతరేస్తున్నారు. ఎంత అరాచకమిది! ఇంతమంది ప్రజల ఉసురు పోసుకుని ఏం బావుకోవాలనుకుంటున్నారు?

గుంటూరు జిల్లా దాచేపల్లిలో తొమ్మిదేళ్ల అమ్మాయిపై మరో మానవమృగం అత్యాచారానికి ఒడిగట్టిందన్న వార్త మనసును కలచివేసింది. గత కొన్ని నెలలుగా రాష్ట్రంలో ఇలాంటి అమానుష సంఘటనలు పెరిగిపోవడమన్నది.. నిజంగా సభ్య సమాజం సిగ్గుతో తలదించుకోవాల్సిన విషయం. ఈ దారుణాల్లోనూ మెజారిటీ దోషులు టీడీపీ వారే ఉండటం, దోషులకు శిక్షలు పడకపోవడం విచారకరం. దీనివల్ల ఇటువంటి ఘోరమైన నేరాలు పేట్రేగిపోతున్నాయి.

ముఖ్యమంత్రిగారికి నాదో ప్రశ్న.. మన రాష్ట్రంలో మహిళలపై, బాలికలపై దాడులు.. అత్యాచారాలు పెరిగిపోవడానికి మీ అలసత్వం, మీ వాళ్లను వెనకేసుకురావడమే కారణం కాదా? మానవత్వాన్నే మంటగలిపే ఇలాంటి సంఘటనల విషయంలో గతంలో మీరు కఠినంగా వ్యవహరించి ఉంటే.. ఈ రోజు దాచేపల్లిలో మరో దారుణం జరిగేదా?  
- వైయ‌స్‌ జగన్‌  
Back to Top