పోర్టుకు 33 వేల ఎకరాలు తీసుకోవడం దోపిడీ కాక మరేంటి బాబూ?

 
 
02–05–2018, బుధవారం 
పొట్లపాలెం, కృష్ణా జిల్లా 

‘రైతుల్ని చల్లగా చూడాలన్నా..’అంటూ గోపువానిపాలెం గ్రామానికి చెందిన చలమలశెట్టి స్వాతి అనే చెల్లెమ్మ అంది. ఏమైందమ్మా.. అని అడిగాను. మాకు తాతముత్తాతల నుంచి వచ్చిన 1.15 ఎకరాల భూమి ఉంది. దానిమీదే ఆధారపడి జీవిస్తున్నాం. పోర్టు కోసం అంటూ మా భూముల్ని లాక్కోవాలని చూస్తున్నారు. ఉన్న ఆ కాస్త భూమీ పోతే మేమెలా బతకాలి.. మాకు ఇద్దరు ఆడపిల్లలున్నారు. వారికి ఏమివ్వాలి.. వారికి చదువులెలా చెప్పించాలి.. పెళ్లిళ్లెలా చేయాలి.. ఒక వేళ, భూములిచ్చినా పరిహారం ఇస్తారన్న నమ్మకం లేదు. భూములిచ్చాక పరిహారం కోసం ఆఫీసుల చుట్టూ, నాయకుల చుట్టూ తిరగాల్సి వస్తే మా పరిస్థితేంటి.. ఎవరు పట్టించుకుంటారు.. రాజధానికి భూములిచ్చిన రైతుల పరిస్థితి చూశాక మాలో భయం మరింత పెరిగిందన్నా.. చంద్రబాబును నమ్మే పరిస్థితి లేదు.. మీ ప్రభుత్వం వచ్చాకన్నా రైతుల్ని బాగా చూసుకోవాలి’అని ఎంతో ఆవేదనగా, ఆర్తిగా చెప్పింది.  

సాయంత్రం పొట్లపాలెంలో కలిసిన అక్కచెల్లెమ్మలదీ అదే బాధ. వేణుమాణిక్యం అనే అక్క ‘అన్నా.. మేమంతా పాడిపంటల మీద ఆధారపడి బతుకుతున్నాం. ఈ ప్రభుత్వం వచ్చాక మా పాడిని దెబ్బకొట్టారు.. ఉన్న పంటనేలనూ పోర్టు కోసం లాక్కోవాలనుకుంటున్నారు. పోర్టు భూములంటూ ప్రకటించాక.. బ్యాంకులు రుణాలు కూడా ఇవ్వడం లేదు. ఎకరం సుమారు రూ.50 లక్షలకు పైగా విలువచేసే మా భూముల్ని పది, పన్నెండు లక్షలకే దౌర్జన్యంగా తీసుకోవాలనుకుంటోందీ ప్రభుత్వం. ప్రభుత్వం మాది.. మేం చెప్పిన రేటుకే ఇవ్వాలి.. అంటే ఎలా? మమ్మల్ని చంపినాసరే సెంటు భూమి కూడా ఇవ్వం’అంటూ ఆగ్రహం వ్యక్తంచేసింది. ఈ ప్రభుత్వం బలవంతంగా భూముల్ని లాక్కుంటుందేమో.. పరిహారం కూడా రాదేమోనన్న భయంతో కొందరు తక్కువ ధరకే భూముల్ని అమ్మేసుకున్నారట. ఎంత దారుణం? పోర్టు నిర్మాణం ముసుగులో స్వార్థ ప్రయోజనాల కోసం పేదల పొట్టగొట్టడం ఎంత అన్యాయం? 4,800 ఎకరాల్లోనే సకల సౌకర్యాలతో అధునాతన పోర్టును నిర్మించవచ్చని తెలిసి కూడా.. మచిలీపట్నం పట్టణానికి ఆనుకుని ఉన్న అత్యంత విలువైన 33 వేల ఎకరాల భూముల్ని తీసుకోవాలనుకోవడంలో ఆంతర్యమేంటి? ఇది దోపిడీ కాక మరేంటి? భూముల్ని త్యాగం చేసిన రైతులు ఆనందంగా లేనప్పుడు అది అభివృద్ధి ఎలా అవుతుంది? 


‘తమ్ముడూ..’అంటూ ఆప్యాయంగా పిలుస్తూ.. వైద్య ఆరోగ్యశాఖలో పనిచేస్తున్న ఏఎన్‌ఎంలు కలిశారు. ‘పదిహేడేళ్లుగా కాంట్రాక్టు ఉద్యోగులుగా పనిచేస్తున్నాం. ఇప్పటికీ రూ.10 వేలే జీతం. మాతో గొడ్డుచాకిరీ చేయించుకుంటున్నారు. ప్రతి అధికారపార్టీ మీటింగ్‌కి బెదిరించిమరీ తీసుకెళుతున్నారు. మొన్న జరిగిన బాబుగారి దీక్షకూ అట్లాగే తీసుకెళ్లారు. కానీ.. మా గురించి మాత్రం ఆయన అస్సలు పట్టించుకోరు’అంటూ ఓ సోదరి బాధనంతా వ్యక్తం చేసింది. మరో అక్క ‘మీ నాన్నగారి హయాంలో నేను రెగ్యులరైజ్‌ అయ్యాను. కాంట్రాక్టు ఉద్యోగులను ఆయన విడతలవారీగా రెగ్యులరైజ్‌ చేస్తూ వచ్చారు. పెరిగిన జీతాలూ ఆయన పుణ్యమే. వైఎస్సార్‌ చేయగలగడమేంటి.. చంద్రబాబు చేయలేకపోవడమేంటి’అంటూ ప్రశ్నించింది. ఎవరికైనా మంచి చేయాలంటే మానవత్వం, చిత్తశుద్ధి ఉండాలి. అవిలేని పాలకుల నుంచి న్యాయం ఆశించడం అత్యాశేనేమో!  

దారి పక్కనే ఉన్న చిన్న బడ్డీ కొట్టును చూపిస్తూ ‘అన్నా.. ఈ కొట్టే మాకు ఆధారం. తెల్లారి నుంచి రాత్రి దాకా ఇందులోనే కూర్చుని పైసాపైసా పోగేసుకున్న డబ్బు రూ.లక్షన్నరను అగ్రిగోల్డ్‌లో పెట్టి అన్యాయమైపోయాం’అంటూ కన్నీళ్లు పెట్టుకుంది దాసరి సంధ్య అనే అక్క. ‘ఈ ప్రభుత్వంలో న్యాయం జరుగుతుందన్న నమ్మకం లేదు. మీరు వచ్చాకైనా తప్పకుండా ఇప్పించాలి’అంటూ కన్నీటితో గోడు వెళ్లబోసుకుంది. రెక్కల కింద పొదువుకున్న బిడ్డను గద్దొచ్చి ఎత్తుకుపోయినట్టు.. పేద ప్రజల కష్టార్జితాన్ని కొట్టేసిన మోసగాళ్లను ఏమనాలి? కొట్టేసిన సొమ్ముతో ఆ మోసగాళ్లు పోగేసుకున్న ఆస్తుల్ని మింగేయాలని చూస్తున్న ఈ పాలకుల్ని ఇంకేమనాలి? 

ముఖ్యమంత్రిగారికి నాదో ప్రశ్న.. కేవలం రూ.1,100 కోట్లు విడుదల చేస్తే.. దాదాపు 80 శాతం మంది అగ్రిగోల్డ్‌ బాధితులకు న్యాయం జరుగుతుందని తెలిసి కూడా.. ఇప్పటికైనా ఆ పనిచేయకపోవడానికి కారణమేంటి? ఆ సంస్థ ఆస్తులను చౌకగా కొట్టేయడానికి నిందితులతో తెరచాటు బేరసారాలు చేయడం ఎంత వరకు ధర్మం?  
- వైయ‌స్‌ జగన్‌  





Back to Top